Vivek Ramaswamy: రష్యాకు బంపరాఫర్ ప్రకటించిన వివేక్ రామస్వామి.. కానీ ఒక కండీషన్!

ABN , First Publish Date - 2023-09-01T16:19:37+05:30 IST

అమెరికాలోని ప్రతిపక్ష రిపబ్లికన్ల పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న వివేక్ రామస్వామి తాజాగా రష్యాకు ఒక బంపరాఫర్ ప్రకటించాడు. ఒకవేళ తాను అమెరికా అధ్యక్షుడినై వైట్‌హౌస్‌లో అడుగుపెడితే..

Vivek Ramaswamy: రష్యాకు బంపరాఫర్ ప్రకటించిన వివేక్ రామస్వామి.. కానీ ఒక కండీషన్!

అమెరికాలోని ప్రతిపక్ష రిపబ్లికన్ల పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న వివేక్ రామస్వామి తాజాగా రష్యాకు ఒక బంపరాఫర్ ప్రకటించాడు. ఒకవేళ తాను అమెరికా అధ్యక్షుడినై వైట్‌హౌస్‌లో అడుగుపెడితే.. ఉక్రెయిన్, రష్యా మధ్య ప్రస్తుతమున్న నియంత్రణ రేఖను అలాగే ఉండేలా చేస్తానన్నారు. అంతేకాదు.. నాటోలోకి ఉక్రెయిన్‌ని అనుమతించబోమని, రష్యాపై విధించిన ఆంక్షల్ని కూడా ఎత్తివేస్తామని పేర్కొన్నారు. అయితే.. ఇవన్నీ జరగాలంటే మాత్రం చైనాతో సైనిక కూటమి నుంచి రష్యా వైదొలగాల్సి ఉంటుందని వివేక్ ఒక కండీషన్ పెట్టారు. చైనా సవాళ్లను ఎదుర్కోవాలంటే రష్యా చాలా కీలకమైందని.. కాబట్టి రష్యాను చైనా నుంచి దూరం చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు.


ఫాక్స్ న్యూస్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివేక్ రామస్వామి మాట్లాడుతూ.. ‘‘నాకు ఒక స్పష్టమైన లక్ష్యం ఉంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అంగీకరించేలా ఒక ఒప్పందం చేస్తాను. అది అమెరికా ప్రయోజనాలను కూడా మెరుగుపరుస్తుంది. ఆ ఒప్పందం ఏమిటంటే.. ప్రస్తుతమున్న ఉక్రెయిన్, రష్యాల మధ్య నియంత్రణ రేఖలను యథాతథంగా ఉంచేస్తాను. నాటోలోకి ఉక్రెయిన్‌కి స్థానం ఇవ్వం. పుతిన్‌తో ఒప్పందం కుదుర్చుకోవడానికి ఇది సరిపోతుంది. కానీ.. ఇందుకు ప్రతిగా అమెరికాకి మెరుగైన ఆఫర్లు లభించాలి. చైనాతో సైనిక ఒప్పందం నుంచి రష్యా వైదొలగాల్సి ఉంటుంది. నిజానికి.. రష్యా-చైనా సైనిక ఒప్పందం అనేది ప్రస్తుతం అమెరికా ముందు ఉన్న అతిపెద్ద ముప్పు’’ అంటూ చెప్పుకొచ్చారు.

చైనా సైనిక ఒప్పందం నుంచి రష్యా వైదొలగడంతో పాటు పశ్చిమార్థం గోళం నుంచి తన సైనిక బలగాల్ని రష్యా తగ్గించుకునేలా చేస్తానని వివేక్ రామస్వామి తెలిపారు. రష్యాతో ఆర్థిక సంబంధాలను పునరుద్ధరిస్తానని.. అప్పుడు చైనా అవసరం రష్యాకు తగ్గిపోతుందని వివరించారు. ప్రస్తుతం తాము రష్యాతో సంబంధాలు తెంచుకోవడం వల్లే.. పశ్చిమ దేశాలకు చైనా విలువైనదిగా మారిందని పేర్కొన్నారు. నార్డ్‌స్ట్రీమ్ గ్యాస్ పైప్‌లైన్‌పై బాంబింగ్ వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని.. కానీ తాను అధ్యక్షుడినైతే మాత్రం రష్యాతో అమెరికా సంబంధాలు బలపడేలా చూస్తానని వెల్లడించారు.

Updated Date - 2023-09-01T16:19:37+05:30 IST