Chhattisgarh-Mizoram: ఛత్తీస్‌గఢ్‌లో, మిజోరంలో గెలుపెవరిది.? సర్వే ఏం చెప్పిందంటే..?

ABN , First Publish Date - 2023-10-09T19:49:45+05:30 IST

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఎన్నికల కమిషన్ సోమవారంనాడు ప్రకటించడంతో అన్ని రాష్ట్రాల్లోనూ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేసింది. ఛత్తీస్‌గఢ్, మిజోరంలో ఓటరు నాడిపై ఏబీపీ-సీఓటర్ సర్వే ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది. ఛత్తీస్‌గఢ్‌ లో అధికార కాంగ్రెస్, విపక్ష బీజేపీ మధ్య నువ్వానేనా అనే రీతిలో పోరు ఉండనుందని, మిజోరంలో హంగ్‌‍కు అవకాశాలున్నాయని సర్వే అంచనా వేసింది.

Chhattisgarh-Mizoram: ఛత్తీస్‌గఢ్‌లో, మిజోరంలో గెలుపెవరిది.? సర్వే ఏం చెప్పిందంటే..?

న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల (5 state elecitons) తేదీలను ఎన్నికల కమిషన్ సోమవారంనాడు ప్రకటించడంతో అన్ని రాష్ట్రాల్లోనూ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేసింది. రాజకీయ వాతావరణం కూడా ఒక్కసారిగా వేడెక్కింది. ఛత్తీస్‌గఢ్, మిజోరంలో ఓటరు నాడిపై ఏబీపీ-సీఓటర్ (ABP-CVoter) సర్వే ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది. ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh)లో అధికార కాంగ్రెస్, విపక్ష బీజేపీ మధ్య నువ్వానేనా అనే రీతిలో పోరు ఉండనుందని, మిజోరం (Mizoram)లో హంగ్‌‍కు అవకాశాలున్నాయని సర్వే అంచనా వేసింది.


ఛత్తీస్‌గఢ్‌లో..

కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో నవంబర్ 7, 17 తేదీల్లో రెండు విడతలుగా పోలింగ్ జరుగనుంది. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడతాయి. ఒపీనియన్ పోల్ సర్వే ప్రకారం, కాంగ్రెస్-బీజేపీ మధ్య పోరు హోరాహోరీగా ఉండబోతోంది. మొత్తం 90 సీట్లలో కాంగ్రెస్ 45 నుంచి 51 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. బీజేపీ 39 నుంచి 45 సీట్లు గెలుచుకోవచ్చు. ఇతరులు జీరో నుంచి 2 సీట్ల వరకూ గెలుచుకునే అవకాశం ఉంది.


కాగా, ఓటింగ్ షేర్ ప్రకారం, కాంగ్రెస్ 45.3 శాతం ఓట్ల షేర్ రాబట్టనుంది. గత ఎన్నికల్లో 43.1 శాతం ఓటింగ్ షేర్ ఉండగా ఈసారి 2.2 శాతం అదనంగా వచ్చి చేరనుంది. బీజేపీ 43.4 శాతం ఓటింగ్ షేర్ రాబట్టనుంది. ఆ పార్టీకి గతంలో కంటే 10.5 శాతం ఓటింగ్ పెరగనుంది. ఇతరుల 11.2 శాతం ఓటింగ్ షేర్ రాబట్టే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో ఓటింగ్ శాతం కంటే ఈసారి 12.7 శాతం ఓటింగ్ షేర్ వీరికి తగ్గనుంది.


మిజోరంలో...

ఏబీపీ-సీఓటర్ ఒపీనియన్ పోల్ ప్రకారం, మిజోరంలో ఏ పార్టీకి సొంతంగా పూర్తి మెజారిటీ వచ్చే అవకాశాలు లేనందున హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుంది. మిజోరంలోని మొత్తం 40 స్థానాలకు గాను మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్) 13 నుంచి 17 సీట్లు గెలువవచ్చు. కాంగ్రెస్ పార్టీ 10 నుంచి 14 సీట్లలో గెలుస్తుంది. జడ్‌పీఎం 9 నుంచి 13 సీట్లు, ఇతరులు 1 నుంచి 3 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. మిజోరంలో నవంబర్ 7న ఓటింగ్ జరగనుంది. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడతాయి.

Updated Date - 2023-10-09T19:49:45+05:30 IST