Child Health: పిల్లల బ్రేక్‌ఫాస్ట్‌పై వైద్య నిపుణుల సూచన ఇదే..!
ABN , First Publish Date - 2023-03-18T12:38:10+05:30 IST
అధికంగా ఆహారం తింటే అనారోగ్యానికి దారితీస్తుందంటున్నారు. కౌమారదశలో ఉన్నప్పుడు, పిల్లలో శరీర నిర్మాణానికి
చిన్న పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచేందుకు వారికి ఇష్టమైన బ్రేక్ ఫాస్ట్‌ను పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రకరకాల బ్రేక్ ఫాస్ట్‌లను రుచిగా తయారు చేసి పెడితే ఇష్టంగా తింటారు. వీటితో పిల్లల ఆరోగ్యంతోపాటు, ఇమ్యూనిటీ పెరుగుతుంది. మాంసకృత్తులు, పిండిపదార్థాలు, కొవ్వులు, పీచు పదార్థాలు, విటమిన్‌లు, ఖనిజలవణాలు, నీరు అధికంగా ఉండే పౌష్టికాహారం పెట్టాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అధికంగా ఆహారం తింటే అనారోగ్యానికి దారితీస్తుందంటున్నారు. కౌమారదశలో ఉన్నప్పుడు, పిల్లలో శరీర నిర్మాణానికి, పెరుగుదలకు మాంసకృత్తులు ఉపయోగపడతాయి. ఉదయం బ్రేక్ ఫాస్ట్‌లో పండ్లు పెడితే పిల్లల్లో ఇమ్యూనిటీ పెరుగుతుందంటున్నారు.
బ్రేక్‌ఫాస్ట్‌లో ఇవి మేలు
ఓట్స్: వీటిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఓట్స్ తింటే ఊబకాయం, అధిక బరువు పెరగరు. ఉదయం పిల్లలకు ఓట్స్‌ను బ్రేక్‌ఫా్‌స్టగా పెట్టాలి. వీటితోపాటు అరటిపండ్లు, స్ర్టాబెర్రీలు లేదా పిల్లలకు ఇష్టమైన పండ్లు, బాదం, పిస్తా, ఓట్స్‌లో తేనెవేసి రుచికరంగా తయారు చేసి పెడితే ఇష్టంగా తింటారు. ఓట్స్‌తో దోశ, ఉప్మావంటివి కూడా చేసి పెట్టవచ్చు.
గుడ్డు: గుడ్డును పిల్లలకు ఉదయం తినిపిస్తే రోజంతా ఎనర్జిటిక్‌గా ఉంటారు. గుడ్డులో ఉండే ప్రోటీన్‌లు పిల్లల్లో కండరాల కణజాలాల పెరుగుదలకు సహాయపడతాయి. ఆమ్లేట్, ఉడకబెట్టిన గుడ్డు పిల్లలకు బలవర్థకమైనది.
ఆకు కూరలు: వీటిలో ఎన్నోరకాల పోషకాలుంటాయి. బచ్చలికూర, క్యాబేజీ, క్యాప్సికం, పచ్చని ఆకుకూరలను వేయించి టోస్ట్‌తో కలిపి బ్రేక్‌ఫాస్ట్‌గా పెట్టొచ్చు. ఆకు కూరలను అతిగా ఉడకబెట్టకూడదు. ఎక్కువసేపు ఉడకబెడితే వాటిలో ఉండే పోషకాలు తగ్గుతాయి.
సీజనల్ ఫ్రూట్స్: చలికాలంలో పిల్లలు పండ్లను తక్కువగా తింటారు. దీంతో విటమిన్స్ లోపించడంతో రోగాలు చుట్టుముడతాయి. సీజనల్ ఫ్రూట్స్ తింటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. పిల్లలకు నారింజ, బెర్రీస్, దానిమ్మ వంటి పండ్లను పెట్టాలి. వీటిల్లో విటమిన్-సి, ఫైబర్ ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్‌లుగా పనిచేస్తాయి. పిల్లలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
ఉప్మా: దీనిని చూడగానే పిల్లలు ముఖం ముడుచుకుంటారు. కానీ ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు. ఉప్మా తింటే కడుపు ఎక్కువసేపు నిండుగా ఉంటుంది. ఉప్మాలో ప్రోటీన్‌లు, విటమిన్‌లు, ఖనిజలవణాలు, జింక్, భాస్వరం, ఐరన్, పిండి పదార్థాలు, పోషకాలు ఉంటాయి. ఇవి మూత్రపిండాలు, గుండె, ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి. రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి.
బ్రేక్‌ఫాస్ట్‌లో పోషకాలు అధికంగా ఉన్నవి పెట్టాలి
పిల్లలకు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ లో పోషకాలు ఎక్కువగా ఉన్న ఆహారం పెట్టాలి. డాక్టర్ సలహాల తో తగినంత పరిమాణంలో ఇవ్వాలి. విటమిన్‌లు, ఖనిజలవణాలు, కొవ్వులు, ప్రోటీన్‌లు, మాంసకృత్తులు, పిండిపదార్థాలు ఉన్నవి సమపాళ్లలో ఇస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇమ్మూనిటీని పెంచే ఆహారం పెట్టడం తల్లుల బాధ్యత.
- డాక్టర్ హుస్సేన్, పీపుల్స్ ఆస్పత్రి, సూరారం
-హైదరాబాద్, షాపూర్‌నగర్, మార్చి 17 (ఆంధ్రజ్యోతి)