Amma Odi: ఆర్టీఈకి అమ్మఒడి మెలిక! విద్యాహక్కు చట్టానికి సర్కారు వింత భాష్యం
ABN , First Publish Date - 2023-02-27T13:06:54+05:30 IST
విద్యా హక్కు చట్టం (ఆర్టీఈ) ఉద్దేశానికి జగన్ సర్కారు (Jagan Government) వింత భాష్యం చెబుతోంది. ఆర్టీఈకి (RTE) అమ్మఒడి (Amma Odi) పథకాన్ని
అమ్మఒడితో ఫీజులు కట్టుకోవాలని ఆదేశం
పాఠశాలలకు ప్రభుత్వం చెల్లించదట
అలాంటప్పుడు ఆర్టీఈ ఎందుకో?
పైగా ఎక్కడ సీటు వస్తుందో తెలియదు
మరోవైపు నేరుగా అడ్మిషన్ పొందే చాన్స్
(అమరావతి-ఆంధ్రజ్యోతి): విద్యా హక్కు చట్టం (ఆర్టీఈ) ఉద్దేశానికి జగన్ సర్కారు (Jagan Government) వింత భాష్యం చెబుతోంది. ఆర్టీఈకి (RTE) అమ్మఒడి (Amma Odi) పథకాన్ని మెలిక పెట్టింది. దీంతో ఆర్టీఈ కింద సీటు పొందడం వల్ల పేద పిల్లలకు ప్రత్యేకించి ఒనగూరే ప్రయోజనం లేకుండా పోతోంది. ఆర్టీఈ కింద ప్రైవేటు పాఠశాలలు 25 శాతం సీట్లు పేదలకు కేటాయించాలి. సీట్లు పొందిన విద్యార్థులకు వారి తల్లిదండ్రులతో సంబంధం లేకుండా ప్రభుత్వం నేరు గా ఆయా పాఠశాలలకు ఫీజులు చెల్లించాలి. అయితే ఆర్టీ ఈ కింద సీట్లు పొందేవారు అమ్మఒడి నగదును ఫీజుగా చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించింది. అమ్మఒడిని ఫీజుగా కట్టాల్సినపుడు ఆర్టీఈ కింద సీటు పొందాల్సిన అవసరం ఏమిటి? అనేది వివరించకుండా ఆదేశాలు జారీ చేసింది. అమ్మఒడి నగదు ఖాతాల్లో జమ అయిన 60 రోజుల్లోగా పాఠశాలకు ఫీజుల కట్టాలని, లేనిపక్షంలో తదుపరి సంవత్సరం అమ్మఒడి నగదును ప్రభుత్వమే మినహాయించుకుని ఫీజు చెల్లిస్తుందని వివరించింది. 2023-24 విద్యా సంవత్సరానికి గాను ఒకటో తరగతిలో ఆర్టీఈ అడ్మిషన్లపై పాఠశాల విద్యా శాఖ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది.
అమ్మఒడి చెల్లిస్తే ఆర్టీఈ ఎందుకు?
సాధారణంగా ఆర్టీఈ కింద వచ్చే సీటు ఉచితమని తల్లిదండ్రులు భావిస్తారు. ఆర్టీఈ కింద దరఖాస్తు చేసుకునే సమయంలో ఇంజనీరింగ్ సీట్ల తరహాలో సమీపంలోని పాఠశాలలను ఎంపిక చేసుకోవాలి. లాటరీ నిర్వహించి విద్యార్థులకు సీట్లు కేటాయిస్తారు. ఈ మొత్తం ప్రక్రియలో సీటు దక్కడం అనేది అదృష్టంపై ఆధారపడి ఉంటుంది. ఇంతచేసి సీటు సాధించినా చివరికి అమ్మఒడి నగదే కట్టుకోవాలి. అలాంటప్పుడు విద్యా హక్కు చట్టం కింద సీటు పొందడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటనేది అంతుపట్టడం లేదు. అమ్మఒడి నగదు చెల్లించాల్సినపుడు ఆర్టీఈ కింద కాకుండా తల్లిదండ్రులు తమకు కావాలనుకున్న పాఠశాల ను నేరుగా ఎంపిక చేసుకోవచ్చు. అడ్మిషన్ తీసుకుని అమ్మఒడి నగదు పడిన తర్వాత ఫీజుగా చెల్లించుకోవచ్చు.
చాలీచాలని ఫీజులతో ఎలా?
ఆర్టీఈ కింద సీట్లు పొందే విద్యార్థులకు చెల్లించే ఫీజులను ప్రభుత్వం ఖరారు చేసింది. పట్టణ ప్రాంతాల్లో రూ.8 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.6,500, గిరిజన ప్రాంతాల్లో రూ.5,100గా నిర్ణయించింది. అన్ని తరగతులకు ఇవే ఫీజు లు వర్తిస్తాయని స్పష్టం చేసింది. అంటే ఒకటి నుంచి ఎనిమిది వరకు ఏ తరగతికి అయినా ఇవే ఫీజులు వర్తిస్తాయి. అయితే ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఈ ఫీజులతో అడ్మిషన్లు ఎలా ఇవ్వాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పాఠశాలల నిర్వహణ వ్యయం పెరిగిందని, ఈ చాలీచాలని ఫీజులతో చదువులు ఎలా చెప్పాలని ప్రశ్నిస్తున్నాయి. గతేడాది ఆర్టీఈ కింద అడ్మిషన్లు చేపట్టినా ప్రభుత్వం ఫీజులు ఖరారు చేయలేదు. యాజమాన్యాలకు ఫీజులు చెల్లించలేదు. దీంతో కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
18 నుంచి దరఖాస్తులు
ఆర్టీఈ కింద అడ్మిషన్ల కోసం మార్చి 18 నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వుల్లో తెలిపింది. మార్చి 4న నోటిఫికేషన్ జారీ అవుతుందని, 6 నుంచి 16 వరకు ప్రైవేటు పాఠశాలలు రిజిస్ర్టేషన్ చేసుకుంటాయని వివరించింది. మార్చి 18 నుంచి ఏప్రిల్ 7 వరకు పాఠశాల విద్యా శాఖ వెబ్సైట్లో విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. ఏప్రిల్ 13న మొదటి లాటరీ ఫలితాలు, 25న రెండో లాటరీ ఫలితాలు విడుదల చేస్తారని తెలిపింది.