AP News: ప్రతిపాదన అమలైతే నిరుద్యోగులకు నిరాశే!?

ABN , First Publish Date - 2023-03-06T14:26:15+05:30 IST

ఉన్నత విద్యారంగంలో మరో కీలక మార్పునకు ప్రభుత్వం (YCP Government) సన్నద్ధమవుతోంది. ఇప్పటికే పదవీ విరమణ వయసును (Retirement Age)

AP News: ప్రతిపాదన అమలైతే నిరుద్యోగులకు నిరాశే!?
నిరుద్యోగులకు నిరాశే!?

బోధన సిబ్బందికి 65 ఏళ్లు?

పదవీ విరమణ ప్రయోజనాలకు నిధులు లేకేనా!

ఇప్పటికే ఉన్నత విద్యాశాఖలో ప్రతిపాదన

ఆర్థికశాఖ నుంచి అభ్యంతరాలు

అధిగమించి అమలు చేసేందుకు తాజా యత్నం

అమలైతే నిరుద్యోగులకు నిరాశే

(అమరావతి-ఆంధ్రజ్యోతి): ఉన్నత విద్యారంగంలో మరో కీలక మార్పునకు ప్రభుత్వం (YCP Government) సన్నద్ధమవుతోంది. ఇప్పటికే పదవీ విరమణ వయసును (Retirement Age) ఉద్యోగులకు 62 ఏళ్లకు పెంచగా, విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న బోధన సిబ్బందికి ఏకంగా 65ఏళ్లకు పెంచేందుకు ఇప్పుడు కసరత్తు మొదలుపెట్టింది. కొద్ది నెలల కిందటే దీనిపై ప్రతిపాదనలు రూపొందించగా, ఆర్థికశాఖ అభ్యంతరాలతో నిలిచిపోయింది. తాజాగా అభ్యంతరాలను అధిగమించి 65 ఏళ్లు చేసేందుకు ఉన్నత విద్యాశాఖ (Higher Education) చర్యలు వేగవంతం చేసినట్లు తెలిసింది. ఇందుకోసం యూనివర్సిటీల్లో బోధన సిబ్బంది కొరత వల్ల బోధన కుంటుపడుతోందనే సాకును చూపించనుంది. వాస్తవంగానే యూనివర్సిటీల్లో బోధన సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. 17 యూనివర్సిటీల్లో ప్రొఫెసర్‌ పోస్టులు 598 ఉంటే, 316 మంది మాత్రమే పనిచేస్తున్నారు. అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు 1,080 ఉంటే 199 మంది మాత్రమే పనిచేస్తున్నారు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు 2,224కి గాను 533 మంది మాత్రమే ఉన్నారు. గత కొన్నేళ్లుగా పలు న్యాయ వివాదాలతో నియామకాలు నిలిచిపోవడంతో కొరత ఇంకా పెరుగుతోంది. ఏటా అనేక మంది రిటైరై వెళ్లిపోతుండటం కొరతను పెంచుతోంది.

ఇతర రాష్ర్టాల్లో ఉందా?

ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కేందుకే ఈ ప్రతిపాదన పెట్టారనే వాదన బలంగా వినిపిస్తోంది. 65 ఏళ్లకు పెంచితే, వచ్చే ఎన్నికల వరకూ వారెవరికీ రిటైర్మెంట్‌ ప్రయోజనాలు చెల్లించే పని ఉండదనే ఆలోచనతోనే ఈ ప్రతిపాదన పెట్టి ఉండొచ్చన్న సందేహాలున్నాయి. ఇతర రాష్ర్టాల్లో 65 ఏళ్ల విధానం ఉందా? ఈ పెంపు వల్ల జాబ్‌ క్యాలెండర్‌ పరిస్థితి ఏంటి? అనే అంశాలపై ఆర్థికశాఖ వివరణ అడిగినట్లు తెలిసింది. దీన్ని అమలుచేస్తే ఇక యూనివర్సిటీల్లో పోస్టుల భర్తీ మాటే ఇప్పట్లో తలెత్తదని, ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు నిరాశే మిగులుతుందని అంటున్నారు. మరోవైపు యూనివర్సిటీల్లోని బోధనేతర సిబ్బందికి రిటైర్మెంట్‌ వయసు 62ఏళ్లు చేయడంపై 15 నెలలుగా హామీలు ఇస్తున్నా, అమలు కావడంలేదు. 62 ఏళ్లకు పెంచుతారన్న ఆశతో గత ఏడాది కాలంలో రిటైరైన ఉద్యోగులు రిటైర్మెంట్‌ ప్రయోజనాల కోసం దరఖాస్తు చేయలేదు. అటు పొడిగింపూ లేక, ఇటు ప్రయోజనాలూ పొందక రెంటికీ చెడ్డ రేవడిలా మిగిలిపోయారు.

నాటి నియామకాల వివాదం ముగిసేనా?

2017లో అప్పటి ప్రభుత్వం ఏపీపీఎస్సీ (APPSC) నోటిఫికేషన్‌ ద్వారా కృష్ణా, రాయలసీమ, యోగి వేమన, జేఎన్‌టీయూ-అనంతపురం యూనివర్సిటీల్లో ప్రొఫెసర్‌ పోస్టులు భర్తీ చేసింది. అయితే, అలహాబాద్‌ హైకోర్టు తీర్పు ప్రకారం వర్సిటీల్లోని నియామకాల్లోనూ రోస్టర్‌ విధానం వర్తిస్తుందని, కానీ, ఇక్కడ పాటించలేదని కొందరు హైకోర్టును ఆశ్రయించారు. అప్పటి అధికార పార్టీపై కోపంతో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీనే (YCP) ఆ పిటిషన్లు వేయించిందన్న ఆరోపణలున్నాయి. అనంతరం ఆ నియామకాలపై ఉన్నత విద్యాశాఖ విచారణకు ఆదేశించింది. ఆ తర్వాత ఈ నియామకాలు చెల్లవంటూ నోటిఫికేషన్‌ను హైకోర్టు రద్దు చేసింది. అయినప్పటికీ ఆ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ అయినవారిలో కొందరు ఉద్యోగాల్లో కొనసాగారు. ఆ తర్వాతా వారి తొలగింపునకు ఒత్తిడి రావడంతో కొందరు డివిజన్‌ బెంచ్‌కు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. వైసీపీకి అనుకూలంగా వ్యవహరించే వారు ఉండటంతో స్టే ఆర్డర్‌ తెచ్చుకున్నది కూడా వారేననే విమర్శలున్నాయి. అంటే మొదట కొట్టివేయాలని పిటిషన్‌ వేసిందీ, తర్వాత కొట్టివేతపై స్టే తెచ్చుకున్నదీ వైసీపీ వారేనని అర్థమవుతోంది. దీంతో ఈ న్యాయ వివాదం ఇప్పట్లో ముగుస్తుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇది కూడా చదవండి: షాకింగ్ ఘటన.. పక్కింటి వాళ్లు పెళ్లికి పిలవలేదని ఓ వ్యక్తి వింత నిర్వాకం..!

Updated Date - 2023-03-06T14:26:15+05:30 IST