Pakistan : ఇమ్రాన్ ఖాన్ అరెస్టుతో పాకిస్థాన్‌లో అల్లర్లు.. రావల్పిండి ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌పై దాడులు..
ABN , First Publish Date - 2023-05-09T20:04:12+05:30 IST
పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి, పీటీఐ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) అరెస్టుతో ఆ దేశంలో అల్లర్లు జరుగుతున్నాయి.
ఇస్లామాబాద్ : పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి, పీటీఐ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) అరెస్టుతో ఆ దేశంలో అల్లర్లు జరుగుతున్నాయి. పీటీఐ కార్యకర్తలు వీథుల్లోకి వచ్చి, విధ్వంసం సృష్టిస్తున్నారు. రావల్పిండిలోని గవర్నమెంట్ హెడ్‌క్వార్టర్స్ (GHQ)పై దాడికి యత్నించారు. ఈ కార్యాలయం బయట ఉన్న సింహద్వారం తలుపులను ఓ మహిళ బలంగా కదుపుతున్నట్లు కనిపిస్తున్న ఓ వీడియో వైరల్ అయింది. జీహెచ్‌క్యూ గేట్ వద్దకు తక్షణమే తరలిరావాలని రావల్పిండిలోని అన్ని పోలీస్ స్టేషన్లకు ఆదేశాలు వెళ్లినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
‘కోర్టులో బుధవారం హాజరుపరుస్తాం’
ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్టు చేసి, గుర్తు తెలియని ప్రాంతానికి తరలించినట్లు తెలుస్తోంది. ఆయనను బుధవారం కోర్టులో హాజరుపరచనున్నట్లు ఎన్ఏబీ అధికారి ఒకరు చెప్పారు. ఆయనకు వైద్య పరీక్షలు చేయించామని, మెడికల్ రిపోర్టును కూడా బుధవారమే కోర్టుకు సమర్పిస్తామని తెలిపారు.
దేశవ్యాప్త నిరసనలు
పీటీఐ కార్యకర్తలు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. పాక్ రేంజర్లపై రాళ్ల దాడులు కూడా జరిగినట్లు తెలుస్తోంది. ఇదిలావుండగా, పీటీఐ కార్యకర్తలు కరాచీలో ఓ పోలీసు వాహనానికి నిప్పు పెట్టారు. ఈ వాహనంలో ఖైదీలు ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. కార్ప్స్ కమాండర్ లాహోర్ హౌస్‌పై కూడా ఇమ్రాన్ మద్దతుదారులు దాడి చేసి, నిప్పు పెట్టారు. మరోవైపు ఈ నిరసనలకు మద్దతివ్వాలని పీటీఐ కార్యకర్తలకు, ప్రజలకు సామాజిక మాధ్యమాల ద్వారా కూడా పిలుపు ఇస్తున్నారు. ఇమ్రాన్ అరెస్టు చట్టవిరుద్ధమని పీటీఐ ఉపాధ్యక్షుడు మహమూద్ ఖురేషీ ఓ వీడియో సందేశంలో చెప్పారు. ‘‘మీ భవిష్యత్తు కోసం పోరాడుతున్న గొప్ప నాయకుడైన ఇమ్రాన్ ఖాన్ కోసం మీరంతా మీ ఇళ్ల నుంచి బయటకు రావాలి, ఈరోజు ఎవరూ ఇళ్ల దగ్గర లేరు’’ అని పిలుపునిచ్చారు. ఇమ్రాన్ మద్దతుదారులు పెద్ద ఎత్తున లాహోర్ కంటోన్మెంట్‌లోని షెర్పావో వంతెనను దాటుకుని వెళ్లారు. లాహోర్‌లోని సైనిక కమాండర్ల ఇళ్లపై కూడా దాడులు చేశారు. ఫైసలాబాద్‌లో కూడా ఇమ్రాన్ మద్దతుదారులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.
ఇమ్రాన్‌పై దాడి జరగలేదు : పాక్ మంత్రి
ఇమ్రాన్‌పై దాడి వార్తలను పాకిస్థాన్ ఇంటీరియర్ మినిస్టర్ రాణా సనావుల్లా తోసిపుచ్చారు. విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేశ ఖజానాకు నష్టం కలిగించినందుకు ఇమ్రాన్ ఖాన్‌ను నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో అరెస్టు చేసిందన్నారు. ఆయనపై దాడి జరగలేదన్నారు. పాకిస్థాన్ మీడియా కథనాల ప్రకారం ఇమ్రాన్ 7 బిలియన్ల పాకిస్థానీ రూపాయల విలువైన కుంభకోణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
నా హత్యకు కుట్ర : ఇమ్రాన్
ఇదిలావుండగా, తనను హత్య చేసేందుకు సైన్యం కుట్ర చేస్తోందని ఇమ్రాన్ సోమవారం ఆరోపించారు. మంగళవారం వైరల్ అయిన ఓ వీడియోలో ఇమ్రాన్‌ను ఇస్లామాబాద్ హైకోర్టు వద్ద పారామిలిటరీ రేంజర్లు ఈడ్చుకుంటూ వ్యాన్‌లోకి ఎక్కించినట్లు కనిపించింది. పాక్ రేంజర్లు ఆ దేశ ఇంటీరియర్ మంత్రిత్వ శాఖ పరిధిలో పని చేస్తారు. రేంజర్లకు నాయకత్వం వహించే ఉన్నతాధికారుల్లో సైనికాధికారులు కూడా ఉంటారు.
అరెస్ట్ వారంట్లు
అల్-కాదిర్ ట్రస్ట్ కేసులో అరెస్టు వారంట్లు జారీ అయ్యాయని అందుకే ఆయనను అరెస్టు చేశారని నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో అధికారులు తెలిపారు. ఈ కేసులో ఇమ్రాన్, ఆయన సతీమణి బుష్రా బీబీ, పీటీఐ నేతలు నిందితులని తెలిపారు. అల్-కాదిర్ విశ్వవిద్యాలయం ఏర్పాటు కోసం ఇమ్రాన్ నేతృత్వంలోని ప్రభుత్వం ఓ వ్యాపారవేత్తతో పరిష్కారం కుదుర్చుకుందని, దీనివల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు 50 బిలియన్ పాకిస్థానీ రూపాయలు నష్టం జరిగిందని ఎన్ఏబీ ఆరోపించింది.
ఇవి కూడా చదవండి :
Imran Khan Vs Shehbaz: ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్... ఇస్లామాబాద్‌లో ఉద్రిక్తత