AIADMK: మన చలవతో నాలుగు సీట్లు సంపాదించుకుని మనపైనే విమర్శలా? తెగదెంపులు చేసుకుందాం..
ABN , First Publish Date - 2023-06-14T13:39:10+05:30 IST
దివంగత ముఖ్యమంత్రి జయలలిత పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annam
చెన్నై, (ఆంధ్రజ్యోతి): దివంగత ముఖ్యమంత్రి జయలలిత పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai)పై అన్నాడీఎంకే తీవ్రంగా మండిపడింది. జయ కీర్తి ప్రతిష్టలను కించపరిచేలా వ్యాఖ్యానించిన బీజేపీతో తెగదెంపులకైనా వెనకాడబోమని తెగేసి చెప్పింది. అన్నామలై ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాజీ ముఖ్యమంత్రి జయ హయాంలో అవినీతి అధికమైందని, అవినీతి కేసులోనే ఆమె అరెస్టయ్యారని ఆరోపించారు. దీంతో అన్నాడీఎంకే సీనియర్ నేతలు డి.జయకుమార్, సెల్లూరు కె.రాజు, సీవి షణ్ముగం అన్నామలైపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంగళవారం జరిగిన అన్నాడీఎంకే జిల్లా కార్యదర్శుల సమావేశంలోనే అన్నామలైపై పార్టీ నేతలంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీతో పొత్తు కొనసాగించకూడదని పట్టుబట్టారు. చివరకు అన్నామలై వ్యాఖ్యలను ఖండిస్తూ సమావేశంలో తీర్మానం చేశారు. మంగళవారం ఉదయం స్థానిక రాయపేటలోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయం ఎంజీఆర్ మాళిగైలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి(Edappadi Palaniswami) అధ్యక్షతన జిల్లా కార్యదర్శుల సమావేశం ప్రారంభమైంది. వచ్చే యేడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు ఈ సమావేశం ఏర్పాటైంది. కానీ సమావేశం ప్రారంభం కాగానే అన్నామలై తీరు పట్ల సీనియర్లంతా తీవ్రంగా స్పందించారు. బీజేపీతో తెగదెంపులు చేసుకోవాలని పట్టుబట్టారు. గంటకు పైగా పార్టీ సీనియర్ నేతలు అన్నామలై వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రసంగించారు. ఆ తర్వాత మెజారిటీ జిల్లా కార్యదర్శులు, సభ్యుల ప్రతిపాదన మేరకు అన్నామలైకి వ్యతిరేకంగా ఓ తీర్మానం చేసి ఏకగ్రీవంగా ఆమోదించారు.
ఆ వ్యాఖ్యలు దురుద్దేశపూరితం: ఈపీఎస్
కీర్తి ప్రతిష్టలను సంతరించుకున్న జయలలితను ఏ మాత్రం రాజకీయ అనుభవం, పరిణితి లేని అన్నామలై కేవలం దురుద్దేశపూర్వకంగా, బాధ్యతారహితంగా విమర్శించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఈపీఎస్ పేర్కొన్నారు. సమావేశ తీర్మానం అనంతరం ఈపీఎస్ మీడియాతో మాట్లాడుతూ... జయ కీర్తి ప్రతిష్టలను కళంకపరిచే విధంగా అన్నామలై వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారని, ఆయన వ్యాఖ్యలు తమ పార్టీ శ్రేణులకు తీవ్ర ఆగ్రహం కలిగించాయన్నారు. ‘‘బీజేపీ సీనియర్ నాయకులు వాజ్‌పేయి, ఆడ్వాణీ తదితర జాతీయ నాయకులు, ఇతర రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, నాయకులు జయపై ఆదరాభిమానాలను ప్రదర్శించేవారు. జాతీయ నాయకులకు దీటైన నాయకురాలిగా పేరుగడించిన జయ నివాసానికి పలువురు నేతలే వెళ్ళి ఆమెను మర్యాదపూర్వకంగా కలుసుకునేవారు. ప్రస్తుత ప్రధాని మోదీ కూడా ఆమెపై ఆదారాభిమానాలను ప్రదర్శించేవారు. చెన్నైలో జయ నివాసానికి మోదీ వెళ్ళి ఆమెను కలుసుకుని పలు రాజకీయాంశాలపై చర్చలు జరిపిన సందర్భాలున్నాయి. అంతేకాకుండా పొత్తు ద్వారా బీజేపీని రాష్ట్రానికి పరిచయం చేసంది కూడా ఆమే. 1998లో తొలిసారిగా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి జయ మద్దతిచ్చారు. అదేవిధంగా రాష్ట్రంలో 20 యేళ్లకు పైగా శాసనసభలో బీజేపీ సభ్యులెవరూ లేరు. ఆ పరిస్థితుల్లో అన్నాడీఎంకేతో పొత్తుపెట్టుకోవడం వల్లే ఆ పార్టీ నాలుగు సీట్లలో గెలిచింది. ఆ కారణంగానే నలుగురు బీజేపీ సభ్యులు శాసనసభలో అడుగుపెట్టగలిగారు. ఇవన్నీ విస్మరించి అపరిపక్వంగా, దురుద్దేశపూర్వకంగా జయపై వ్యాఖ్యలు చేసిన అన్నామలై తీరును ఖండిస్తున్నాం’’ అని ఈపీఎస్ పేర్కొన్నారు. బీజేపీతో పొత్తును కొనసాగించే విషయంపై పునః సమీక్ష జరపాలని పలువురు నేతలు ఈ సందర్భంగా ప్రతిపాదించారని, జయను కించపరిచిన బీజేపీతో తెగతెంపులు చేసుకోవాలని సీనియర్ నాయకులు కూడా పట్టుబట్టారని తెలిపారు.
కార్యకర్తల నిరసన ప్రదర్శన...
ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఈపీఎస్, ఇతర నాయకులు పార్టీ కార్యాలయానికి చేరుకోగానే కార్యకర్తలంతా ఈపీఎస్ వర్థిల్లాలి అంటూ నినాదాలు చేశారు. అదే సమయంలో మహిళా కార్యకర్తలు బీజేపీ నేత అన్నామలై, ఆ పార్టీకి చెందిన నటి ఖుష్బూకు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ సమావేశానికి ముందు పార్టీ కార్యాలయ ప్రాంగణం వద్ద అన్నాడీఎంకే సీనియర్ నేతలు మీడియాతో మాట్లాడుతూ అన్నామలైపై విరుచుకుపడ్డారు.
కట్టుబాట్లు లేని పార్టీ బీజేపీ: సెల్లూర్ కె రాజు
రాష్ట్ర బీజేపీ కట్టుబాట్లు లేని పార్టీ అని మాజీ మంత్రి సెల్లూర్ కె.రాజు పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆ పార్టీ అధ్యక్షుడు బొమ్మలాంటి వారని, ఆ బొమ్మను ఎప్పుడు ఎక్కడైనా పెట్టవచ్చని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. దేవుడే అడ్డుకున్నా జయను కించపరిచినవారిని వదలిపెట్టబోమన్నారు. సీనియర్ నేత ఓఎస్ మణియన్ మాట్లాడుతూ.... అన్నామలై నోటి దురుసుపై పార్టీ అధిష్ఠానం తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి పొల్లాచ్చి జయరామన్ మాట్లాడుతూ.. జయ నాయకత్వం గురించి, ఆమె కీర్తి ప్రతిష్టల గురించి ఎవరు విమర్శించినా చేతులు ముడుచుకుని కూర్చోబోమన్నారు.