Ayurvedic medicine: అందరివాడు.. ఆ ఆయుర్వేద వైద్యుడు..

ABN , First Publish Date - 2023-03-10T19:02:58+05:30 IST

ఆయుర్వేద వైద్యులు జమాల్ ఖాన్ .. చుట్టు పక్క జిల్లాల్లో ఈయన పేరు తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి లేదు. ప్రకృతి వైద్యంతో అనేక దీర్ఘకాలిక వ్యాధులను నయం చేస్తూ ప్రజలలో..

Ayurvedic medicine: అందరివాడు.. ఆ ఆయుర్వేద వైద్యుడు..

అల్లూరి జిల్లా: ఆయుర్వేద వైద్యులు జమాల్ ఖాన్ (Ayurvedic doctor Jamal Khan).. చుట్టు పక్క జిల్లాల్లో ఈయన పేరు తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి లేదు. ప్రకృతి వైద్యంతో అనేక దీర్ఘకాలిక వ్యాధులను నయం చేస్తూ ప్రజలలో ఈయన గుర్తింపు తెచ్చుకున్నారు. నిరుపేదలకు ఉచిత వైద్యం, సామాజిక సేవ చేస్తూ మారుమూల గిరిజన ప్రాంతమైన చింతూరులో ఆఫ్రీన్ ఆయుర్వేద దవఖానా పేరుతో చికిత్సాలయం ఏర్పాటు చేశారు. ఇక్కడికి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా చత్తీస్‌గఢ్, ఒడిశాల (Chhattisgarh, Odisha) నుండి రోగులు చికిత్స కోసం బారులు తీరుతున్నారు. అనువంశిక వారసత్వంగా తండ్రి నుండి వైద్యాన్ని నేర్చుకున్న జమాల్ ఖాన్.. ఆయుర్వేద వైద్యంలో మరింత ఆధునిక పద్ధతులను తీసుకొచ్చారు.

వైద్యుడు జమాల్ భారీగా ఖర్చు చేసి యంత్రాల ద్వారా మూలికలను టాబ్లెట్లు, క్యాప్యుల్స్‌గా (Tablets, capsules) మార్చి రోగులకు అందజేస్తారు. కషాయం, తైలాలను సైతం యాంత్రిక పద్ధతుల ద్వారా వాడేందుకు అనువుగా రూపొందిస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధుల్లో ముఖ్యంగా అల్లోపతిలో (Allopathy) నయం కాని మొండి జబ్బులను సైతం నయం చేస్తుండడంతో అనేక ప్రాంతాలకు చెందిన రోగులు జమాల్ వద్దకు తరలి వస్తున్నారు. అమాయక గిరిజన ప్రజలు (Tribal people) అవగాహన లోపంతో ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లడానికి ఆసక్తి చూపించక రోగాల పాలవుతున్నారు. ఈ నేపథ్యంలో గిరిజన ప్రజలకు ఉచితంగా వైద్యం చేస్తూ వారికి ఆసరాగా నిలుస్తున్నారు. ముఖ్యంగా పాముకాటుకు జమాల్ ఖాన్ ఇచ్చే మందు బాగా పనిచేస్తుండడంతో ఈ ప్రాంతంలో ప్రజలకు ఆయన వైద్యంపై నమ్మకం ఏర్పడింది.

doctor-trending-news.jpg

ఎన్నో ఆసుపత్రుల చుట్టూ తిరిగి లక్షల రూపాయలు ఖర్చు చేసినా నయం కాని మొండి వ్యాధులకు సైతం ఇక్కడ చికిత్స లభిస్తుండడంతో దూర ప్రాంతాల నుండి రోగులు వస్తుంటారు. సాధారణ వ్యాధులే కాకుండా కేన్సర్, టీబీ (Cancer, TB) వంటి ప్రాణాంతక వ్యాధులనూ ఆయుర్వేద పద్ధతుల ద్వారా నయం చేయవచ్చని జమాల్ ఖాన్ చెబుతున్నారు. కొవిడ్ (covid) కాలంలో సైతం ఆయుర్వేద వనమూలికలతో కషాయం తయారు చేసి, వేలాది మందికి ఉచితంగా అందజేశారు. ఇందుకోసం ఆయన ఔషధ మొక్కల ప్లాంటేషన్ సైతం చేస్తున్నారు. ప్రకృతి వైద్యంలో పేరు ప్రఖ్యాతులు గడించిన జమాల్ ఖాన్ సామాజిక సేవా కార్యక్రమాలలో తన వంతు సాయంగా ముందుంటారు.

doctor-viral-news'.jpg

ఇటీవల సంభవించిన వరదలకు సర్వం కోల్పోయిన బాధితుల కష్టాలు చూసి ఆయన చలించారు. తనకున్న పరిచయాలతో అనేక ధార్మిక సంస్థలకు విపత్తును వివరించి, వారి ద్వారా సుమారు రూ.3కోట్ల మేర ఆహార సామాగ్రి, దుస్తులు, వంట పాత్రలను చింతూరు, వీఆర్ పురం, కూనవరం మండలాల్లోని వరద బాధితులకు అందజేశారు. వారసత్వంగా వచ్చిన ప్రకృతి వైద్యానికి ఆధునికతను జోడించి, వైద్య సేవలను అందిస్తున్న జమాల్ ఖాన్.. సామాజిక సేవలోనూ ముందుండి గిరిజన ప్రాంతం చింతూరుకు ఎనలేని గుర్తింపు తీసుకొస్తున్నారు.

Updated Date - 2023-03-10T19:08:33+05:30 IST