Doctors: చికిత్స సరే.. అసలేం జరుగుతోంది!?

ABN , First Publish Date - 2023-03-01T13:04:03+05:30 IST

కాకతీయ మెడికల్‌ కాలేజీ (Kakatiya Medical College) మెడికో ప్రీతి (Preethi) మరణం యావత్‌ సమాజాన్ని కలవరపరిచింది. కరోనా (Corona) కాలంలో ఓ సైనికురాలిగా కార్యక్షేత్రంలో నిలిచి

Doctors: చికిత్స సరే.. అసలేం జరుగుతోంది!?
అసలేం జరుగుతోంది!?

కాకతీయ మెడికల్‌ కాలేజీ (Kakatiya Medical College) మెడికో ప్రీతి (Preethi) మరణం యావత్‌ సమాజాన్ని కలవరపరిచింది. కరోనా (Corona) కాలంలో ఓ సైనికురాలిగా కార్యక్షేత్రంలో నిలిచి, వందల మంది ప్రాణాలను కాపాడిన ఆమె... ఓ సీనియర్‌ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడటం బాధాకరం. ఈ నేపథ్యంలో ఊపిరిపోసే వైద్యులే తోటి డాక్టర్లపై ఆధిపత్యాన్ని ప్రదర్శించడమేమిటని సామాన్యులు నిలదీస్తున్నారు. ఈ క్రమంలో వైద్య విద్యలో నవ యువ వైద్యులు ఎదుర్కొంటున్న సమస్యలు, అక్కడి పరిస్థితులపై పీజీ విద్యార్థినులతో పాటు ఓ సీనియర్‌ వైద్యురాలు ‘నవ్య’తో పంచుకున్న అభిప్రాయాలు...

కాకతీయ మెడికల్‌ కాలేజీ మెడికో ప్రీతి మరణం యావత్‌ సమాజాన్ని కలవరపరిచింది. కరోనా కాలంలో ఓ సైనికురాలిగా కార్యక్షేత్రంలో నిలిచి, వందల మంది ప్రాణాలను కాపాడిన ఆమె... ఓ సీనియర్‌ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడటం బాధాకరం. ఈ నేపథ్యంలో ఊపిరిపోసే వైద్యులే తోటి డాక్టర్లపై ఆధిపత్యాన్ని ప్రదర్శించడమేమిటని సామాన్యులు నిలదీస్తున్నారు.

ఈ క్రమంలో వైద్య విద్యలో నవ యువ వైద్యులు ఎదుర్కొంటున్న సమస్యలు, అక్కడి పరిస్థితులపై పీజీ విద్యార్థినులతో పాటు ఓ సీనియర్‌ వైద్యురాలు ‘నవ్య’తో పంచుకున్న అభిప్రాయాలు...

da.jpg

ప్లీజ్‌! మమ్మల్ని నిందించకండి...

వైద్యవిద్యలో ర్యాగింగ్‌లాంటి పోకడల గురించి సమాజంలో భిన్నమైన అభిప్రాయాలున్న నేపథ్యంలో... ఉస్మానియా మెడికల్‌ కాలేజీ సర్జరీ విభాగంలో పోస్టు గ్రాడ్యుయేషన్‌ ఫైనలియర్‌ విద్యార్థిని డాక్టర్‌ వన్య జాస్మిన్‌ ఏమంటున్నారంటే.?

‘‘మెడిసిన్‌లో పీజీ స్థాయిలోనూ సీనియర్ల వేధింపులుంటాయని బయట వాళ్ళు అంటుంటే, విని తట్టుకోలేకపోతున్నాం. ప్రీతి ఘటనను అంతటికీ ఆపాదించలేం. దీన్నొక ‘రేరాఫ్‌ ది రేరెస్ట్‌ కేసు’గా చూడాలి. అదే సమయంలో ప్రీతి కేసులో నిష్పక్షపాతంగా విచారణ జరగాలి. ఆమె కుటుంబానికి న్యాయం జరగాలి. అందుకు వారికి మేమంతా మద్దతుగా ఉన్నాం. అయితే ఈ విషయంలో భావోద్వేగాల ఆధారంగా జనం తీర్పులు ఇవ్వడం తగదు. అసలే అలవిమాలిన పని ఒత్తిళ్ళతో సతమతం అవుతున్న మేము... బయట సమాజం నుంచి వస్తున్న నిందలతో మరింత కుంగిపోతున్నాం. ఇంతవరకు స్నేహంగా మెలగిన సీనియర్లు, జూనియర్ల మధ్య సంబంధాలు దెబ్బతినే ప్రమాదం కూడా లేకపోలేదు. బయటి వ్యక్తుల ఊహాగానాల వల్ల... ఒక రోగి ప్రాణాలను నిలబెట్టేందుకు బృందంగా పనిచేసే మా మధ్య లేనిపోని అగాథాలు తలెత్తకూడదు కదా.

ర్యాగింగ్‌ ఉండదు...

నేను మెడిసిన్‌లో చేరి పదేళ్ళు అవుతుంది. ప్రస్తుతం సర్జరీ విభాగంలో పీజీ ఫైనలియర్‌ చదువుతున్నాను. పీజీ స్థాయిలో సీనియర్లను జూనియర్లు వేధించడం వంటివి అస్సలు ఉండవు. పీజీలోనే కాదు, ఎంబీబీఎ్‌సలోనూ నాకెన్నడూ ర్యాగింగ్‌ ఎదురుకాలేదు. ఆధిపత్యం, హింస అని పెద ్దపెద్ద పదాలను చాలా తేలికగా అనేస్తున్నారు. నిజానికి వ్యక్తిగతంగా జూనియర్లను టార్గెట్‌ చేసి బాధించేంత తీరిక సీనియర్లకు ఉండదు. అంతకు మించి అణగిమణగి ఉండాల్సిన అగత్యం జూనియర్లకు లేదు. ఎందుకంటే, ప్రభుత్వ వైద్యకళాశాలల్లో రాత్రి, పగలు అత్యవసర కేసులతోనే ఊపిరి సలపనంత పని. ఒక్కోసారి తినడానికి కూడా సమయం దొరకదు. కుల,మతాలకు అతీతంగా రోగులకు వైద్యం అందిస్తామని ఎంబీబీఎ్‌సలో చేరినప్పుడు ప్రమాణం చేస్తాం. రోగుల పట్ల సమభావంతో మెలిగే వైద్యులు... తమ తోటి వైద్యుల పట్ల వివక్ష చూపిస్తారా! వైద్యవృత్తికి కుల, మత భేదాలు అంటగట్టవద్దని కోరుతున్నాం.

అదీ ఆధిపత్యమేనా...

నేనూ పీజీ మొదటి ఏడాదిలో ఒత్తిడి భరించలేక మానేద్దాం అనుకున్నాను. కానీ ప్రాణాలను నిలబెట్టే వృత్తిలో అడుగుపెట్టాననే స్పృహ నన్ను ముందుకు నడిపించింది. ఒక ఎమర్జెన్సీ కేస్‌ను డీల్‌ చేసేప్పుడు, టీమ్‌లోని వారంతా తమ బాధ్యతల్ని కరెక్టుగా నిర్వర్తించాలి. ఆ క్రమంలో రోగిని ఆపరేషన్‌ థియేటర్‌లోకి తీసుకెళ్లేముందు జరగాల్సిన పరీక్షలు వంటివన్నీ జూనియర్స్‌ చూస్తుంటారు. వాటిల్లో ఏదైనా పొరపాటు తలెత్తితే, అవతల ఓ ప్రాణంతో ముడిపడున్న వ్యవహారం కనుక... ‘చూసుకునే పనిలేదా’ అనో, మరొకటో కాస్త కటువుగా అంటారు. అంతకుమించి కుమిలిపోయేంతగా మాటలతో వేధించడం ఉండదు. అదీ ఆ కేసు వరకే! ఇక్కడ ఎవరికి వారుగా పనిచేయడం ఉండదు కనుక, కలసి మెలసి పని చేసేప్పుడు పొరపాట్లు దొర్లడం, సరిదిద్దుకోవడం సహజం.

జూనియర్లు సీనియర్లను ‘సర్‌’, ‘మేడం’ అని పిలవడంపైనా కొందరు అభ్యంతరం చెబుతున్నారు. వృత్తిలో తనకన్నా ముందున్న వ్యక్తులకు అది వాళ్లు ఇచ్చే గౌరవమేకానీ, అందులో ఆధిపత్యం ఏముంది? దాన్ని కూడా భూతద్దంలో చూడటం తగదు.

25.jpg

విరామంలేని పనిగంటలతోనే ఒత్తిడి-డాక్టర్‌ గాయత్రి గుడిపాటి...

గాంధీ మెడికల్‌ కాలేజీలో పోస్టుగ్రాడ్యుయేషన్‌ అనస్థీషియా రెండవ సంవత్సరం చదువుతున్నారు. పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి దుర్ఘటన నేపథ్యంలో... ఒక మెడికోగా తన అనుభవాన్ని ఆమె ఇలా చెబుతున్నారు...

‘‘ప్రీతి ఘటనతో మా అమ్మ, నాన్నతో పాటు మిగతా కుటుంబ సభ్యులు చాలా భయపడ్డారు. వాళ్ళందరికి నేను తిరిగి ధైర్యం ఇవ్వాల్సి వచ్చింది. నిజానికి పీజీ స్థాయిలో సీనియర్ల నుంచి ర్యాగింగ్‌, వేధింపులు వంటివేవీ ఉండవు. ఆధిపత్య పోకడలు కూడా నాకెన్నడూ ఎదురుకాలేదు. అన్నిటికన్నా మాకు పని ఒత్తిడి విపరీతంగా ఉంటుంది. అదీ మొదటి సంవత్సరంలో మరీ ఎక్కువ. అందులోనూ మిగతా కోర్సులతో పోలిస్తే అనస్థీషియా వాళ్ళది ప్రత్యేకం. న్యూరో, కార్డియో థొరాసిస్‌ సర్జరీలతో పాటు అత్యవసర విభాగం, క్రిటికల్‌ కేర్‌లోని కేసులనూ చూస్తుంటాం. రోగిని వెంటిలేటర్‌ మీద ఉంచాలన్నా, వారికి కొన్ని రకాల అత్యవసర ఇంజెక్షన్లు ఇవ్వాలన్నా కూడా అనస్థీషియన్‌ పర్యవేక్షణ అత్యవసరం. కనుక ఒక్కొక్కరం రోజుకు 6 నుంచి 12 మంది పేషెంట్లను చూస్తుంటాం. ఐదు రోజులకు ఒకసారి నైట్‌ డ్యూటీ ఉంటుంది. అప్పుడు మాత్రం... ఇవాళ ఉదయం 8గంటలకు విధులకు హాజరైతే, తిరిగి మరుసటి రోజు రాత్రి 9 గంటలకు ఇంటికి వెళతాం. అత్యవసర సర్జరీలు ఎక్కువ ఉన్నప్పుడు 60 గంటలు నిర్విరామంగా పనిచేసిన రోజులున్నాయి. అయినా, తర్వాత రోజు మళ్లీ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు రెగ్యులర్‌ డ్యూటీ యథావిధిగా సాగుతుంది. ఆదివారం సెలవు అయినా, ఎమర్జెన్సీ సర్జరీలుంటే వెళ్ళాల్సిందే. నెలకు రెండు రోజులు సెలవులుంటాయి. అది కూడా అత్యవసరమైతేనే తీసుకుంటాం. అప్పుడు మరొక సహవిద్యార్థి లీవ్‌లో ఉండకుండా చూసుకోవాలి.

ఒక్కోసారి రోగుల వల్ల మాకు చివాట్లు

అనస్థీషియాలో అమ్మాయిలు ఎక్కువ. మా బ్యాచ్‌లో అయితే, 17 మందిలో నలుగురు అబ్బాయిలు. కనుక ఎలాంటి వివక్షకూ ఆస్కారం లేదు. సీనియర్లకు జూనియర్ల కులం తెలిసే అవకాశం లేదు కనుక, సామాజిక వివక్షకూ చోటు ఉండదు. సాధారణంగా సర్జరీకి ముందు రోగి శరీరం అనస్థీషియాకి సంసిద్ధంగా ఉందో, లేదో పరీక్షించడం, వారి మెడికల్‌ హిస్టరీ, వాళ్ళు వాడుతున్న మందులు వంటి వివరాలను తెలుసుకొని, రిపోర్టులో రాయడం వంటివన్నీ మొదటి సంవత్సరం విద్యార్థులు చేస్తుంటారు. ఆ రిపోర్టులో రోగి హిస్టరీ సరిగ్గా రాయకుంటే మాత్రం సీనియర్లు కోపగిస్తారు. ఒక్కోసారి రోగులు కూడా సమాధానం మాకు ఒకలా, సీనియర్లకు మరొకలా చెప్పడం వల్ల కూడా మేము చివాట్లు తింటుంటాం.

అది కూడా, ‘అదే మీ రక్తసంబంధీకులైతే ఇలానే వ్యవహరిస్తారా. బాధ్యత లేదా. జాగ్రత్తగా ఉండాలి కదా.!’ వంటి మాటలే ఉంటాయి. రిపోర్టులో చిన్న తప్పు దొర్లినా రోగి ప్రాణాలకే ప్రమాదం కనుక ఆ మాత్రం మందలిస్తారు. అదే సమయంలో తెలియని విషయాలను జూనియర్లకు విడమరిచి చెప్పేది కూడా సీనియర్లే! చిన్న, పెద్ద తేడా లేకుండా, మేమంతా ఒకరికొకరం స్నేహపూర్వకంగా ఉంటాం. ఆపరేషన్‌ థియేటర్‌ నుంచి బయటకొచ్చాక, మేమంతా కలిసే కెఫే కెళతాం. వారానికొకసారి బయట భోజనానికి, అప్పుడప్పుడు సినిమాలకు కలిసి వెళుతుంటాం. కాకుంటే, విరామంలేని పనిగంటలతోనే మాకు ఇబ్బంది. పీజీలో ఫస్ట్‌ ఇయర్స్‌ కే కాదు...సీనియర్లదీ అదే పరిస్థితి.

ఒత్తిడిని తట్టుకునేందుకు...

ఫస్ట్‌ ఇయర్‌లో... సరిగ్గా నిద్రలేక, నేనూ కొన్ని సందర్భాల్లో ఒత్తిడిని ఎదుర్కొన్నా. అలాంటప్పుడు సాహిత్యం చదవడం, కుటుంబంతో కలిసి బయటకు వెళ్ళడం ద్వారా దాని నుంచి బయట పడేదాన్ని. మిగతా స్పెషాలిటీలతో పోలిస్తే అనస్థీషియన్లు సమయంతో పనిలేకుండా నిత్యం అందుబాటులో ఉండాలి. అందుకు తగినట్టు జీవన విధానాన్ని అలవర్చుకోవాలి. అప్పుడే ఒత్తిళ్ళను జయించగలం.’’

Updated Date - 2023-03-01T13:04:34+05:30 IST