AP teachers: ఆశ అయితే ఫలించింది గానీ.. ముచ్చట మాత్రం మూణ్నాళ్లే!

ABN , First Publish Date - 2023-05-01T12:18:33+05:30 IST

ప్రభుత్వ ఉద్యోగం అంటే సంవత్సరాల తరబడి సర్వీసుకు గ్యారెంటీ ఉంటుంది. కానీ 1998-డీఎస్సీ (DSC-98) టీచర్లలో కొందరి సర్వీసు కాలం ఎంతో

AP teachers: ఆశ అయితే ఫలించింది గానీ.. ముచ్చట మాత్రం మూణ్నాళ్లే!
DSC-98 teachers

ఉద్యోగం.. 19 రోజుల ముచ్చటే!

12, 13 తేదీల్లో పోస్టింగ్‌.. 30న రిటైర్మెంట్‌

పూర్తి నెల జీతం కూడా తీసుకోకుండానే

ఇద్దరు ఉపాధ్యాయుల పదవీ విరమణ

పాతికేళ్ల పోరాటం.. 20 వేల జీతంతో సరి

ఇదీ ‘1998-డీఎస్సీ’ ఉపాధ్యాయుల దుస్థితి

రానున్న నెలల్లో మరింత మంది రిటైర్‌

ఈ ఏడాది ఒక్క శ్రీకాకుళంలోనే 21 మంది

(అమరావతి-ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగం అంటే సంవత్సరాల తరబడి సర్వీసుకు గ్యారెంటీ ఉంటుంది. కానీ 1998-డీఎస్సీ (DSC-98) టీచర్లలో కొందరి సర్వీసు కాలం ఎంతో తెలుసా?... సరిగ్గా 19 రోజులు. ఒక పూర్తి నెల జీతం కూడా తీసుకోకుండానే వారు రిటైరయ్యారు. మరికొందరు మే నెలాఖరున పదవీ విరమణ చేయనున్నారు. ఇలా త్వరలోనే ఈ బ్యాచ్‌ మొత్తం రిటైర్మైంట్‌ తీసుకోనున్నారు. ఏడాది సర్వీసు కూడా పూర్తికాకుండానే దాదాపుగా అందరూ ఇంటికి వెళ్లే పరిస్థితి కనిపిస్తోంది. ఈ అభ్యర్థులకు ఉద్యోగాలిచ్చాం.... ఆదుకున్నాం అంటూ ప్రచారం చేసుకున్న వైసీపీ ప్రభుత్వం (YCP Government) వారికి మరో ప్రత్యామ్నాయం చూపలేదు. కాంట్రాక్టు ఉద్యోగులు 60ఏళ్లకు రిటైర్‌ కావాలన్న నిబంధననే వారికీ అమలు చేశారు. అంతే తప్ప వారిని ప్రత్యేక కేసుగా పరిగణించి, కొంతకాలం పొడిగించడమో, ఇతర మార్గంలో అవకాశం కల్పించే ఆలోచన చేయలేదు.

మొన్ననే పోస్టింగులు... అప్పుడే రిటైర్మెంట్‌

1998-డీఎస్సీ నోటిఫికేషన్‌లో అర్హత సాధించినా పలు కారణాలతో సుమారు 5వేల మందికి పైగా అభ్యర్థులు ఉద్యోగాలు పొందలేదు. అప్పటినుంచీ తమకు ఉద్యోగావకాశాలు ఇవ్వాలని పోరాడుతున్నారు. గత ప్రభుత్వాలు పట్టించుకోకపోయినా వారికి న్యాయం చేస్తానని ప్రతిపక్ష నేతగా జగన్‌ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల పాటు మౌనం వహించి చివరికి ఇప్పుడు పోస్టింగ్‌లు ఇచ్చారు. కాంట్రాక్టు పద్ధతిలో మినిమం టైమ్‌ స్కేలు ప్రాతిపదికన సెకండరీ గ్రేడ్‌ టీచర్లుగా తీసుకున్నారు. ఏప్రిల్‌లో కౌన్సెలింగ్‌ నిర్వహించి... 12, 13 తేదీల్లో పోస్టింగ్‌ ఆర్డర్లు చేతిలో పెట్టారు. మొత్తం 4,072మందికి ఉద్యోగాలు ఇవ్వాలని భావించగా 3,832 మంది కౌన్సెలింగ్‌కు వచ్చారు. ఇంకా 221 పోస్టులు మిగిలిపోయాయి. తాజాగా ఉద్యోగాల్లో చేరిన వారిలో శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు ఆదివారం రిటైర్‌ అయ్యారు. అంటే వారి సర్వీసు 19 రోజులే. ఎంటీఎస్‌ ప్రకారం వారికి సుమారు రూ.33వేల జీతం వస్తుంది. 19రోజులకు సుమారు రూ.20వేల వరకూ అందుతుంది. దాదాపు 25ఏళ్లపాటు పోరాడి ఉద్యోగం సాధించుకుంటే వారికి దక్కింది చివరికి ఇదే. పోనీ రెగ్యులర్‌ ఉద్యోగుల తరహాలో ప్రయోజనాలు ఏవైనా అందుతాయా అంటే అవీ ఉండవు. వీరి నియామకాలు పూర్తిగా కాంట్రాక్టు ప్రాతిపదికనే ఉంటాయని, ఎలాంటి ప్రయోజనాలు అడగకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇదే జిల్లాలో మే నెలలో నలుగురు రిటైర్‌ కానున్నారు. వారి సర్వీసు 49రోజులు అవుతుంది. జూన్‌లో నలుగురు, జూలైలో ఇద్దరు, ఆగస్టులో నలుగురు, సెప్టెంబరులో ఒకరు, అక్టోబరులో ఇద్దరు, నవంబరులో ఇద్దరు రిటైర్‌ అవుతారు. ఈ ఒక్క జిల్లాలోనే ఈ ఏడాదిలో 21మంది రిటైర్‌ కాబోతున్నారు. మిగిలిన జిల్లాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి ఉంది.

నాలుగేళ్లు ఏం చేశారు?

అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లపాటు జగన్‌ ప్రభుత్వం 1998-డీఎస్సీ అభ్యర్థుల గోడు వినిపించుకోలేదు. ఎన్నిసార్లు వారు సీఎంను కలిసేందుకు ప్రయత్నించినా అవకాశం ఇవ్వలేదు. నాలుగేళ్ల తర్వాత తీరిగ్గా ఉద్యోగాల్లోకి తీసుకున్నారు. అయితే దీనివెనక పెద్ద ప్రణాళిక ఉందని చెబుతున్నారు. వేల సంఖ్యలో ఉన్న టీచర్‌ ఖాళీలు ఎందుకు భర్తీ చేయడం లేదని నిరుద్యోగులు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. దీంతో డీఎస్సీ వేయకుండా ఉండేందుకు 2008, 1998 డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేస్తున్నామనే వాదన తెరపైకి తెచ్చారు. 2008 డీఎస్సీలో ఎంపికైన వారికైనా కొంత సర్వీసు లభిస్తుందేమో గానీ, 1998 డీఎస్సీ వారికి పెద్దగా ప్రయోజనమే లేదు. ఈ సాకుతో టీచర్‌ పోస్టుల ఖాళీలు పెద్దగా లేవంటూ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. 1998డీఎస్సీలో ఒకేసారి 4వేల మందిని తీసుకున్నామని చెబుతున్నారు. అంటే డీఎస్సీని తప్పించుకునేందుకు వారికి ఉద్యోగాలిచ్చారని అర్థమవుతోంది. వీరికోసం నిబంధనల సవరణ చేసి కొంతకాలం సర్వీసుకు అవకాశం ఇచ్చిఉంటే ప్రభుత్వానికి వారిపట్ల సానుభూతి ఉందని భావించేవారు. రిటైరయ్యేవారికి ఉద్యోగాలిచ్చి నెల తిరక్కుండానే ఇంటికి పంపారు.

Updated Date - 2023-05-01T12:18:48+05:30 IST