సీఆర్పీఎఫ్‌ పరీక్షలో స్థానిక భాషేది? కేంద్రానికి పలు రాష్ట్రాలు లేఖలు

ABN , First Publish Date - 2023-04-08T11:06:07+05:30 IST

సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష రాయాలనుకునే అభ్యర్థి.. ఏ ప్రాంతీయ భాషనైనా ఎంపిక చేసుకోవచ్చు.. తనకు నచ్చిన మాధ్యమంలో రాసుకోవచ్చు. కానీ..

సీఆర్పీఎఫ్‌ పరీక్షలో స్థానిక భాషేది? కేంద్రానికి పలు రాష్ట్రాలు లేఖలు
language

ఇంగ్లిష్‌, హిందీలోనే నిర్వహణపై అభ్యంతరాలు

హిందీయేతర రాష్ట్రాల అభ్యర్థుల నుంచి వ్యతిరేకత

తీవ్ర పోటీతో చేజారుతున్న ఉద్యోగ అవకాశాలు

గతంలో ఎస్సెస్సీ వ్యవహార సరళిపైనా నిరసనలు

సీఎం కేసీఆర్‌ సహా పలు రాష్ట్రాల మంత్రుల లేఖలు

చివరకు ప్రాంతీయ భాషల్లో నాన్‌ టెక్నికల్‌ పరీక్షలు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష రాయాలనుకునే అభ్యర్థి.. ఏ ప్రాంతీయ భాషనైనా ఎంపిక చేసుకోవచ్చు.. తనకు నచ్చిన మాధ్యమంలో రాసుకోవచ్చు. కానీ.. పదో తరగతి విద్యార్హతతో నిర్వహించే సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (CRPF) నియామక పరీక్షలో మాత్రం అటువంటి అవకాశమే లేదు. కేవలం హిందీ, ఇంగ్లిష్‌ మాధ్యమంలోనే పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఇదొక్కటే కాదు.. నౌకాదళం, ఎయిర్‌ఫోర్స్‌, ఆర్మీ ఉద్యోగాల భర్తీకి నిర్వహించే పరీక్షల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఈ అంశంపై తెలంగాణ, దక్షిణాది రాష్ట్రాలతోపాటు హిందీయేతర రాష్ట్రాల అభ్యర్థుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సీఆర్పీఎఫ్‌లో 1.30 లక్షల కానిస్టేబుల్‌ ఉద్యోగాల భర్తీకి కేంద్ర హోంశాఖ ఇటీవల నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇందులో 1,25,262 ఉద్యోగాలకు పురుషులు, 4,667 పోస్టులకు మహిళలు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. ఇంత వరకూ బాగానే ఉన్నా.. పరీక్షను ఇంగ్లిష్‌, హిందీలో మాత్రమే నిర్వహిస్తామని నోటిఫికేషన్‌లో పేర్కొనడం వివాదాస్పదమవుతోంది. సీఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ (CRPF Constable) ఉద్యోగాలకు తెలంగాణ నుంచి నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకుంటారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత యువత, నిరుద్యోగులే పోటీ పడుతుంటారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఉన్నత చదువులు చదవలేక, కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలబడాలన్న ఆకాంక్షతో చదువుకు తగ్గ ఉద్యోగంలో చేరేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అలాంటి వారికి తమకు వచ్చిన భాషలో పరీక్ష రాసే సదుపాయం లేకపోవడం ఇబ్బందికరంగా మారుతోంది. పోటీని తట్టుకోలేక చాలా మంది ఉద్యోగ అవకాశం కోల్పోతున్నారు.

తెలంగాణ (Telangana) తో పాటు దక్షిణాది ప్రాంత అభ్యర్థుల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని స్థానిక భాషల్లో పరీక్ష రాసేందుకు అనుమతివ్వాలనే అభ్యర్థనలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా సీఆర్పీఎఫ్‌ ఉద్యోగాల భర్తీ పరీక్షను తెలుగులో నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ కేంద్ర హోం మంత్రికి కేటీఆర్‌ (KTR) లేఖ రాయండతో ఈ అంశం మరో సారి తెర మీదకు వచ్చింది. అయితే, సీఆర్పీఎఫ్‌ అనేది కేంద్ర సంస్థ కావడంతో హిందీతోపాటు ఇంగ్లిష్‌లో పరీక్ష రాసే అవకాశం కల్పించారని, తెలుగు లేదా ఇతర స్థానిక భాషల్లో పరీక్ష నిర్వహించడం ఇబ్బందులకు దారి తీసే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

ఎస్సెస్సీపై ఫలించిన ఒత్తిడి

ఉద్యోగ పరీక్షలను మాతృభాషల్లో రాసే అవకాశం ఇవ్వకపోవడంపై పలు హిందీయేతర రాష్ట్రాల్లో ఆందోళనలు నెలకొన్నాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఈ ఆందోళన ప్రబలంగా ఉంది. త్వరలో జరగనున్న కర్ణాటక ఎన్నికల్లోనూ ఇదో ప్రచారాస్త్రంగా మారే అవకాశం కనిపిస్తోంది. కేంద్రం విధానాలను ఎండగడుతూ.. రాష్ట్రంలోని నిరుద్యోగుల్లోకి ఈ అంశాన్ని బలంగా తీసుకెళ్లాలని అధికార బీఆర్‌ఎస్‌ యోచిస్తోంది. గతంలోనూ స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌(ఎస్సెస్సీ) వ్యవహర సరళిపైనా ఇదే తరహాలో విమర్శలు వ్యక్తమయ్యాయి. ఎస్సెస్సీ పరీక్షలను ప్రాంతీయ భాషలో నిర్వహించాలంటూ తెలంగాణ సీఎం కేసీఆర్‌తోపాటు తమిళనాడు సీఎం కేంద్రానికి లేఖలు రాశారు. ఆ ఒత్తిడి ఫలితంగా కొన్ని పరీక్షలను ప్రాంతీయ భాషల్లో నిర్వహించేందుకు ఎస్సెస్సీ ఓకే చెప్పింది. ఇందులో భాగంగానే నాన్‌ టెక్నికల్‌ ఉద్యోగ పరీక్షలను తెలుగుతోపాటు ఇతర ప్రాంతీయ భాషల్లో నిర్వహిస్తోంది. కానీ, టెక్నికల్‌ ఉద్యోగ పరీక్షలను మాత్రం ఇప్పటికీ హిందీ, ఇంగ్లిష్‌లోనే నిర్వహిస్తోంది.

ఇలా చేస్తే ఎంతమంది రాయగలరు!

రాష్ట్రంలో నిర్వహించే గ్రూప్‌-1 పరీక్షను ఆంగ్లంతోపాటు తెలుగులోనూ నిర్వహిస్తారు. ఒకవేళ అంతా ఆంగ్లంలోనే రాయాలంటే... రాష్ట్రంలో ఆ పరీక్ష రాసే వారిలో సగం మందికి పైగా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. డిగ్రీ విద్య అర్హతతో రాసే పరీక్షలోనే అలా ఉంటే... కిందిస్థాయి ఉద్యోగాలు, పది, ఇంటర్‌ అర్హతతో నిర్వహించే పరీక్షలు ఎలా ఉండాలి? వాటిని కూడా ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలి కదా! మరి కేంద్ర నిర్వహించే ఈ క్యాటగిరీల ఉద్యోగాల భర్తీ పరీక్షలను హిందీ, ఆంగ్లంలో మాత్రమే నిర్వహించడం న్యాయమేనా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనిపై కేంద్రం సానుకూలంగా స్పందించి.. ప్రాంతీయ భాషల్లో పరీక్షలు నిర్వహించాలన్న డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - 2023-04-08T11:06:07+05:30 IST