Viral: తుపాకీతో టీచర్‌ పొట్టలో కాల్చిన విద్యార్థులు.. కారణమేంటంటే?..

ABN , First Publish Date - 2023-06-24T11:12:56+05:30 IST

ట్యూషన్ ఫీజ్ విషయంలో నెలకొన్న వివాదంలో ఓ టీచర్‌ను పూర్వ విద్యార్థులు తుపాకీతో కాల్చిన ఘటన మధ్యప్రదేశ్‌లోని మొరెనా జిల్లాలో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సదరు ఉపాధ్యాయుని పరిస్థితి విషమంగా ఉంది.

Viral: తుపాకీతో టీచర్‌ పొట్టలో కాల్చిన విద్యార్థులు.. కారణమేంటంటే?..

మధ్యప్రదేశ్‌: ట్యూషన్ ఫీజ్ విషయంలో నెలకొన్న వివాదంలో ఓ టీచర్‌ను పూర్వ విద్యార్థులు (Ex-students) తుపాకీతో కాల్చిన ఘటన మధ్యప్రదేశ్‌లోని (Madhya Pradesh) మొరెనా జిల్లాలో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సదరు ఉపాధ్యాయుని పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గిర్వార్ సింగ్ అనే ఉపాధ్యాయుడు చాలా కాలంగా మొరెనాలో ఓ కోచింగ్ సెంటర్ (coaching centre) నడుపుతున్నాడు. మూడేళ్ల క్రితం సోదరులైన విద్యార్థులు వివేక్ రాథోడ్, వినయ్ రాథోడ్ ఈ కోచింగ్ సెంటర్‌లో చదువుకున్నారు. కానీ సదరు విద్యార్థులు ట్యూషన్ ఫీజ్ చెల్లించలేదు. దీంతో ఉపాధ్యాయుడు గిర్వార్ సింగ్ సదరు విద్యార్థులు కనిపించినప్పుడల్లా ట్యూషన్ ఫీజ్ అడుగుతుండేవాడు. నలుగురిలో తమను ట్యూషన్ ఫీజ్ అడగడాన్ని అవమానంగా భావించిన ఆ విద్యార్థులు ఉపాధ్యాయుడిపై పగ పెంచుకున్నారు.

ఈ క్రమంలోనే ఉపాధ్యాయుడు గిర్వార్ సింగ్‌ను చంపాలని సోదరులైనా ఆ విద్యార్థులు నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా గిర్వార్ సింగ్ తన కోచింగ్ సెంటర్‌లో ఇంగ్లీష్ పాఠం బోధిస్తున్నప్పుడు మాట్లాడడానికి బయటికి పిలిచి మాటమాంతీ జరిపారు. ఇంతలోనే ద్విచక్రవాహనంపై వెనుక కూర్చున్న విద్యార్థి తన వెంట తెచ్చుకున్న తుపాకీతో గిర్వార్ సింగ్‌పై కాల్పులు జరిపాడు. గిర్వార్ సింగ్ పొట్టలో కాల్చాడు. అనంతరం సోదరిలిద్దరూ అక్కడి నుంచి పారిపోయారు. కాగా ఈ ఘటన అక్కడే ఉన్న సీసీటీవీ పుటేజీలో (CCTV camera) రికార్డైంది.

కాల్పుల్లో గాయపడిన గిర్వార్ సింగ్‌ను స్థానికులు వెంటనే మొరెనాలోని జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం గ్వాలియర్ తరలించారు. ప్రస్తుతం గిర్వార్ సింగ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై సిటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (CSP) మోరీనా అతుల్ సింగ్ మాట్లాడుతూ నిందితులపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేశామని తెలిపారు. అలాగే సీసీటీవీ పుటేజీ ఆధారంగా నిందితులను పట్టుకోవడానికి గాలిస్తున్నట్లు చెప్పారు. కాగా ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.

Updated Date - 2023-06-24T11:12:56+05:30 IST