Pakistan : ఒళ్లు గగుర్పొడిచే పాకిస్థాన్ రక్త చరిత్ర

ABN , First Publish Date - 2023-03-15T13:20:40+05:30 IST

పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ (Former Pakistan Prime Minister Imran Khan)ను అరెస్ట్ చేసేందుకు విశ్వ ప్రయత్నాలు

Pakistan : ఒళ్లు గగుర్పొడిచే పాకిస్థాన్ రక్త చరిత్ర
Pakistan

న్యూఢిల్లీ : పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ (Former Pakistan Prime Minister Imran Khan)ను అరెస్ట్ చేసేందుకు విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆయన మద్దతుదారులు, పోలీసుల మధ్య ఘర్షణలో అనేక మంది గాయాలపాలయ్యారు. తోష్‌ఖానా అవినీతి కేసు ముసుగులో తనను అపహరించి, హత్య చేయడమే పోలీసుల అసలు ఉద్దేశమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్థాన్‌లో రాజకీయ హత్యలు కొత్త విషయం ఏమీ కాదు. గత కాలపు రక్త చరిత్రను తెలుసుకుంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది.

గత ఏడాది నవంబరులో పాకిస్థాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇమ్రాన్ నిర్వహించిన బహిరంగ సభలో ఆయనపై కాల్పులు జరిగాయి. ఇది ఆయనపై జరిగిన హత్యాయత్నమని ఆయన పార్టీ పీటీఐ (PTI) ఆరోపిస్తుండగా, పాక్ మంత్రి మరియం మాట్లాడుతూ, ఇది ఇమ్రాన్ తనపై తాను చేయించుకున్న దాడి అని ఆరోపించారు.

పాకిస్థాన్ 1947లో ఏర్పాటైనప్పటి నుంచి సైనిక తిరుగుబాట్లు, అత్యున్నత స్థాయి రాజకీయ నేతల హత్యలు, ఉరితీతలు జరుగుతూనే ఉన్నాయి. అటువంటి దారుణాల్లో కొన్నిటిని తెలుసుకుందాం.

2007

రావల్పిండిలో 2007లో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న మాజీ ప్రధాన మంత్రి బేనజీర్ భుట్టో (Benazir Bhutto)పై బాంబులు, తుపాకీలతో దాడి చేసి, హత్య చేశారు. అంతకు కొద్ది నెలల ముందు కరాచీలో ఆమెపై హత్యాయత్నం జరిగింది. ఆమెను లక్ష్యంగా చేసుకుని జరిపిన ఆత్మాహుతి దాడిలో సుమారు 139 మంది ప్రాణాలు కోల్పోయారు.

1996

బేనజీర్ భుట్టో సోదరుడు ముర్తజా భుట్టో (Murtaza Bhutto) కూడా 1996లో హత్యకు గురయ్యారు. బేనజీర్ భర్త అసిఫ్ అలీ జర్దారీ ఈ హత్య చేయించారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే సాక్ష్యాధారాలు లేకపోవడం వల్ల రుజువుకాలేదు.

1999

పాకిస్థాన్ సైన్యం మాజీ అధిపతి జనరల్ పర్వేజ్ ముషారఫ్ (General Pervez Musharraf) రక్తపాతం లేని తిరుగుబాటు ద్వారా అధికారాన్ని చేజిక్కించుకున్నారు. 1999 అక్టోబరు 12న అప్పటి ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని సైన్యం డిస్మిస్ చేసింది. అక్టోబరు 14న జనరల్ పర్వేజ్ ముషారఫ్ ఆ దేశ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా బాధ్యతలు చేపట్టారు. పాకిస్థాన్ రాజ్యాంగాన్ని సస్పెండ్ చేశారు. 2001 జూన్‌లో పాకిస్థాన్ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టారు. 2008లో ఆ పదవికి రాజీనామా చేశారు. బేనజీర్ భుట్టో భర్త అసిఫ్ అలీ జర్దారీ (Asif Ali Zardari) దేశాధ్యక్ష పదవిని చేపట్టారు.

1988

మిలిటరీ రూలర్ ప్రెసిడెంట్ మహమ్మద్ జియా ఉల్ హక్ (Mohammad Zia Ul Haq) అంతుబట్టని పరిస్థితుల్లో ఆయన ప్రయాణిస్తున్న విమానం కుప్పకూలడంతో ప్రాణాలు కోల్పోయారు.

1979

బేనజీర్ భుట్టో (Benazir Bhutto) తండ్రి జుల్ఫికర్ అలీ భుట్టో (Zulphikar Ali Bhutto) 1970లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రధాన మంత్రి. ఆయన ఓ రాజకీయ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలపై విచారణ జరిపి, వివాదాస్పద రీతిలో దోషిగా నిర్థరించి, ఉరి శిక్ష అమలు చేశారు.

1977

జుల్ఫికర్ అలీ భుట్టో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటు తర్వాత జియా ఉల్ హక్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైంది. ఆయన భుట్టోను గృహ నిర్బంధంలో ఉంచారు. మార్షల్ లాను అమలు చేశారు. రాజ్యాంగాన్ని సస్పెండ్ చేసి, రాజకీయ పార్టీలను నిషేధించారు.

1958

పాకిస్థాన్‌లో తొలి సైనిక తిరుగుబాటు 1958లో వచ్చింది. గవర్నర్ జనరల్ ఇస్కందర్ మీర్జా (Iskander Mirza) మార్షల్ లాను అమలు చేశారు. చీఫ్ మార్షల్ లా అడ్మినిస్ట్రేటర్‌గా జనరల్ అయూబ్ ఖాన్‌ (Ayub Khan)ను నియమించారు. అయూబ్ ఖాన్ ఆ తర్వాత మీర్జాను తొలగించి దేశాధ్యక్ష పదవిని చేపట్టారు. మీర్జా విదేశాలకు వెళ్లిపోయారు.

1951

పాకిస్థాన్ తొలి ప్రధాన మంత్రి లియాకత్ అలీ ఖాన్‌ (Liyaqat Ali Khan)ను రావల్పిండిలో ఓ బహిరంగ సభలో కాల్చి చంపారు.

అవినీతి కేసులు

పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ అవినీతి కేసుల్లో చిక్కుకున్నారు. నకిలీ బ్యాంకు ఖాతాల కేసులో ఆయన 2019 జూన్‌లో అరెస్టయ్యారు. ఆయన సోదరి ఫర్యాల్ తాల్పూర్‌‌పై కూడా అవినీతి ఆరోపణలు ఉన్నాయి.

పనామా పేపర్స్ కుంభకోణంలో నవాజ్ షరీఫ్ ప్రధాన మంత్రి పదవిని కోల్పోయారు. ప్రభుత్వ పదవులను నిర్వహించడంపై ఆయన జీవిత కాల నిషేధానికి గురయ్యారు. లండన్‌లో నాలుగు లగ్జరీ ఫ్లాట్స్ కొనుగోలు కేసులో షరీఫ్, ఆయన కుమార్తె మరియం దోషులని అకౌంటబిలిటీ కోర్టు తీర్పు చెప్పింది.

పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్‌‌నకు దేశద్రోహం కేసులో మరణ శిక్ష విధించారు. అయితే లాహోర్ హైకోర్టు దీనిని రద్దు చేసింది. ఆయన, ఆయన సతీమణి 10 ఇళ్లు, ఇళ్ల స్థలాలను అక్రమంగా సంపాదించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

పాకిస్థాన్‌‌లో దేశాధ్యక్షుడు, ప్రధాన మంత్రి పదవులను, సైన్యంలో వివిధ పదవులను నిర్వహించినవారిలో చాలా మంది విదేశాల్లో ఇళ్లు, భూములు కొనుక్కుని, పదవీ కాలం ముగిసిన తర్వాత విదేశాల్లోనే స్థిరపడుతూ ఉంటారనే సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి :

Minister: ఆ పరీక్షకు హాజరుకాని విద్యార్థులకు మరో అవకాశం

Land for jobs Case : సీబీఐ కేసులో లాలూ, రబ్రీ, మీసా పిటిషన్లపై ఢిల్లీ కోర్టు సంచలన ఆదేశాలు

Updated Date - 2023-03-15T18:21:03+05:30 IST