AIADMK: కేంద్ర మంత్రివర్గంలోకి అన్నాడీఎంకే?
ABN , First Publish Date - 2023-04-08T10:47:09+05:30 IST
కేంద్ర మంత్రివర్గంలో స్థానం కోసం ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకే(AIADMK) ప్రయత్నాలు ప్రారంభించింది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో
చెన్నై, (ఆంధ్రజ్యోతి): కేంద్ర మంత్రివర్గంలో స్థానం కోసం ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకే(AIADMK) ప్రయత్నాలు ప్రారంభించింది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తు కొనసాగుతుందని బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా(Union Home Minister Amit Shah) ఇటీవల ఢిల్లీలో ప్రకటించారు. ఆ ప్రకటన చేసిన మరుసటి రోజే అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి కూడా బీజేపీతో పొత్తుపదిలమని పేర్కొన్నారు. ఇక ఈ నెల 16న అన్నాడీఎంకే కార్యనిర్వాహక కమిటీ సమావేశం జరుగనున్న నేపథ్యంలో ఆ పార్టీ ఎంపీ తంబిదురై కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను, బీజేపీ జాతీయ కమిటీ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలుసుకోవడం చర్చలకు దారితీసింది. ఈ విషయమై పార్టీ సీనియర్ నాయకుడొకరు మాట్లాడుతూ... ఢిల్లీలోని బీజేపీ పెద్దలకు తన అభిప్రాయాలను తెలియజేసేందుకు పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి తరచూ ఎంపీ తంబిదురైని రాయబారిగా పంపుతుంటారని చెప్పారు. ఆ దిశగానే ఇటీవల పార్టీ ప్రధాన కార్యదర్శిగా తాను ఏకగ్రీవంగా ఎన్నికైన విషయాన్ని, పార్టీ అభివృద్ధి చెందుతున్న విషయాలను గురించి బీజేపీ జాతీయ నాయకులకు తెలియజేసేందుకు తంబిదురైని పంపినట్లు తెలిపారు. ఆ ప్రకారంమే తంబిదురై... అమిత్‌షా, జేపీ నడ్డా(Amit Shah, JP Nadda)లను కలుసుకున్నారని, ఆ సమయంలో కేంద్ర మంత్రివర్గంలో అన్నాడీఎంకేకి స్థానం కల్పించాలని కూడా తంబిదురై కోరారని చెప్పారు. అదే సమయంలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అన్నాడీఎంకేకి కనీసం పది నియోజకవర్గాలు కేటాయించాలన్న ఈపీఎస్ వినతిపై బీజేపీ అధినేత జేపీ నడ్డాకు తంబిదురై తెలిపారు. తమిళులు అధికంగా నివసిస్తున్న కేజీఎఫ్, బెంగళూరు, చామ్‌రాజ్‌నగర్ సహా పది నియోజకవర్గాలలో పోటీ చేసేందుకు అన్నాడీఎంకే సిద్ధంగా ఉందని కూడా తంబిదురై బీజేపీ జాతీయ నాయకులకు చెప్పారు. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ కూటమి తరఫున ప్రచారం చేసేందుకు ఈపీఎస్ సిద్ధంగా ఉన్నారని కూడా బీజేపీ అధిష్టానవర్గానికి సమాచారం అందించారు. ఈ పరిస్థితులలోనే కర్ణాటక(Karnataka) అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాక అన్నాడీఎంకేకి మంత్రి పదవిని కేటాయించాలని ఈపీఎస్ కోరుతున్నట్లు తెలుస్తోంది. ఒక వేళ వీలుపడకపోతే లోక్‌సభ ఎన్నికలు జరిగిన తర్వాతనైనా అన్నాడీఎంకేకు కేంద్ర మంత్రివర్గంలో కీలక శాఖలు కేటాయించాలని ఆయన ప్రతిపాదించినట్లు పార్టీ సీనియర్ నేత చెప్పారు. ఇక కేంద్ర మంత్రిపదవిని ఆశించే అన్నాడీఎంకే ఎంపీలలో తంబిదురై కూడా ఉన్నారని తెలుస్తోంది.