Ayodhya: రామయ్య కోసం 300 టన్నుల సుగంధ బియ్యం లోడు.. ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా?..
ABN , Publish Date - Dec 31 , 2023 | 07:45 AM
రాముడి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఛత్తీ్‌సగఢ్ నుంచి 300 టన్నుల సుగంధ బియ్యం లోడు అయోధ్యకు బయల్దేరింది. ఈ రాష్ట్రంలోని చాంద్‌ఖురీ గ్రామం రాముడి తల్లి కౌసల్య జన్మస్థలంగా భావిస్తారు.
రాముడి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఛత్తీ్‌సగఢ్ నుంచి 300 టన్నుల సుగంధ బియ్యం లోడు అయోధ్యకు బయల్దేరింది. ఈ రాష్ట్రంలోని చాంద్‌ఖురీ గ్రామం రాముడి తల్లి కౌసల్య జన్మస్థలంగా భావిస్తారు. శనివారం రాయ్‌పూర్ వీఐపీ రోడ్డులోని శ్రీరామ మందిరం వద్ద జరిగిన కార్యక్రమంలో సీఎం విష్ణుదేవ్ సాయి బియ్యం లోడుతో కూడిన 11 ట్రక్కులను కాషాయ జెండా ఊపి ప్రారంభించారు. ఛత్తీ్‌సగఢ్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘సుగంధ బియ్యం సమర్పణ కార్యక్రమం’ పేరుతో ఈ బియ్యాన్ని పంపుతున్నట్టు అధికారులు వెల్లడించారు. రాముడి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఈ బియ్యాన్ని ప్రసాదంగా వినియోగించాలని సూచించామని తెలిపారు.
కాగా శనివారం అయోధ్యలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ రామాలయ ప్రారంభోత్సవం కోసం యావత్ ప్రపంచం ఎదురు చూస్తోందని అన్నారు. ఆ మహత్కార్యం జరిగే జనవరి 22న ఇంటింటా ప్రత్యేకంగా ‘శ్రీరామ జ్యోతి’ దీపాలు వెలిగించి దీపావళి పండుగలా వేడుక జరుపుకోవాలని దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శనివారం అయోధ్య పర్యటనలో భాగంగా ప్రధాని అక్కడ నూతనంగా నిర్మించిన మహర్షి వాల్మీకి విమానాశ్రయాన్ని, ఆధునిక హంగులతో పునరుద్ధరించిన అయోధ్యధామ్ రైల్వేస్టేషన్‌ను ప్రారంభించారు. అనంతరం 2 అమృత్ భారత్, 6 వందేభారత్ రైళ్లకు ఆయన జెండా ఊపారు. అలాగే రూ.15,700 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు.