విషాదం.. పడవ బోల్తా పడి 18 మంది చిన్నారులు గల్లంతు

ABN , First Publish Date - 2023-09-14T15:09:29+05:30 IST

బీహార్‌లో విషాదం చోటుచేసుకుంది. పడవ బోల్తా పడి 18 మంది చిన్నారులు గల్లంతయ్యారు. ఘటన జరిగిన సమయంలో పడవలో 34 మంది ఉన్నారు.

విషాదం.. పడవ బోల్తా పడి 18 మంది చిన్నారులు గల్లంతు

ముజఫర్‌పూర్: బీహార్‌లో విషాదం చోటుచేసుకుంది. పడవ బోల్తా పడి 18 మంది చిన్నారులు గల్లంతయ్యారు. ఘటన జరిగిన సమయంలో పడవలో 34 మంది ఉన్నారు. అందులో 32 మంది చిన్నారులే కావడం గమనార్హం. బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. వారంతా పక్క ఊరిలో ఉన్న పాఠశాలకు చదువుకోవడానికి వెళ్తుండగా భాగమతి నదిలో ఈ ఘటన చోటు చేసుకుంది. మధుపూర్ పట్టి ఘాట్ సమీపంలో భాగమతి నది ఒడ్డున పడవ ప్రమాదానికి గురైంది. ప్రమాద విషయం తెలిసిన వెంటనే స్థానికులు పడవలతో సహాయక చర్యలు చేపట్టి కొంతమంది చిన్నారులను రక్షించారు. మిగిలిన వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ఘటనపై బీహార్ ముఖ్యమంతి నితీష్ కుమార్ స్పందించారు. జిల్లా మేజిస్ట్రేట్‌తో సహా సీనియర్ జిల్లా అధికారులను ప్రమాద స్థలానికి పంపామని తెలిపారు. విద్యార్థుల కుటుంబాలకు సహాయం చేస్తామని, వారికి మద్దతుగా ఉంటామని హామీ ఇచ్చారు. "రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ విషయాన్ని అత్యవసరంగా పరిశీలించాలని నేను సంబంధిత జిల్లా మేజిస్ట్రేట్‌ని కోరాను. బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల సహాయం చేస్తుంది." అని నితీష్ కుమార్ తెలిపారు. అలాగే స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ నుంచి ఒక బృందం కూడా ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Updated Date - 2023-09-14T15:09:29+05:30 IST