AP News: లైట్‌గానే ‘డైట్’.. విద్యార్థులపై శీతకన్ను
ABN , First Publish Date - 2023-03-02T14:40:08+05:30 IST
గత మూడేళ్లలో నిత్యావసర సరుకుల ధరలు భారీగా పెరిగాయి. వైసీపీ సర్కారు (YCP Government) వచ్చాక సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల
సంక్షేమ విద్యార్థులపై సర్కారు శీతకన్ను
డైట్ చార్జీల పెంపు 12 శాతంతో సరి
మరోవైపు భారీగా పెరిగిన ధరలు
వరిసారిగా 2018లో మెనూ రేట్ల పెంపు
చంద్రబాబు హయాంలో గరిష్ఠంగా 66%
ఇప్పుడు అరకొరగా పెంచిన వైనం
(అమరావతి-ఆంధ్రజ్యోతి): గత మూడేళ్లలో నిత్యావసర సరుకుల ధరలు భారీగా పెరిగాయి. వైసీపీ సర్కారు (YCP Government) వచ్చాక సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల విద్యార్థులకు పెరిగిన ధరలకు అనుగుణంగా డైట్ చార్జీలను (Diet charges) మాత్రం పెంచలేదు. తాజాగా అరకొరగా పెంచి చేతులు దులుపుకొంది. విద్యార్థుల డైట్ చార్జీలను ప్రభుత్వం కేవలం 12 శాతం పెంచింది. పెంచిన మెనూ కూడా జూన్ 1 నుంచి అమల్లోకి వస్తుందని ఉత్తరుల్లో పేర్కొంది. చివరిసారిగా 2018లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) సంక్షేమ విద్యార్థుల డైట్ చార్జీలను గణనీయంగా పెంచారు. ఆ తర్వాత ప్రతి ఏటా డైట్ చార్జీలను పెంచేందుకు సీఎస్ ఆధ్వర్యంలో కమిటీ సమావేశం కావాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వైసీపీ సర్కారు వచ్చాక విద్యార్థుల డైట్ చార్జీలు పెంచేందుకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. దీనిపై మీడియాలో కథనాలు రావడం, ప్రజాసంఘాలు తీవ్రంగా స్పందించిన నేపథ్యంలో ఇప్పుడు మొక్కుబడిగా డైట్ చార్జీలు పెంచింది. ఉత్తర్వులు ఇచ్చిన చాలా రోజుల తర్వాత బయటకు వెల్లడించింది. ప్రతి అంశాన్ని గత ప్రభుత్వంతో పోల్చుకుని గొప్పలు చెప్పుకొనే జగన్ సర్కారు (CM JAGAN)... చంద్రబాబు ప్రభుత్వం పెంచిన డైట్ చార్జీలతో పోలిస్తే సగభాగం కూడా పెంచలేదు. పేదల పక్షపాతి అని చెప్పుకొంటూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులపై శీతకన్ను వేసింది. పేద పిల్లలకు నాణ్యమైన ఆహారం అందించే విషయంలో ప్రభుత్వం ఎలా సమర్థించుకుంటుందని పలు ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు.
ధరలు పెరిగినా..
చంద్రబాబు హయాంలో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా విద్యార్థుల డైట్ చార్జీలు పెంచేలా సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల్లో సంస్కరణలు తీసుకొచ్చారు. విద్యార్థులకు మంచి పోషకాహారం అందించేందుకు చర్యలు తీసుకున్నారు. ప్రొటీన్లు ఉన్న ఆహారం సరఫరా కోసం అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమగ్రమైన ఉత్తర్వులు జారీచేశారు. వైసీపీ సర్కారు వచ్చాక పరిస్థితి మారిపోయింది. ఒక్క ఏడాది కూడా డైట్ చార్జీలు పెంచే విషయంపై సమీక్ష చేయలేదు. ధరలు పెరుగుతున్నా డైట్ చార్జీలు పెంచలేదు. దీంతో చూసుకుని వడ్డించాల్సిన పరిస్థితి వచ్చిందని వాపోతున్నారు. పోనీ ఇప్పుడైనా బడ్జెట్ సరిపడా డైట్ చార్జీలు పెంచారా అంటే అదీ లేదనే విమర్శలు వస్తున్నాయి. గతంలో దుబారా తగ్గించేందుకు అన్నపూర్ణ లాంటి యాప్‌లను అమల్లోకి తెచ్చారు. ఇప్పుడు ఆ యాప్ వినియోగం మొక్కుబడిగా మారింది.
గ్రీన్ చానల్ అమలేది?
ఓవైపు అరకొరగా బడ్జెట్ కేటాయింపులు చేస్తూ, మరోవైపు గురుకులాలకు నిత్యావసర సరుకులు సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్లకు ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించడం లేదు. గతంలో రాష్ట్రవ్యాప్తంగా ఒకే కాంట్రాక్టు సంస్థకు సరఫరా బాధ్యత అప్పగించారు. ఇప్పుడు ప్రతి జిల్లాలో జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో టెండర్లు పిలిచి ఏ జిల్లాకు సంబంధించి ఆ జిల్లాలోని సరఫరాదారులకు అప్పగించారు. బిల్లులు సకాలంలో చెల్లించడం లేదని, కలెక్టరేట్‌లో తమ గోడు విన్నవించుకున్నా పట్టించుకునేవారు లేరని వాపోతున్నారు. గతంలో సంక్షేమ హాస్టళ్ల సరుకుల సరఫరా బిల్లుల చెల్లింపుల్లో గ్రీన్ చానల్ అమలు చేసేవారు. ఇప్పుడు దాన్ని పట్టించుకోవడం లేదు. దీంతో కాంట్రాక్టర్లు సరఫరా నిలిపేయడం, వార్డెన్లు, గురుకులాల ప్రిన్సిపాళ్లు సరఫరా చేయలేక ఇబ్బందులు పడుతుండటంతో విద్యార్థులకు మెనూ సక్రమంగా అమలు కావడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.
డైట్ చార్జీలు...
3, 4 తరగతుల విద్యార్థులకు 15 శాతం అంటే నెలకు రూ.1000 నుంచి రూ.1150కు పెంచారు. 2018లో చంద్రబాబు ప్రభుత్వంలో 33 శాతం అంటే రూ.750 నుంచి రూ.1000కు పెంచారు
5 నుంచి 10వ తరగతి విద్యార్థులకు తాజాగా రూ.1250 నుంచి రూ.1400కు (12 శాతం) పెంచారు. చంద్రబాబు హయాంలో 5 నుంచి 7వ తరగతి వరకు రూ.750 నుంచి రూ.1250కు (66శాతం), 8 నుంచి 10వ తరగతి వరకు రూ.850 నుంచి రూ.1250కు (47 శాతం) పెంచారు. 5 నుంచి 10వ తరగతి విద్యార్థులే ఎక్కువ మంది సంక్షేమ వసతి గృహాలు, గురుకులాల్లో చదువుతున్నారు.
ఇంటర్ నుంచి పీజీ వరకు విద్యార్థులకు తాజాగా రూ.1400 నుంచి రూ.1600కు (14 శాతం) పెంచారు. గతంలో రూ.1200 నుంచి రూ.1400కు (16 శాతం) పెంచారు.
కర్ణాటకలో గురుకులాల విద్యార్థుల మెనూ రేట్లు నెలకు రూ.1500 నుంచి రూ.1600 వరకు ఉండగా... మన రాష్ట్రంలో రూ.1400 వరకు మాత్రమే ఉన్నాయి.