‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమా సీన్ రిపీట్.. రూ.10 విషయంలో వివాదం.. దారుణ హత్య
ABN , First Publish Date - 2023-06-30T07:43:45+05:30 IST
పేకాటలో రూ.5 విషయంలో వివాదం రావడం రాయలసీమలో ఫ్యాక్షన్ గొడవలకు దారి తీసిన ఘటన మనం జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమాలో చూశాం. అచ్చం అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురిలో చోటుచేసుకుంది.
లక్నో: పేకాటలో రూ.5 విషయంలో వివాదం రావడం రాయలసీమలో ఫ్యాక్షన్ గొడవలకు (Rayalaseema Faction Fights) దారి తీసిన ఘటన మనం జూనియర్ ఎన్టీఆర్ (NTR) నటించిన ‘అరవింద సమేత వీర రాఘవ’ (Aravinda Sametha Veera Raghava) సినిమాలో చూశాం. అచ్చం అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురిలో (Uttar Pradesh’s Mainpuri) చోటుచేసుకుంది. రూ.10 విషయంలో వివాదం నెలకొనడంతో ఓ వ్యక్తి దుకాణదారుడిని తుపాకీతో కాల్చిచంపాడు. జూన్ 12న ఈ ఘటన జరగగా పక్షం రోజుల తర్వాత పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
విచారణలో నిందితుడు చెప్పిన విషయాలు విన్న పోలీసులు ఆశ్చర్యానికి గురయ్యారు. అదనపు పోలీసు సూపరింటెండెంట్ రాజేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఘిరోర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫైజ్‌పూర్ గ్రామానికి చెందిన మహేశ్‌చంద్ జాతవ్ అనే వ్యక్తి మెయిన్‌పురిలో ఓ దుకాణాన్ని నడుపుతున్నాడు. ఆ దుకాణంలో పెట్రోల్‌తోపాటు ఇతర వస్తువులను కూడా అమ్ముతున్నాడు. నగ్లా కెహ్రీ గ్రామానికి చెందిన ఉల్ఫాన్ అలియాస్ గుల్ఫామ్ అలియాస్ గుల్లా బంజారా ఓ రోజు మహేష్ దుకాణంలో పెట్రోల్ కొనుగోలు చేశాడు. ఈ క్రమంలో రూ.10 విషయంలో ఇద్దరి మధ్య వివాదం నెలకొంది.
రూ.10 తక్కువగా ఉండడంతో తీసుకోవడానికి దుకాణదారుడు మహేష్ నిరాకరించాడు. ఉల్ఫాన్ డబ్బులు తక్కువగా ఉన్నాయని, రూ.10 తక్కువ తీసుకోమని కోరినప్పటికీ దుకాణదారుడు మహేష్ వినలేదు. పైగా ఉల్ఫాన్‌ను బైక్ తీసుకెళ్లకుండా అడ్డుకున్నాడు. డబ్బులు మొత్తం ఇచ్చాకే బైక్ తీసుకెళ్లాలని హెచ్చరించాడు.
దీంతో చేసేదేమి లేక కాలినడకన ఇంటికెళ్లిన ఉల్ఫాన్ రూ.10 తెచ్చి ఇచ్చాడు. అనంతరం తన బైక్‌ను తీసుకెళ్లాడు. అయితే రూ.10 కోసం కాలినడకన ఇంటికెళ్లి డబ్బులు తీసుకురావడాన్ని అవమానంగా భావించిన ఉల్ఫాన్.. ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. జూన్ 12న రాత్రి మహేష్ తన దుకాణంలో మంచం మీద నిద్రిస్తున్నాడు. అక్కడికెళ్లిన ఉల్ఫాన్ తుపాకీతో అతని తలపై కాల్చి చంపాడు. ఈ ఘటన జరిగిన 15 రోజుల తర్వాత అంటే జూన్ 27న నిందితుడు ఉల్ఫాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉల్ఫాన్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.