Elon Musk: ఎలాన్ మస్క్ పెద్ద తప్పు చేశాడన్న ఉక్రెయిన్ అధికారి.. ఆ పని చేయకపోతే యుద్ధం ముదిరేదన్న మస్క్
ABN , First Publish Date - 2023-09-09T15:21:32+05:30 IST
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ జీవిత చరిత్రపై వాల్టర్ ఐజాక్సన్ రాసిన బయోగ్రఫీలోని ఒక అంశం.. ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అది ఉక్రెయిన్‌ని తీవ్ర ఆగ్రహావేశాలకు గురి చేసింది. దీంతో.. ఉక్రెయిన్...
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ జీవిత చరిత్రపై వాల్టర్ ఐజాక్సన్ రాసిన బయోగ్రఫీలోని ఒక అంశం.. ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అది ఉక్రెయిన్‌ని తీవ్ర ఆగ్రహావేశాలకు గురి చేసింది. దీంతో.. ఉక్రెయిన్ అతనిపై ఉక్రెయిన్ మండిపడుతోంది. ఇంతకీ ఆ అంశం ఏమిటంటే.. రష్యా యుద్ధ నౌకలపై రహస్య డ్రోన్ దాడులు చేయాలని ఉక్రెయిన్ తలపెట్టింది. అయితే.. ఈ దాడుల్ని నివారించేందుకు సివెస్టోపోల్‌లోని స్టార్‌లింక్ సేవల్ని నిలిపివేయాల్సిందిగా ఎలాన్ మస్క్ సూచించారు. ఈ అంశమే మస్క్‌పై ఉక్రెయిన్ మండిపాటుకి కారణమైంది. ఎలాన్ మస్క్ చాలా పెద్ద తప్పు చేశాడంటూ అతనిపై విరుచుకుపడుతోంది.
‘‘ఒక్కోసారి చేసే చిన్న పొరపాటు తీవ్ర తప్పిదంగా మారుతుంది. స్టార్‌లింక్ జోక్యం ద్వారా రష్యన్ నౌకాదళంలో కొంత భాగాన్ని నాశనం చేయడానికి ఉక్రేనియన్ డ్రోన్‌లను అనుమతించని ఎలాన్ మస్క్.. రష్యా నౌకాదళాన్ని ఉక్రేనియన్ నగరాలపై కాలిబర్ క్షిపణుల దాడికి అనుమతించాడు. ఈ దారుణల కారణంగా ఎంతోమంది పిల్లలు, పౌరులు మృతి చెందారు’’ అంటూ ట్విటర్‌లో మస్క్‌పై ఉక్రెయిన్ సీనియర్ అధికారి మైఖైలో పోడోల్యాక్ నిప్పులు చెరిగారు. కొంతమంది యుద్ధ నేరస్తుల్ని, హత్య చేయాలనే వారి కోరికని ఎందుకు రక్షించాలని అనుకుంటున్నారని ప్రశ్నించారు. తాము చెడుని ప్రోత్సహించి తప్పు చేశామన్న విషయాన్ని ఇప్పుడు గ్రహించారా? అని నిలదీశారు.
తనపై ఇలా విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఎలాన్ మస్క్ స్పందించారు. సివెస్తోపోల్‌లో స్టార్ లింక్ సేవలను యాక్టివేట్ చేయాలని తనకు ఉక్రెయిన్ నుంచి అత్యవసర వినతి వచ్చిందని, అయితే దాన్ని తాను తిరస్కరించానని తెలిపారు. ఒకవేళ తాను అందుకు అంగీకరించి ఉంటే.. యుద్ధం మరింత తీవ్రమయ్యేదని సమాధానం ఇచ్చారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ఆజ్యం పోయకూడదన్న ఉద్దేశంతోనే తాను స్టార్ లింక్ సేవల విషయంలో కీవ్ అభ్యర్థనను తోసిపుచ్చానని వివరణ ఇచ్చారు. కాగా.. ఎలాన్ మస్క్ బయోగ్రఫీ పుస్తకం సెప్టెంబర్ 12వ తేదీన విడుదల కానుంది.