G20 Summit : చైనాకు చెక్ పెట్టేందుకు భారత్, అమెరికా, సౌదీ అరేబియా కీలక నిర్ణయం?
ABN , First Publish Date - 2023-09-08T11:41:16+05:30 IST
చైనా తలపెట్టిన బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టు సాకారమయ్యే అవకాశాలు లేని నేపథ్యంలో రైలు మార్గాలు, నౌకాశ్రయాల అభివృద్ధి కోసం ఈ మూడు దేశాలు మరికొన్ని దేశాలతో చేతులు కలపబోతున్నట్లు తెలుస్తోంది.
వాషింగ్టన్ : జీ20 సదస్సు సందర్భంగా భారత్, అమెరికా, సౌదీ అరేబియా కీలక ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. చైనా తలపెట్టిన బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టు సాకారమయ్యే అవకాశాలు లేని నేపథ్యంలో రైలు మార్గాలు, నౌకాశ్రయాల అభివృద్ధి కోసం ఈ మూడు దేశాలు మరికొన్ని దేశాలతో చేతులు కలపబోతున్నట్లు తెలుస్తోంది.
గల్ఫ్ దేశాలు, దక్షిణాసియా దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత పటిష్టమయ్యేందుకు దోహదపడే ఒప్పందాలు కుదరబోతున్నట్లు అమెరికన్ అధికారులను ఉటంకిస్తూ ఓ వార్తా సంస్థ వెల్లడించింది. ఇండియా, ఇజ్రాయెల్, అమెరికా, యూఏఈ (I2U2) వేదికలో గత 18 నెలల నుంచి జరుగుతున్న చర్చల్లో ఈ ఒప్పందాలకు ఓ రూపం వచ్చినట్లు తెలుస్తోంది. భారత దేశానికి భారీ ప్రాజెక్టుల నిర్మాణంలో ఉన్న అనుభవాన్ని ఉపయోగించుకుంటూ, ఈ ప్రాంతాన్ని రైల్వేల ద్వారా అనుసంధానం చేయాలనే ప్రతిపాదన చేసిన దేశాల్లో ఇజ్రాయెల్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ శుక్రవారం న్యూఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో చర్చలు జరుపుతారు. బైడెన్ సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్‌తో కూడా చర్చించే అవకాశం ఉంది.
మధ్య ప్రాచ్య దేశాల్లో చైనా ప్రభావం పెరుగుతుండటంతో, చైనాకు చెక్ పేట్టేందుకు అమెరికా ఈ వ్యూహాన్ని సిద్ధం చేసినట్లు సమాచారం. జీ20 దేశాల్లో పెట్టుబడులకు ప్రత్యామ్నాయ భాగస్వామిగా అమెరికాను నిలిపేందుకు బైడెన్ కృషి చేస్తున్నారు. ముఖ్యంగా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా పలుకుబడికి అడ్డుకట్ట వేయడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నారు. చైనా తలపెట్టిన బెల్ట్ అండ్ రోడ్ గ్లోబల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుకు దీటుగా ఉండేలా రైల్వే మార్గాలు, నౌకాశ్రయాల నిర్మాణం ప్రాజెక్టును రూపొందిస్తున్నారు. ఈ కల సాకారమైతే నౌకాయానానికి పట్టే సమయం తగ్గుతుంది. ఖర్చులు తగ్గుతాయి. డీజిల్ ఆదా అవుతుంది. వ్యాపారం వేగవంతమవుతుంది, ధరలు కూడా తగ్గుతాయి.
ఇవి కూడా చదవండి :
నగరంలో.. నాలుగు ప్రాంతాల్లో వినాయక విగ్రహాల నిమజ్జనం
Sanatana Dharmam : సనాతన ధర్మంపై యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు