AirAsia flight: విమానాన్ని ఢీకొట్టిన పక్షి.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
ABN , First Publish Date - 2023-01-29T16:09:03+05:30 IST
పక్షి ఢీకొట్టడంతో ఎయిర్ ఏషియా (Air Asia) విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) రాజధాని లక్నో
న్యూఢిల్లీ: పక్షి ఢీకొట్టడంతో ఎయిర్ ఏషియా (Air Asia) విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) రాజధాని లక్నో(Lucknow)లో జరిగిందీ ఘటన. లక్నోలో బయలుదేరిన ఎయిర్ ఏషియా విమానం ‘ఐ5-319’ కోల్‌కతా(Kolkata) వెళ్లాల్సి ఉంది. టేకాఫ్ అయిన కాసేపటికే విమానాన్ని పక్షి ఢీకొట్టింది. దీంతో విమానాన్ని వెనక్కి మళ్లించి లక్నోలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. అనంతరం విమానాన్ని తనిఖీల కోసం పంపారు. విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని, ఎవరికీ ఎలాంటి ప్రమాదమూ లేదని అధికారులు తెలిపారు.
ఇలాంటి ఘటనే ఈ నెల 18న జరిగింది. సింగపూర్ నుంచి ముంబై వస్తున్న విస్తారా విమానం (Vistara Flight) ‘ఎయిర్‌బస్ ఎ321’(Airbus A321)లో సాంకేతిక సమస్యలు ఏర్పడడంతో విమానాన్ని వెనక్కి మళ్లించి చాంగి ఎయిర్‌పోర్టులో ల్యాండ్ చేశారు.
అలాగే, గతేడాది అహ్మదాబాద్ నుంచి న్యూఢిల్లీ వెళ్తున్న ఆకాశ ఎయిర్(Akasa Air) విమానాన్ని పక్షి ఢీకొనడంతో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఈ ‘బోయింగ్ 737 మ్యాక్స్ 8’ విమానం 1900 అడుగుల ఎత్తులో ఉండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పక్షి ఢీకొనడంతో రాడోమ్ ధ్వంసమైంది.