Air India : అర్థాంతరంగా రష్యాలో దిగిన ఎయిరిండియా విమానం.. సహాయక విమానం కోసం ప్రయాణికుల ఎదురు చూపులు..
ABN , First Publish Date - 2023-06-07T12:08:22+05:30 IST
న్యూఢిల్లీ నుంచి అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో బయల్దేరిన విమానం మంగళవారం అర్థాంతరంగా రష్యాలోని మగడాన్ విమానాశ్రయంలో దిగింది.
న్యూఢిల్లీ : న్యూఢిల్లీ నుంచి అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో బయల్దేరిన విమానం మంగళవారం అర్థాంతరంగా రష్యాలోని మగడాన్ విమానాశ్రయంలో దిగింది. ఈ విమాన ప్రయాణికులను శాన్ ఫ్రాన్సిస్కో చేర్చేందుకు సహాయక విమానం బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు ముంబై నుంచి బయల్దేరుతుందని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
న్యూఢిల్లీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకు మంగళవారం బయల్దేరిన విమానం ఇంజిన్‌లో సాంకేతిక లోపం కనిపించడంతో అర్థాంతరంగా రష్యాలోని మగడాన్ విమానాశ్రయంలో దిగింది. దీనిలో 216 మంది ప్రయాణికులు, 16 మంది సిబ్బంది ఉన్నారు. వీరంతా ఇబ్బందులుపడుతూ, మరొక విమానం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ప్రయాణికుల కోసం వెళ్లవలసిన సహాయక విమానం బయల్దేరడంలో జాప్యం జరుగుతోంది. దీనికి కారణం రెగ్యులేటరీ సమస్యలేనని ఎయిరిండియా అధికారులు చెప్తున్నారు. ఈ సమస్యలను పరిష్కరించిన తర్వాత బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు ముంబై నుంచి విమానం బయల్దేరుతుందని చెప్తున్నారు.
రష్యా రాజధాని నగరం మాస్కో నుంచి దాదాపు 10 వేల కిలోమీటర్ల దూరంలో మగడాన్ విమానాశ్రయం ఉంది. ఇక్కడ హోటల్ సదుపాయాలు తగిన స్థాయిలో లేకపోవడంతో ప్రయాణికులను డార్మిటరీల్లో ఉంచారు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో, విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా ఈ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారని తెలిపింది. ఎయిరిండియాతో నిరంతరం సంప్రదిస్తున్నట్లు తెలిపింది. ఎయిరిండియా B777-200LR VT-ALF విమానాన్ని మగడాన్ విమానాశ్రయానికి పంపిస్తున్నట్లు తెలిపింది. మగడాన్‌లో చిక్కుకున్న ప్రయాణికులను, సామాగ్రిని ఈ విమానంలో శాన్ ఫ్రాన్సిస్కోకు తీసుకెళ్లనున్నట్లు పేర్కొంది. ప్రయాణికులకు సదుపాయాలు కల్పిస్తున్నట్లు, స్థానిక ప్రభుత్వం కూడా సహకరిస్తున్నట్లు ఎయిరిండియా తెలిపిందని వివరించింది. విమానాశ్రయానికి సమీపంలోని ఓ పాఠశాలలో ప్రయాణికులకు వసతి సదుపాయం కల్పించినట్లు తెలిపిందని పేర్కొంది. ఈ ప్రయాణికులకు భోజనం, ఇతర అవసరాల కోసం ఇండియన్ ఎంబసీని సంప్రదించినట్లు తెలిపింది.
ఇదిలావుండగా, అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ డిప్యూటీ అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ స్పందిస్తూ, న్యూఢిల్లీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో బయల్దేరిన విమానం అత్యవసరంగా రష్యాలోని మగడాన్ విమానాశ్రయంలో దిగినట్లు తమకు తెలుసునని చెప్పారు. పరిస్థితిని తాము నిరంతరం పరిశీలిస్తున్నామని చెప్పారు. అమెరికా పౌరులు ఎందరు ఉన్నారో తాను చెప్పలేనని తెలిపారు.
ఇవి కూడా చదవండి :
Odisha Train Accident : డబ్బు కోసం ఇంత దారుణమా? ఒడిశా రైలు ప్రమాద మృతుల శవాలతో మోసాలు!
Wrestlers : రెజ్లర్లను చర్చలకు పిలిచిన కేంద్ర ప్రభుత్వం