Gurukula Jobs: కొలువుల్లో నారీమణులకు కేటాయించింది ఎంతంటే..!

ABN , First Publish Date - 2023-04-25T12:22:19+05:30 IST

రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాల్లో 2,205 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. పీజీటీ, ఆర్ట్‌, క్రాఫ్ట్‌, పాఠశాల లైబ్రేరియన్‌, ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టులు కలిపి

Gurukula Jobs: కొలువుల్లో నారీమణులకు కేటాయించింది ఎంతంటే..!
Gurukula Jobs

గురుకుల కొలువులు 2,205

1,718 ఉద్యోగాలు మహిళలకే

నోటిఫికేషన్‌ జారీ చేసిన ట్రిబ్‌

దరఖాస్తులకు మే 24 వరకు గడువు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాల్లో 2,205 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. పీజీటీ, ఆర్ట్‌, క్రాఫ్ట్‌, పాఠశాల లైబ్రేరియన్‌, ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టులు కలిపి మొత్తం 2,205 ఉద్యోగాల భర్తీకి సోమవారం సర్కారు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వీటిలో 1,276 పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ టీచర్‌ (పీజీటీ) పోస్టులుండగా, పాఠశాల లైబ్రేరియన్‌ 434, ఫిజికల్‌ డైరక్టర్‌ 275, ఆర్ట్‌ టీచర్‌ 132, క్రాఫ్ట్‌ టీచర్‌ 132 పోస్టుల భర్తీకి సమగ్ర వివరాలతో కూడిన ప్రకటనను తెలంగాణ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషన్‌ ఇన్‌స్టిట్యూషన్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ట్రిబ్‌) విడుదల చేసింది. ఆయా ఉద్యోగాలకు సోమవారం నుంచి మే 24 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. లోకల్‌ రిజర్వేషన్‌, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌, మల్టీ జోన్‌ల వారీగా భర్తీల వివరాలను పేర్కొంది. ఇప్పటికే జూనియర్‌, డిగ్రీ కాలేజీల్లోని 2,876 పోస్టుల భర్తీకి ట్రిబ్‌ ఈ నెల 17న నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే.

76 శాతం పోస్టులు మహిళలకే..

మొత్తం 2,205 ఉద్యోగాల్లో 76 శాతం అంటే 1,718 ఉద్యోగాలను మహిళలకే కేటాయించారు. పీజీటీ భర్తీ ప్రకటనలో 1,276 పోస్టులుండగా, వీటిలో 966 ఉద్యోగాలు మహిళలకు, జనరల్‌ కేటగిరీ వారికి 310 పోస్టులున్నాయి. వీటిలో అత్యధికంగా బీసీ మహిళల గురుకులాల్లో 399 భర్తీ అవనుండగా, జనరల్‌లోనూ 178 పోస్టులు మహిళలకే కేటాయించారు. 132ఆర్ట్‌టీచర్‌ పోస్టుల్లోనూ 84 శాతం మేర మహిళలకు (112), 15శాతం జనరల్‌ కేటగిరీ(20)లో రిజర్వు అయ్యాయి. 88 క్రాఫ్ట్‌ టీచర్‌ పోస్టుల్లో మహిళలకు 78, జనరల్‌ విభాగం లో 10 పోస్టులున్నాయి. పాఠశాల లైబ్రేరియన్‌ పోస్టులు 434 ఉండగా మహిళలకు 332,జనరల్‌ కేటగిరీలో 102 ఉన్నాయి. ఇక 275 పాఠశాల ఫిజికల్‌ డైరక్టర్‌ పోస్టుల్లో మహిళలకు 230 ఉండగా, జనరల్‌ విభాగంలో 45 ఉద్యోగాలున్నాయి. కాగా, ఇప్పటికే విడుదలైన జూనియర్‌, డిగ్రీ లెక్చరర్‌ పోస్టుల్లోనూ దాదాపు 80 శాతం మహిళలకే రిజర్వు అయ్యాయి.

మ్యూజిక్‌ టీచర్‌ పోస్టులకు ఎప్పుడో?

పీజీటీ, ఆర్ట్‌, క్రాఫ్ట్‌ ఉద్యోగాల భర్తీతో పాటే 124 మ్యూజిక్‌ టీచర్‌ పోస్టుల భర్తీకి సోమవారం ప్రకటన విడుదల అవుతుందని గురుకుల బోర్డు తెలిపింది. కానీ, నోటిఫికేషన్‌ ఇవ్వలేదు. దీని కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు.

Updated Date - 2023-04-25T12:22:19+05:30 IST