Emset: ఇంటర్ వెయిటేజీపై తేల్చని సర్కార్! నోటిఫికేషన్‌పై ఎఫెక్ట్ !
ABN , First Publish Date - 2023-02-21T12:41:49+05:30 IST
ఎంసెట్ (Emset)లో ఇంటర్ మార్కుల (Inter marks)కు వెయిటేజీ విధానాన్ని మళ్లీ ప్రవేశపెట్టాలా వద్దా అనే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం
ఇంకా వెలువడని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం
‘కనీస మార్కుల’పైనా తేల్చని సర్కారు
ఎంసెట్ నోటిఫికేషన్ విడుదలపై ప్రభావం
కరోనా వల్ల మూడేళ్లుగా వెయిటేజీ లేదు
హైదరాబాద్, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): ఎంసెట్ (Emset)లో ఇంటర్ మార్కుల (Inter marks)కు వెయిటేజీ విధానాన్ని మళ్లీ ప్రవేశపెట్టాలా వద్దా అనే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం (Telangana Government) సందిగ్ధంలో ఉంది. సర్కారు ఇంకా నిర్ణయం తీసుకోకపోవడంతో ఎంసెట్ నోటిఫికేషన్ (Emset notification) నిలిచిపోయింది. దీంతో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. ఈ ఏడాది ఎంసెట్‌ను మేలో నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించిన విషయం తెలిసిందే. మే 7 నుంచి 11 వరకు ఇంజనీరింగ్ విభాగం, 12 నుంచి 14 వరకు అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే దీనికి నోటిఫికేషన్ మాత్రం జారీ చేయలేదు. కరోనా వల్ల గత మూడేళ్ల నుంచి ఎంసెట్‌లో ఇంటర్ మార్కుల వెయిటేజీని రద్దు చేశారు. ఇదే విధానం భవిష్యత్తులో కూడా కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. వీటిని ఆమోదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వాలి. మరోపక్క ఇంజనీరింగ్ విద్య (Engineering education) లో చేరాలంటే ఇంటర్‌లో కనీస మార్కుల అర్హత నిబంధనను కరోనా సమయంలో ఎత్తివేశారు.
ఈ ఏడాది నుంచి మళ్లీ ఆ నిబంధనను ప్రవేశపెట్టాలంటే... దానికి కూడా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలి. కానీ ఈ విషయంలో కూడా ప్రభుత్వం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. ఈ రెండు ఉత్తర్వులు వచ్చిన తర్వాతే ఎంసెట్ నోటిఫికేషన్ జారీ చేయడానికి అవకాశం ఉంటుంది. కాగా, ఇంటర్ వార్షిక పరీక్షలు మార్చి 15 నుంచి ప్రారంభం కాన్నాయి. వీటి హాల్ టికెట్ల జారీ ప్రక్రియ మొదలైన తర్వాతే ఎంసెట్‌కు దరఖాస్తు చేయడానికి అవకాశం ఉంటుంది. ఎంసెట్‌కు ఇంటర్ అర్హత ఉండాలి కాబట్టి విద్యార్థులు తమ హాల్ టికెట్ల ఆధారంగా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఇంటర్ బోర్డు అధికారులు హాల్ టికెట్లను ఇంకా జారీ చేయడం లేదు. ఎంసెట్ నోటిఫికేషన్ జాప్యానికి ఇదో కారణంగా చెబుతున్నారు.
ఫస్టియర్ సిలబస్ 70 శాతమే
ఎంసెట్‌లో ఇంటర్ ఫస్టియర్‌లోని 70 శాతం సిలబస్ నుంచి మాత్రమే ప్రశ్నలు ఇవ్వాలని నిర్ణయించారు. కరోనా వల్ల ఫస్టియర్ సిలబ్‌సను పూర్తిస్థాయిలో బోధించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. సెకండియర్ సిలబ్‌సను పూర్తిగా పరిగణనలోకి తీసుకుంటారు. ఎంసెట్‌లో 150 మార్కులకు ఇంటర్ మొదటి, రెండో ఏడాది సిలబ్‌సల నుంచి సమానంగా ప్రశ్నలు ఇస్తారు. అయితే ఇంటర్ ఫస్టియర్‌కు సంబంధించిన అన్ని ప్రశ్నలను 70 శాతం సిలబస్ నుంచే ఇవ్వనున్నారు. సెకండియర్‌కు సంబంధించిన ప్రశ్నలను మొత్తం సిలబస్ నుంచి ఎంపిక చేస్తారు.