Karnataka : టిప్పు సుల్తాన్‌పై వ్యతిరేకత... బీజేపీలో భిన్నాభిప్రాయాలు...
ABN , First Publish Date - 2023-02-17T19:00:50+05:30 IST
కర్ణాటక శాసన సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రచారాస్త్రాలపై బీజేపీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
బెంగళూరు : కర్ణాటక శాసన సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రచారాస్త్రాలపై బీజేపీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల వరుసగా నిర్వహిస్తున్న కీలక నేతల సమావేశాల్లో టిప్పు సుల్తాన్‌పై వ్యతిరేకతను వ్యక్తం చేయడం కన్నా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న అభివృద్ధిపై దృష్టి సారించాలని కొందరు అభిప్రాయపడినట్లు విశ్వసనీయ సమాచారం.
టిప్పు సుల్తాన్, వినాయక్ దామోదర్ సావర్కర్ గురించి బీజేపీ కర్ణాటక శాఖ అధ్యక్షుడు నళిన్ కుమార్ కటీల్ (Nalin Kumar Kateel) ఇటీవల మాట్లాడారు. 18వ శతాబ్దపు మైసూరు పాలకుడి చుట్టూ బీజేపీ ప్రచారాన్ని తిప్పడం సరికాదని, పార్టీ కేంద్ర నాయకత్వం కోరుకుంటున్నది ఇది కాదని కొందరు అభిప్రాయపడినట్లు తెలిసింది. అయితే కాంగ్రెస్‌తో గట్టి పోటీ ఉన్న కర్ణాటకలో ఇది చాలా తెలివైన సూత్రమని మరికొందరు అభిప్రాయపడుతున్నట్లు తెలిసింది. కేవలం టిప్పు సుల్తాన్ అంశం యావత్తు కర్ణాటకపైనా ప్రభావం చూపించదని, కోస్టల్ కర్ణాటకలో కొన్ని ప్రాంతాల్లో చాలా తక్కువ ప్రభావం ఉంటుందని చెప్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమలు చేస్తున్న అభివృద్ధి పథకాలు, ఆయన ప్రజాదరణపై దృష్టి పెట్టాలని అంటున్నారు. మోదీ దేశాన్ని అభివృద్ధి చేస్తున్నారని ప్రజలు నిజాయితీగా భావిస్తున్నందువల్ల కర్ణాటక ఓటర్లపై ఈ ప్రభావం ఉంటుందని చెప్తున్నారు.
కర్ణాటక బీజేపీ ఎంపీ ఒకరు మాట్లాడుతూ, కటీల్ వ్యూహం వల్ల తమ పార్టీకి కొన్ని నియోజకవర్గాల్లో ప్రయోజనం కలుగుతుందన్నారు. అయితే దీనినే ప్రధాన ప్రచార వ్యూహం చేయకూడదన్నారు. కన్నడ హీరోలకు వ్యతిరేకంగా టిప్పును చూపించడం తెలివైన సూత్రమని చెప్పారు.
కర్ణాటక శాసన సభ ఎన్నికలు మే నెలలోగా జరగవచ్చు. బీజేపీ, కాంగ్రెస్ ఇప్పటికే ప్రజలను ఆకట్టుకునేందుకు చురుగ్గా ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్రంలో పర్యటిస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
Tamil Nadu : సైనికుడి హత్య కేసులో డీఎంకే కౌన్సిలర్ అరెస్ట్
Karnataka : చెవిలో పువ్వులు పెట్టుకొని అసెంబ్లీకి వచ్చిన సిద్ధరామయ్య... కారణం ఇదే...