TSPSC Website: పంతులమ్మ వలపు బాణం! వలలో చిక్కుకున్న ఆ ఉద్యోగి ఏం చేశాడంటే..!
ABN , First Publish Date - 2023-03-13T11:09:28+05:30 IST
తాజా పరిణామాలతో వెబ్‌సైట్ నిర్వహణ, కంప్యూటర్ల వ్యవస్థను మరింత పకడ్బందీగా తీర్చిదిద్దాలని టీఎస్‌పీఎస్సీ అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా
‘టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్ హ్యాక్’లో కొత్తకోణం
యువతి వలపు వలలో చిక్కి ప్రశ్నపత్రాలు
లీక్ చేసిన టీఎస్‌పీఎస్సీ ఉద్యోగి ప్రవీణ్
టీఎస్‌టీఎస్ ఉద్యోగి సహకారంతో నేరం
వల విసిరింది ప్రభుత్వ ఉపాధ్యాయురాలు!
స్నేహితురాలి కోసం టీచర్ నిర్వాకం
ఆపై మరో 13 మందికి ప్రశ్నపత్రాల విక్రయం
ఒక్కొక్కరి నుంచి రూ.లక్ష వసూలు
రూ.10 లక్షలు ఇద్దరు ఉద్యోగులకు చెల్లింపు
పోలీసుల అదుపులో నిందితుడు ప్రవీణ్
మరో ఏడుగురు నిందితుల విచారణ
ఇంటి దొంగలతో కమిషన్‌కు తలనొప్పి
నేడు సైబర్ సెక్యూరిటీ నిపుణులతో భేటీ
హైదరాబాద్/సిటీ, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రం (Telangana) లో సంచలనం సృష్టించిన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) వెబ్‌సైట్ హ్యాకింగ్ కేసులో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. టీఎస్‌పీఎస్సీలో పనిచేసే ఓ ఉద్యోగి ‘హనీట్రాప్’లో (Honeytrap) చిక్కుకొని ఈ నేరానికి పాల్పడినట్లు తెలుస్తోంది. అతనికి ‘వలపు వల’ విసిరిన మహిళ.. రెండు ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాల భర్తీ కోసం రూపొందించిన ప్రశ్న పత్రాలను లీక్ చేసేలా పురిగొల్పినట్లు, దీంతో అతడు కమిషన్ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసినట్లుగా ప్రాథమిక విచారణలో తేలినట్లు సమాచారం. అతనికి తెలంగాణ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ (టీఎస్‌పీఎస్సీ)కు చెందిన మరో ఉద్యోగి సహకరించినట్లు తెలిసింది. కాగా, వలపు వల విసిరిన మహిళ.. ప్రభుత్వ ఉపాధ్యాయురాలు (Govt teacher) అని, తన స్నేహితురాలి కోసం ఈ నిర్వాకానికి పాల్పడిన ఆమె.. ప్రశ్నపత్రాలు చేతికి వచ్చాక వాటిని మరో 13 మందికి విక్రయించిందని తెలుస్తోంది. ఇందుకు ఒక్కొక్కరి నుంచి రూ.లక్ష వసూలు చేసినట్లు, వచ్చిన మొత్తంలో ఇద్దరు ఉద్యోగులకు రూ.10 లక్షలు చెల్లించి, మిగిలిన రూ.4 లక్షలు తాను తీసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు టీఎస్‌పీఎస్సీ (TSPSC) కార్యాలయంలో పనిచేస్తున్నఉద్యోగిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అతడు ఇచ్చిన సమాచారంతో మరో ఏడుగురు నిందితులను కూడా అదుపులోకి తీసుకొని విచారిస్టున్నట్లు తెలిసింది.
టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్ హ్యాకింగ్‌కు గురైందంటూ కమిషన్ అధికారులు శనివారం బేగం బజార్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతోపాటు ఈ నెల 12, 15, 16వ తేదీల్లో జరగాల్సిన పరీక్షలను వాయిదా వేయడం తెలిసిందే. ఈ ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన బేగంబజార్ పోలీసులు ఆదివారం టాస్క్‌ఫోర్స్, సైబర్ క్రైమ్ పోలీసుల సహకారంతో కమిషన్ కార్యాలయాన్ని సందర్శించి పలు ఆధారాలు సేకరించారు. అనంతరం ఐపీ అడ్ర్‌సలను క్రోడీకరించి వెబ్‌సైట్ నుంచి ఏ ఐపీ అడ్రస్ ద్వారా ప్రశ్నపత్రాల సమాచారం బయటకు వెళ్లిందనే విషయంపై ఆరా తీశారు. విచారణలో.. టీఎస్‌పీఎస్సీలో ఉన్నతోద్యోగి వద్ద పనిచేస్తున్న ప్రవీణ్ అనే ఉద్యోగి వెబ్‌సైట్ హ్యాకింగ్‌కు ప్రశ్నపత్రాలను లీక్ చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిసింది. వెంటనే అతణ్ని అదుపులోకి తీసుకున్నారు. ఇతనితోపాటు టీఎస్‌పీఎస్సీకి సాంకేతిక సహకారం అందిస్తున్న టీఎస్‌పీఎస్సీకు చెందిన ఒక ఉద్యోగి పాత్ర కూడా ఈ వ్యవహారంలో ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడు ప్రవీణ్‌ను పోలీసులు విచారించగా.. వెబ్‌సైట్ హ్యాకింగ్, ప్రశ్నపత్రాల లీకేజీ వెనుకాల మరికొందరు వ్యక్తులు ఉన్నట్లుగా తేలినట్లు సమాచారం. ఈ మేరకు వీరిలో ఏడుగురు నిందితులను గుర్తించినట్లు, వారిని వివిధ ప్రాంతాల్లో అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది. విచారణలో రూ.10లక్షలు చేతులు మారిననట్లు సమాచారం. నిందితులను విచారించిన తర్వాత నేడో రేపో పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది.
ఇంటిదొంగలతో ఇబ్బంది
రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ విభాగాల్లో పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీ బాధ్యతలు తీసుకున్న టీఎస్‌పీఎస్సీకి ఇంటిదొంగల సమస్య ఇబ్బందిగా మారింది. తాజాగా కంప్యూటర్ హ్యాకింగ్ సంఘటనతో కార్యాలయంలో పనిచేస్తున్న వారిలో ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదోనన్న అయోమయ పరిస్థితి నెలకొంది. ఒక చిన్న తప్పు వల్ల లక్షల మంది అభ్యర్థులు ఇబ్బంది పడే పరిస్థితి నెలకొంది. దాంతోపాటు ఉద్యోగాల కోసం ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థుల్లో అపనమ్మకం ఏర్పడితే.. దానిని తొలగించడం అంత సులువైన విషయం కాదని అంచనా వేస్తున్నారు. టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో ప్రస్తుతం 83 మంది రెగ్యులర్ సిబ్బంది పనిచేస్తున్నారు. ఏ పనికైనా ఇందులోని వారినే ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం గ్రూపు-1, 2, 3, 4 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు జారీ చేశారు. అలాగే పలు ఇతర విభాగాల్లోని పోస్టుల భర్తీ ప్రక్రియ కూడా టీఎస్‌పీఎస్సీ ద్వారానే కొనసాగుతోంది. ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీని చేపట్టడంతో ఏ చిన్న పొరపాటు జరిగినా.. లక్షలాది మందిపై ప్రభావం పడనుంది. దాంతో కమిషన్ అధికారులు మొదటి నుంచీ చాలా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. అయినా.. ఇంటి దొంగలు పేపర్ లీకేజీకి పూనుకోవడం పట్ల అధికారులు కొంత ఆందోళన చెందుతున్నారు. భవిష్యత్తులో ఇలాంటివి మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు.
నేడు సైబర్ సెక్యూరిటీ నిపుణులతో భేటీ
తాజా పరిణామాలతో వెబ్‌సైట్ నిర్వహణ, కంప్యూటర్ల వ్యవస్థను మరింత పకడ్బందీగా తీర్చిదిద్దాలని టీఎస్‌పీఎస్సీ అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా కమిషన్ చైర్మన్ జనార్దన్‌రెడ్డి సోమవారం సైబర్ సెక్యూటరీ నిపుణులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నారు. కార్యాలయంలోని సమాచారం బయటకు వెళ్లకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ముఖ్యంగా కంప్యూటర్ల నిర్వహణలో మరింత రక్షణ చర్యల కోసం అవసరమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
కేరళ వ్యవస్థ బెటర్ !
ఉద్యోగాల భర్తీలో కేరళ రాష్ట్రం అనుసరిస్తున్న పద్ధతి బాగుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇతర రాష్ట్రాలకు భిన్నంగా కేరళలో ఉద్యోగాల భర్తీ చేపడుతున్నారు. సర్వీసులో ఉన్న ఒక ఉద్యోగి రిటైర్ అయ్యే రోజు నాటికే.. ఆ పోస్టులో మరొకరిని నియామకం జరిపి సిద్ధం చేస్తున్నారు. దాంతో ఖాళీ పోస్టులు అనే సమస్యే ఉత్పన్నం కావడంలేదు. ఇలా పోస్టులను ఎప్పటికప్పుడు భర్తీ చేస్తుండడంతో పోటీ పడే అభ్యర్థులు కూడా తక్కువగా ఉంటారని, అడ్డదారులు తొక్కే అవకాశాలు లేకుండాపోతాయని పలువురు అంటున్నారు. నియామకాలను సకాలంలో చేయని రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో ఖళీ పోస్టులు ఉంటున్నాయని, దాంతో ఈ పోస్టుల కోసం నోటిఫికేషన్లను జారీ చేసిన సమయాల్లో లక్షల సంఖ్యలో అభ్యర్థులు పోటీ పడుతున్నారని, ప్రశ్నా పత్రాల లీకేజీ వంటి సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని అభిప్రాయపడుతున్నారు. టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్ హ్యాకింగ్‌కు గురైన నేపథ్యంలో ఇందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి జావిద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: రాజభోగం అంటే ఇతడిదే.. ఇంట్లో ఖాళీగా ఉంటోంటే.. భార్యలే ఉద్యోగాలు చేసి భర్తను పోషిస్తున్నారు..