AIADMK Vs NDA: ఎన్డీయేకు ఉద్వాసన చెప్పిన అన్నాడీఎంకే
ABN , First Publish Date - 2023-09-25T18:07:30+05:30 IST
అన్నాడీఎంకే సంచలన నిర్ణయం తీసుకుంది. భారతీయ జనతా పార్టీతోనూ, ఎన్డీయే తోనూ పొత్తును తెగతెంపులు చేసుకున్నట్టు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని తమ పార్టీ ఏకగ్రీవంగా ఆమోదించినట్టు అన్నాడీఎంకే డిప్యూటీ కోఆర్డినేటర్ కేపీ మునుసామి ప్రకటించారు.
చెన్నై: అన్నాడీఎంకే (AIADMK) సంచలన నిర్ణయం తీసుకుంది. భారతీయ జనతా పార్టీ (BJP)తోనూ, జాతీయ ప్రజాస్వామ్య కూటమి (NDA)తోనూ పొత్తును తెగతెంపులు చేసుకున్నట్టు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని తమ పార్టీ ఏకగ్రీవంగా ఆమోదించినట్టు అన్నాడీఎంకే డిప్యూటీ కోఆర్డినేటర్ కేపీ మునుసామి (KP Munusamy) ప్రకటించారు.
బీజేపీ రాష్ట్ర నాయకత్వంతో తలెత్తిన సమస్యలను మునుసామి ప్రస్తావిస్తూ, అన్నాడీఎంకే మాజీ నేతలపైన, తమ ప్రధాన కార్యదర్శి ఈపీఎస్ పైన, తమ పార్టీ కార్యకర్తలపైన ఏడాదిగా బీజేపీ అనుచిత వ్యాఖ్యలు చేస్తోందన్నారు. అటు బీజేపీతోనూ, ఇటు ఎన్డీయేతోనూ అన్నిరకాల పొత్తులకు ఉద్వాసన చెప్పాలని అన్నాడీఎంకే నిర్ణయం తీసుకోవడానికి ఇదొక కారణమని చెప్పారు. పొత్తులకు ఉద్వాసన చెబుతూ అన్నాడీఎంకే ఏకగ్రీవంగా తీర్మానాన్ని సోమవారంనాడు ఆమోదించినట్టు తెలిపారు. తక్షణం ఈ నిర్ణయం అమల్లోకి వచ్చినట్టు చెప్పారు. కాగా, బీజేపీతోనూ, ఎన్డీయేతోనూ అన్నాడీఎంకే తెగతెంపులు చేసుకున్నట్టు ప్రకటించగానే ఆ పార్టీ కార్యకర్తలు చెన్నైలో బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.