Sharad Pawar: అతనికి ముఖ్యమంత్రి అవ్వాలన్న కల.. ఎప్పటికీ ఒక కలగానే మిగిలిపోతుంది
ABN , First Publish Date - 2023-10-12T21:31:21+05:30 IST
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్ తన మేనల్లుడు, ఎన్‌సీపీ తిరుగబాటు నాయకుడు అజిత్ పవార్‌కు తాజాగా చురకలంటించారు. తాను ముఖ్యమంత్రి అవ్వాలన్న...
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్ తన మేనల్లుడు, ఎన్‌సీపీ తిరుగబాటు నాయకుడు అజిత్ పవార్‌కు తాజాగా చురకలంటించారు. తాను ముఖ్యమంత్రి అవ్వాలన్న కల ఎప్పటికీ ఒక కలగానే మిగిలిపోతుందని.. అతనెప్పుడూ సీఎం కాలేడని కుండబద్దలు కొట్టారు. ఎన్‌సీపీని విచ్ఛిన్నం చేసి, శివసేన-బీజేపీ ప్రభుత్వంలో చేరిన తర్వాత ఉపముఖ్యమంత్రి పదవి వరించిన అజిత్ పవార్‌కు త్వరలోనే రాష్ట్రంలో అత్యున్నత పదవి (సీఎం) దక్కుతుందని మహారాష్ట్రలో ఊహాగానాలు ఊపందుకున్నాయి. దీనిపై మీ స్పందన ఏంటని శరద్ పవార్‌ని మీడియా ప్రశ్నించగా.. అజిత్‌కు అంత సినిమా లేదని ఆయన తేల్చేశారు. అజిత్ పవార్ ముఖ్యమంత్రి అవుతాడన్నది ఎప్పటికీ డ్రీమ్‌గా మిగిలిపోతుందని చెప్పుకొచ్చారు.
దేశంలోని 70 శాతం రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ (బిజెపి) పాలన లేదని, మహారాష్ట్రలో కూడా బీజేపీ అధికారం కోల్పోతుందని శరద్ పవార్ అన్నారు. 2024 ఎన్నికల తర్వాత మహారాష్ట్రలో శివసేన (యూబీటీ), ఎన్‌సీపీ (శరద్ పవార్ గ్రూపు), కాంగ్రెస్‌ల ‘మహా వికాస్ అఘాడీ’ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇతర రాజకీయ పార్టీలను విచ్ఛిన్నం చేయడం ద్వారా కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిందని.. అయితే 70 శాతం రాష్ట్రాల్లో ఆ పార్టీ అధికారంలో లేదని అన్నారు.
ఇదే సమయంలో వంచిత్ బహుజన్ అఘాడీ నాయకుడు ప్రకాష్ అంబేద్కర్ ప్రతిపక్షాల ఇండియా కూటమిలో చేరడంపై మంచి పరిణామమని, ఈ విషయంలో తాను సానుకూలంగా ఉన్నానని చెప్పారు. బీజేపీ నుంచి పక్కన పెట్టారని చెబుతున్న బీజేపీ నాయకురాలు పంకజా ముండే సొంతంగా పార్టీని ఏర్పాటు చేసుకుంటే.. దానికి మంచి స్పందన వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.