Hurricane Idalia: అమెరికాలోని ఈ మూడు రాష్ట్రాల్లో మీ వాళ్లు ఉంటున్నారా.. తుఫాన్ వణికించేస్తోంది!

ABN , First Publish Date - 2023-08-31T18:42:18+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాను ఇడాలియా హరికేన్ వణికిస్తోంది. ఇడాలియా దెబ్బకు ముఖ్యంగా ఫ్లోరిడా, జార్జియా, ఉత్తర కరోలినా రాష్ట్రాలు కకావికలమయ్యాయి. గంటకు 215 కిలో మీటర్ల వేగంతో కూడిన గాలులతో ఫ్లోరిడాలో తీరం దాటిన ఇడాలియా తుఫాన్ పెను బీభత్సం సృష్టించింది.

Hurricane Idalia: అమెరికాలోని ఈ మూడు రాష్ట్రాల్లో మీ వాళ్లు ఉంటున్నారా.. తుఫాన్ వణికించేస్తోంది!

అగ్రరాజ్యం అమెరికాను ఇడాలియా హరికేన్ వణికిస్తోంది. ఇడాలియా దెబ్బకు ముఖ్యంగా ఫ్లోరిడా, జార్జియా, ఉత్తర కరోలినా రాష్ట్రాలు కకావికలమయ్యాయి. గంటకు 215 కిలో మీటర్ల వేగంతో కూడిన గాలులతో ఫ్లోరిడాలో తీరం దాటిన ఇడాలియా తుఫాన్ పెను బీభత్సం సృష్టించింది. ఇడాలియా తుఫాన్ దెబ్బకు పట్టణాలు, నగరాలు, గ్రామాలు నీట మునిగాయి. రోడ్లు జలమయ్యాయి. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను ఎత్తైన ప్రదేశాలకు తరలిస్తున్నారు. భారీ వృక్షాలు సైతం నెలకూలాయి. మొత్తం 5 లక్షల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భారీ గాలులతో కూడిన తుఫాన్ దెబ్బకు ఇళ్లు, హోటళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. విమనాశ్రయాలను తాత్కాలికంగా మూసివేశారు. దీంతో విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. ముఖ్యంగా ఫ్లోరిడాలో ఇడాలియా తుఫాన్ బీభత్సం సృష్టించింది. ఇడాలియా కారణంగా కురిసిన భారీ వర్షాల వల్ల ఫ్లోరిడా బిగ్‌ బెండ్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ భారీ వర్షాల దెబ్బకు గత 125 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా నీటిమట్టాలు భారీగా పెరిగాయి. దీంతో వేలాది ఇళ్లు నీట మునిగాయి. ఫ్లొరిడాలోని పెస్కో కౌంటీలో 6 వేల ఇళ్లు నీట మునిగాయి. దీంతో అనేక ప్రాంతాల్లో ప్రభుత్వం అత్యవసర పరిస్థితులను ప్రకటించింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రాకూడదని సూచించింది.


కరోలినా రాష్ట్రంలో కొన్ని చోట్ల 60 మైళ్ల వేగంతో ఈదురు గాలులు వీచాయి. దీనిని ఇప్పటికే కేటగిరీ 3 శ్రేణికి చెందిన హరికేన్‌గా ప్రకటించారు. ఉత్తర కరోలినాలో వరదలు సంభవించాయి. చాలా ఇళ్లు దెబ్బతిన్నాయి. ఐడాలియా కారణంగా పలు ప్రాంతాల్లో దాదాపు 5 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అనేక చోట్ల మూడు నుంచి ఐదు అడుగుల మేర నీరు చేరింది. దక్షిణ కరోలినాలోని కార్ల్‌స్టోన్ హార్బర్‌లో నీటి మట్టం ఏకంగా 9 అడుగుల మేర పెరిగిపోయింది. ఈ ప్రాంతంలో నమోదైన ఐదో అత్యధిక నీటి పెరుగుదల ఇదే కావడం గమనార్హం. సీడెర్ కీ, ఈస్ట్‌బే టంపా, క్లియర్ వెదర్ బీచ్ వంటి చోట్ల కూడా నీటి మట్టం భారీగా పెరిగిపోయింది. ఇడాలియా తుఫాన్ కారణంగా అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఒక్క ఫ్లొరిడాలోనే 1,40,000 ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జార్జియాలో 1,26,000 ఇళ్లకు, దక్షిణ కరోలినాలో 34 వేల ఇళ్లకు, ఉత్తర కరోలినాలోని 18 వేల ఇళ్లకు విద్యుత్ అందకపోవడంతో వారంతా చీకట్లో మగ్గుతున్నారు. ఫ్లోరిడా గవర్నర్ మీడియాతో మాట్లాడుతుండగానే విద్యుత్ నిలిచిపోవడం గమనార్హం. దీనిని బట్టి విద్యుత్‌కు ఏ స్థాయిలో అంతరాయం కల్గుతుందో అర్థం చేసుకోవచ్చు. అలాగే అనారోగ్యాల భారీన పడకుండా ఉండేందుకు ప్రజలు వేడి చేసిన నీటిని తాగాలని ఫ్లోరిడా అధికారులు సూచించారు. కాగా అమెరికా రక్షణ రంగానికి చెందిన వందలాది మంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.

Updated Date - 2023-08-31T18:42:18+05:30 IST