కర్ణాటక ఎన్నికలకు సరిగ్గా 10 రోజుల ముందు ఒపీనియన్ పోల్స్ విడుదల.. మెజారిటీ సాధించే పార్టీ ఏదంటే..

ABN , First Publish Date - 2023-04-30T14:38:05+05:30 IST

దక్షణాది రాష్ట్రమైన కర్ణాటకలో అధికారం చేతులు మారబోతోంది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు..

కర్ణాటక ఎన్నికలకు సరిగ్గా 10 రోజుల ముందు ఒపీనియన్ పోల్స్ విడుదల.. మెజారిటీ సాధించే పార్టీ ఏదంటే..

బెంగళూరు: దక్షణాది రాష్ట్రమైన కర్ణాటకలో (Karnataka) అధికారం చేతులు మారబోతోంది. కర్ణాటకలో కాంగ్రెస్ (Congress) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. బీజేపీ (BJP) భారీగా నష్టపోనుంది. జేడీ(ఎస్) సాదాసీదా ఫలితాలు సాధిస్తుంది. ఏబీపీ-సీఓటర్ (ABP-CVoter) ఒపీనియన్ పోల్స్‌ (Openion polls)‌ ఈ సంచలన విషయాలను వెల్లడించింది. దక్షిణాదిన అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రాన్ని (కర్ణాటక) కాపాడుకోవడం ప్రస్తుతం బీజేపీ ముందున్న ఏకైక లక్ష్యం కాగా, బీజేపీ నుంచి పగ్గాలు తమ చేతుల్లోకి తీసుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. అయితే, తాజా ఒపీనియన్ పోల్స్‌లో బీజేపీకి వచ్చే సీట్లు ఆ పార్టీకి అంతగా అనుకూలంగా లేవు. సీఓటర్‌తో కలిసి ఏబీపీ న్యూస్ 17,772 మంది ప్రజల అభిప్రాయాలను సేకరించింది.

కాంగ్రెస్‌కు 107 నుంచి 119

ఒపీనియన్ పోల్స్ అంచనాల ప్రకారం, 224 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గరిష్టంగా 107 సీట్ల నుంచి 119 సీట్లు గెలుచుకుంటుంది. బీజేపీకి 74 నుంచి 86 సీట్లు వచ్చే అవకాశం ఉది. జేడీఎస్ 23 నుంచి 35 సీట్లు గెలుచుకుంటుుంది. ఇతరులు జీరో నుంచి 5 సీట్లు వరకూ గెలుచుకుంటారు. ఓట్ల షేర్ ప్రకారం కాంగ్రెస్ కంటే బీజేపీ 5 శాతం వెనుకబడి ఉంది. కాంగ్రెస్ 40 శాతం ఓట్ షేర్ సాధించుకోనుండగా, బీజేపీకి 35 శాతం ఓట్ షేర్ వస్తుంది. జేడీఎస్‌ ఓట్ షేర్ 17 శాతంగా ఉండనుంది. ఇదే సమయంలో, ఇతరులకు 8 శాతం ఓట్లు వెళ్తాయి.

కర్ణాటక ప్రభుత్వం, సీఎం పనితీరుపై...

కర్ణాటక ప్రభుత్వ (బీజేపీ) పనితీరు బాగుందని 29 శాతం మంది అభిప్రాయపడగా, బాగోలేదని 52 శాతం మంది అభిప్రాయంగా ఉంది. 19 శాతం ఫరవాలేదని చెప్పారు. సీఎం పని తీరు బాగుందని 24 శాతం మంది అభిప్రాయపడగా, 51 శాతం బాగోలేదని, ఫరవాలేదని 25 శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేశారు.

మోదీ పనితీరు... సీఎం ఎవరైతే బాగుంటుంది?

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పనితీరు బాగుందని ఒపీనియన్ పోల్స్‌లో పాల్గొన్న 49 శాతం మంది అభిప్రాయపడగా, 33 శాతం బాగోలేదన్నారు. 18 శాతం మంది ఫరవాలేదని అభిప్రాయపడ్డారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుందనే అభిప్రాయంపై బసవరాజ్ బొమ్మైకి 31 శాతం మొగ్గుచూపగా, సిద్ధరామయ్యకు సానుకూలంగా 41 శాతం స్పందించారు. హెచ్‌డీ కుమార స్వామికి 22 శాతం మొగ్గుచూపగా, డి.శివకుమార్‌కు 3 శాతం, ఇతరులకు 3 శాతం మొగ్గుచూపారు.

కర్ణాటకలో కీలకాంశం

కర్ణాటక ఓటర్లు నిరుద్యోగం ప్రధాన అంశంగా భావిస్తున్నారు. నిరుద్యోగం ప్రధానాంశమని 30 శాతం మంది అభిప్రాయపడగా, కనీస వసతుల అంశంపై 24 శాతం మంది, విద్యపై 14 మంది, అవినీతి ప్రధానాంశమని 13 శాతం మంది, శాంతి భద్రతల అంశం ప్రధానమని 3 శాతం మంది, ఇతర అంశాలకు 16 శాతం మంది మొగ్గుచూపారు.

ప్రాంతాల వారీగా ఓట్ షేర్...

ఒపీనియన్ పోల్స్ ప్రకారం 32 సీట్లు ఉన్న గ్రేటర్ బెంగళూరులో బీజేపీకి 36 శాతం ఓట్ షేర్, కాంగ్రెస్‌కు 43 శాతం, జేడీఎస్‌కు 14 శాతం, ఇతరులకు 7 శాతం ఓట్ షేర్ రానుంది. బీజేపీకి 11 నుంచి 15 సీట్లు వస్తాయి. కాంగ్రెస్‌ 15 నుంచి 19 సీట్లు గెలుచుకుంటుంది. జేడీఎస్‌కు 2 నుంచి 4, ఇతరులు జీరో నుంచి ఒక సీటు దక్కుతాయి.

కాగా, 55 సీట్లు ఉన్న ఓల్డ్ మైసురు ప్రాంతంలో (55 సీట్లు) బీజేపీకి 24 శాతం ఓట్ షేర్ వస్తుంది. కాంగ్రెస్‌కు 36 శాతం, జేడీఎస్‌కు 34 శాతం, ఇతరులకు 6 శాతం ఓట్ షేర్ రానుంది. బీజేపీ 3 నుంచి 7, కాంగ్రెస్ 21 నుంచి 25 సీట్లు, జేడీఎస్ 25 నుంచి 29 సీట్లు, ఇతరులు జీరో నుంచి 1 సీటు గెలుచుకుంటారు.

సెంట్రల్ కర్ణాటక ప్రాంతంలో (35 సీట్లు)లో బీజేపీ 36 శాతం ఓట్ షేర్ సాధించనుండగా, కాంగ్రెస్‌కు 41 శాతం, జేడీఎస్‌కు 14 శాతం, ఇతరులకు 9 శాతం ఓట్ షేర్ రానుంది. బీజేపీ 12 నుంచి 16 సీట్లు గెలుచుకోనుండగా, కాంగ్రెస్ 19 నుంచి 23 సీట్లు, జేడీఎస్ జీరో నుంచి 1 సీటు దక్కించుకోనున్నాయి. ఇతరులకు జీరో నుంచి 1 సీటు దక్కే అవకాశం ఉంది.

కోస్టల్ కర్ణాటక రీజియన్ (21 సీట్లు)లో బీజేపీకి 48 శాతం ఓట్ షేర్ రానుండగా, కాంగ్రెస్‌కు 33 శాతం, జేడీఎస్ 10 శాతం, ఇతరులు 9 శాతం ఓట్ షేర్ వస్తుంది. బీజేపీ 15 నుంచి 19 సీట్లు గెలుచుకోనుండగా, కాంగ్రెస్ 3 నుంచి 5 సీట్లు గెలుచుకోనుంది. జేడీఎస్‌ ఖాతా తెరవదు. ఇతరులు జీరో నుంచి 1 సీటు గెలుచుకుంటారు.

ముంబై కర్ణాటక రీజియన్‌లో బీజేపీకి 42 శాతం, కాంగ్రెస్‌కు 43 శాతం, జేడీఎస్‌కు 8 శాతం, ఇతరులకు 7 శాతం ఓట్ షేర్ రానుంది. బీజేపీ 20 నుంచి 24 సీట్లు, కాంగ్రెస్ 26 నుంచి 30 సీట్లు, జేడీఎస్ జీరో నుంచి 1 సీటు, ఇతరులకు జీరో నుంచి ఒక సీటు దక్కుతాయి.

హైదరాబాద్-కర్ణాటక ప్రాంతంలో (31 సీట్లు) బీజేపీకి 37 శాతం ఓట్ షేర్ రానుంది. కాంగ్రెస్ 45 శాతం, జేడీఎస్ 11 శాతం ఓట్ షేర్, ఇతరులు 7 శాతం ఓట్ షేర్ సాధిస్తారు. బీజేపీకి 8 నుంచి 12 సీట్లు రానుండగా, కాంగ్రెస్ 19 నుంచి 23 సీట్లు, జేడీఎస్ జీరో నుంచి 1 సీటు దక్కించుకుంటాయి. ఇతరులు జీరో నుంచి 1 సీటు దక్కించుకుంటారు.

దీనికి ముందు, కర్ణాటక ఎన్నికలపై గత మార్చి 29న ఏబీపీ న్యూస్ సర్వే డాటా విడుదల చేసింది. ఆ సర్వేలో బీజేపీకి 68 నుంచి 80 సీట్లు, కాంగ్రెస్‌కు 115 నుంచి 127 సీట్లు, జేడీఎస్‌కు 23 నుంచి 35 సీట్లు, ఇతరులకు జీరో నుంచి 2 సీట్లు వస్తాయని అంచనా వేసింది. కాగా, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు మే 10న జరుగనున్నాయి. మే 10న ఫలితాలు వెలువడతాయి.

Updated Date - 2023-04-30T15:44:35+05:30 IST