Covid-19: మళ్లీ విజృంభిస్తోన్న కరోనా.. ఐదుగురు మృతి.. భారీగా కొత్త కేసులు నమోదు
ABN , Publish Date - Dec 18 , 2023 | 09:09 AM
దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. కొత్త వేరియంట్లతో భయపెడుతోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం దేశవ్యాప్తంగా ఆదివారం 335 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఐదుగురు మరణించారు.
దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. కొత్త వేరియంట్లతో భయపెడుతోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం దేశవ్యాప్తంగా ఆదివారం 335 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఐదుగురు మరణించారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,701కు చేరింది. జేఎన్-1(JN.1) నూతన కరోనా వేరియంట్ కారణంగా కేరళలో నలుగురు, ఉత్తరప్రదేశ్‌లో ఒకరు చనిపోయారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. దేశంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4.50 కోట్లు దాటింది. తాజా కేసులతో కలిపి దేశంలో ఇప్పటివరకు 4,50,04,816 కరోనా కేసులు నమోదయ్యాయి. రికవరీ రేటు 98.91 శాతంగా ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కరోనా కారణంగా దేశంలో ఇప్పటివరకు 5,33,316 మంది చనిపోయారు. మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. అలాగే దేశంలో ఇప్పటివరకు 220.67 కోట్ల డోస్‌ల కోవిడ్ 19 వ్యాక్సిన్ ఇచ్చినట్టు కేంద్ర మంత్రిత్వ శాఖ పేర్కొంది.
కాగా నవంబర్ 18వ తేదీన 79 ఏళ్ల మహిళ నుంచి వచ్చిన నమూనా ఆర్టీ-పీసీఆర్ (RT-PCR) పరీక్షలో పాజిటివ్‌గా తేలింది. ఆమెకు ఇన్ఫ్లుఎంజా లాంటి అనారోగ్యాల (ILI) తేలికపాటి లక్షణాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆమె కొవిడ్-19 నుంచి కోలుకున్నట్టు తెలిసింది. అంతకుముందు సింగపూర్‌లో ఉన్న ఒక భారతీయు యాత్రికుడు కూడా జేఎన్-1 (JN.1) సబ్-వేరియంట్ బారిన పడ్డాడు. తమిళనాడులోని తిరుచిరాపల్లి జిల్లాకు చెందిన ఆ వ్యక్తి అక్టోబర్ 25వ తేదీన సింగపూర్‌కు వెళ్లాడు. అయితే స్థానికంగా కానీ, తమిళనాడు రాష్ట్రంలో కానీ ఈ వేరియెంట్ కేసులేమీ నమోదు కాలేదని నివేదికలు వెల్లడించాయి.