Pakistan : ఇమ్రాన్ ఖాన్ నివాసంలోకి చొరబడిన పోలీసులు... పాకిస్థాన్‌లో ఏం జరుగుతోంది?...
ABN , First Publish Date - 2023-03-18T15:42:03+05:30 IST
పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) నివాసంలోకి పోలీసులు శనివారం చొచ్చుకెళ్లారు. ఆయన
లాహోర్ : పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) నివాసంలోకి పోలీసులు శనివారం చొచ్చుకెళ్లారు. ఆయన తోషాఖానా (Toshakhana) కేసులో ఇస్లామాబాద్ కోర్టులో హాజరయ్యేందుకు వెళ్లిన సమయంలో పోలీసులు ఈ చర్యకు పాల్పడ్డారు. ఆ సమయంలో ఆయన నివాసంలో ఆయన సతీమణి బుష్రా బేగమ్ (Bushra Begum) ఒక్కరే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఆయనను అరెస్ట్ చేసేందుకు కొద్ది రోజులపాటు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేసిన సంగతి తెలిసిందే.
ఇమ్రాన్ శనివారం ఇచ్చిన ఓ ట్వీట్‌లో, పంజాబ్ పోలీసులు లాహోర్‌లోని తన నివాసంపై దాడి చేశారని, తన నివాసంలో తన సతీమణి బుష్రా బేగమ్ ఒక్కరే ఉన్నారని తెలిపారు. ఏ చట్టం ప్రకారం పోలీసులు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని నిలదీశారు. ఇదంతా లండన్ ప్రణాళిక అని ఆరోపించారు. పరారీలో ఉన్న నవాజ్ షరీఫ్‌ను అధికారంలోకి తేవడం కోసం ‘నీకు ఇది-నాకు అది’ పద్ధతిలో ఈ ప్రణాళిక సాగుతోందన్నారు.
లాహోర్‌లోని జమన్ పార్క్ ప్రాంతంలో ఉన్న ఇమ్రాన్ ఖాన్ నివాసంలోకి పోలీసులు వెళ్తున్నట్లు కనిపిస్తున్న వీడియోను ఆయన పార్టీ పాకిస్థాన్ తెహరీక్-ఈ-ఇన్సాఫ్ (PTI) సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. సైనిక పాలన జరిగే దేశాల్లో కూడా ఇటువంటి పరిస్థితులు ఉండవని పేర్కొంది.
ఇమ్రాన్ ఖాన్ శనివారం అడిషినల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి కోర్టులో హాజరయ్యారు. ఆస్తుల ప్రకటనలో బహుమతుల వివరాలను ఇమ్రాన్ తెలియజేయలేదని ఎన్నికల కమిషన్ చేసిన ఫిర్యాదుపై ఈ కోర్టు విచారణ జరుపుతోంది.
లాహోర్‌లో ఇమ్రాన్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు బుధ, గురువారాల్లో ప్రయత్నాలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఆయన మద్దతుదారులు పెద్ద ఎత్తున నిరోధించడంతో అరెస్ట్ చేయడం పోలీసులకు సాధ్యం కాలేదు. దీంతో లాహోర్ హైకోర్టు ఆయన అరెస్టును ఒక రోజు వాయిదా వేస్తూ గురువారం ఆదేశాలు ఇచ్చింది.
ఇవి కూడా చదవండి :
Rahul Gandhi : చిక్కుల్లో రాహుల్?
Congress Vs BJP : రాహుల్ గాంధీపై వినూత్నంగా విరుచుకుపడిన జైశంకర్