Russia On Canada: కెనడా నాజీలకు అడ్డాగా మారింది.. భారత్ తర్వాత కెనడాపై రష్యా కొరడా

ABN , First Publish Date - 2023-09-25T18:21:34+05:30 IST

గత కొన్ని రోజుల నుంచి కెనడా వరుస వివాదాల్లో చిక్కుకుంటోంది. తొలుత ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ నిజ్జర్ హత్య విషయంలో భారత్‌పై ఆరోపణలు చేసి కెనడా అభాసుపాలైంది. ఈ వ్యవహారంలో.. ఉగ్రవాదులకు కెనడా..

Russia On Canada: కెనడా నాజీలకు అడ్డాగా మారింది.. భారత్ తర్వాత కెనడాపై రష్యా కొరడా

గత కొన్ని రోజుల నుంచి కెనడా వరుస వివాదాల్లో చిక్కుకుంటోంది. తొలుత ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ నిజ్జర్ హత్య విషయంలో భారత్‌పై ఆరోపణలు చేసి కెనడా అభాసుపాలైంది. ఈ వ్యవహారంలో.. ఉగ్రవాదులకు కెనడా సురక్షిత స్వర్గధామంగా మారిందని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ చురకలంటించారు. ఇప్పుడు ఓ వెటరన్ నాజీని సన్మానించి అంతర్జాతీయ స్థాయిలో కెనడా అవమానాలు ఎదుర్కుంటోంది. ఈ విషయంపై రష్యా సైతం తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. కెనడా నాజీలకు స్వర్గధామంగా మారిందని ధ్వజమెత్తింది.

అసలు ఏం జరిగిందంటే.. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నాజీ యూనిట్‌లో సేవలందించిన యారోస్లావ్ హంకా (98)ను కెనడా స్పీకర్ ఆంథోనీ రోటా సన్మానించారు. ఈ సెషన్‌లో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోతో పాటు ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్‌స్కీ కూడా పాల్గొన్నారు. హంకా ఒక ఉక్రేనియన్ హీరో అని, కెనడియన్ యుద్ధ వీరుడని స్పీకర్ ఆంథోనీ కొనియాడారు. అదే సమయంలో కెనడా ఎంపీలందరూ రెండు సార్లు స్టాండింగ్ ఒవేషన్ కూడా ఇచ్చారు. ఈ చర్యతో రష్యా మండిపోయింది. ఒక నాజీని సన్మానించడం ఏంటని కోపాద్రిక్తులైంది. ఈ వ్యవహారంపై రష్యా రాయబారి స్టెపనోవ్ మాట్లాడుతూ.. ‘‘దౌత్య కార్యాలయం దీనిపై తగిన అధికారిక చర్యలు తీసుకుంటుంది. మేము కెనడా ప్రభుత్వం నుంచి కచ్ఛితమైన వివరన కోరుతున్నాం’’ అని అన్నారు.


అంతేకాదు.. కెనడా దేశం నాజీ నేరస్థులను ఒక స్వర్గధామంగా మారిందని స్టెపనోవ్ ఆరోపణలు చేశారు. ఇది అనుకోకుండా జరిగిన తప్పు కాదని, ఉద్దేశపూర్వకంగానే ఒక నాజీని సన్మానించారని, దీనిపై కెనడా వివరణ ఇవ్వాల్సిందేనిన ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే టైంలో భారత్‌లోని రష్యా రాయబారి కూడా ఈ అంశంపై సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. ‘కెనడా ఎల్లప్పుడూ ఉక్రేనియన్ నాజీలకు మాత్రమే సురక్షితమైన స్వర్గధామం అవుతుంది. ఒక నాజీ అనుభవజ్ఞుడు లేచి నిలబడి ఇలా ఉత్సాహంగా మాట్లాడటమే ఇందుకు నిదర్శనం. ఈరోజు తన మనవడు ఎలా తయారయ్యాడన్నది అతని తాత చూడలేకపోయినందుకు దేవునికి ధన్యవాదాలు’’ అంటూ ఘాటుగా బదులిచ్చారు.

ఇలా రష్యా నుంచి తీవ్రమైన స్పందన వచ్చిన తరుణంలో.. కెనడా స్పీకర్ ఆంథోనీ రోటా క్షమాపణలు చెప్పారు. తాము అలా చేయకుండా ఉండాల్సిందని వివరణ ఇచ్చాడు. కానీ.. రష్యా మాత్రం కెనడా చేసిన పనికి ఇంకా కోపంగానే ఉంది. మరోవైపు.. భారత్-కెనడా మధ్య నెలకొన్న దౌత్య వివాదంలోనూ జైశంకర్ కెనడాపై గతంలో విరుచుకుపడ్డారు. ‘‘ఉగ్రవాదులకు కెనడా సురక్షితమైన స్వర్గధామం’’గా మారిందని అన్నారు.

Updated Date - 2023-09-25T18:21:34+05:30 IST