AAP Vs BJP : రాఘవ్ చద్దా ఎంపీ పదవి రద్దుకు బీజేపీ యత్నాలు : ఆప్
ABN , First Publish Date - 2023-08-10T11:28:26+05:30 IST
భారతీయ జనతా పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య వివాదం మరింత ముదురుతోంది. ఢిల్లీ సర్వీసెస్ బిల్లును సెలెక్ట్ కమిటీకి నివేదించాలని ప్రతిపాదించేందుకు రాసిన లేఖపై బీజేపీ, బీజేడీ, ఏఐఏడీఎంకే ఎంపీల సంతకాలను ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా ఫోర్జరీ చేశారని బీజేపీ ఆరోపించిన సంగతి తెలిసిందే.
న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య వివాదం మరింత ముదురుతోంది. ఢిల్లీ సర్వీసెస్ బిల్లును సెలెక్ట్ కమిటీకి నివేదించాలని ప్రతిపాదించేందుకు రాసిన లేఖపై బీజేపీ, బీజేడీ, ఏఐఏడీఎంకే ఎంపీల సంతకాలను ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా ఫోర్జరీ చేశారని బీజేపీ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలపై ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ గురువారం తీవ్రంగా విరుచుకుపడ్డారు.
రాజ్య సభలో ఢిల్లీ సర్వీసెస్ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాలని కోరుతూ ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా ఓ లేఖను తయారు చేశారు. ఈ కమిటీలో బీజేడీ, బీజేపీ, ఏఐఏడీఎంకే ఎంపీల పేర్లను కూడా పేర్కొన్నారు. దీనిపై ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ, పేరును ప్రతిపాదించేందుకు సంతకాలు అక్కర్లేదని హోం మంత్రి అమిత్ షా తెలుసుకోవాలన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేసినట్లుగానే, తమ పార్టీ నేత రాఘవ్ చద్దా రాజ్య సభ సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అబద్ధాన్ని వెయ్యిసార్లు చెప్పి, అదే నిజమని నమ్మించాలనేది బీజేపీ మంత్రమని తెలిపారు. ఎంపీల సంతకాలు ఫోర్జరీ అయ్యాయని ఆ పార్టీ తప్పుడు వ్యాఖ్యలు చేస్తోందన్నారు. నిబంధనల ప్రకారం, కమిటీకి సభ్యునిగా ప్రతిపాదించబడే ఎంపీ సంతకం అవసరం లేదన్నారు.
ఢిల్లీ సర్వీసెస్ బిల్లును పరిశీలించేందుకు ఓ కమిటీని నియమించాలని రాఘవ్ చద్దా సోమవారం రాజ్యసభను కోరారు. ఈ సెలెక్ట్ కమిటీలో తమ పేర్లను తమ సమ్మతి లేకుండా చేర్చారని సస్మిత్ పాత్రా (బీజేడీ), ఎస్ ఫంగ్నోన్ కొన్యక్ (బీజేపీ), ఎం తంబిదురై (ఏఐఏడీఎంకే), నరహరి అమిన్ (బీజేపీ) ఆరోపించారు. ఈ ఫిర్యాదులపై దర్యాప్తునకు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సోమవారం ఆదేశించారు. ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌కర్ బుధవారం ఈ ఎంపీల హక్కులకు రాఘవ్ చద్దా విఘాతం కలిగించారనే ఫిర్యాదులను ప్రివిలెజ్ కమిటీకి పంపించారు.
ఆప్ జాతీయ అధికార ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ అంతకుముందు మాట్లాడుతూ, బీజేపీ రాఘవ్ చద్దాపై తప్పుడు కేసును సృష్టిస్తోందని ఆరోపించారు. ఆప్ నేత, ఢిల్లీ రాష్ట్ర మంత్రి అతిషి మాట్లాడుతూ, రాఘవ్ చద్దా ఫోర్జరీకి పాల్పడినట్లు బీజేపీ ఆరోపిస్తోందని, ఇది ఆయన రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయించేందుకు జరుగుతున్న ప్రయత్నమని మండిపడ్డారు.
ఢిల్లీ రాష్ట్రంలోని అధికారుల బదిలీలు, నియామకాలకు సంబంధించిన ఢిల్లీ సర్వీసెస్ బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి :
Chennai: 12 నుంచి చెన్నైలో చాగంటి ప్రవచనాలు
No-confidence motion : అవిశ్వాస తీర్మానంపై చర్చకు మోదీ సమాధానం మరి కాసేపట్లో