America : అమెరికా గగనతలంలో మరో గుర్తు తెలియని వస్తువు... బైడెన్ ఆదేశాలతో కూల్చివేత...
ABN , First Publish Date - 2023-02-11T13:18:32+05:30 IST
అమెరికాలోని అలాస్కా గగనతలంలో ఎగురుతున్న గుర్తు తెలియని వస్తువును శుక్రవారం కూల్చేశారు. ఇది ఓ చిన్న కారు
వాషింగ్టన్ : అమెరికాలోని అలాస్కా గగనతలంలో ఎగురుతున్న గుర్తు తెలియని వస్తువును శుక్రవారం కూల్చేశారు. ఇది ఓ చిన్న కారు పరిమాణంలో ఉంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఆదేశాల మేరకు దీనిని కూల్చేశారు. గత శనివారం అట్లాంటిక్‌పై ఎగురుతున్న చైనా గూఢచర్య బుడగ (Spy Balloon)ను కూల్చేసిన సంగతి తెలిసిందే. ఈ బుడగ కన్నా ఈ వస్తువు పరిమాణం తక్కువ.
శుక్రవారం కూల్చేసిన వస్తువు అలాస్కా గగనతలంలో దాదాపు 40 వేల అడుగుల ఎత్తులో ఎగురుతూ ఉండేది. ఈ ప్రాంతంలో జనాభా సుమారు 300 మంది ఉంటారు. ఈ గగనతలంలో ప్రయాణించే విమానాల భద్రతకు ఇది ముప్పుగా పరిణమించింది. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో అంతుబట్టడం లేదు. ఇది మానవ రహిత వస్తువు అని వైట్ హౌస్ అధికార ప్రతినిధి జాన్ కిర్బీ చెప్పారు. గత వారం పేల్చేసిన బెలూన్ కన్నా ఇది చిన్న పరిమాణంలో ఉందని తెలిపారు.
అలాస్కాలోని జాయింట్ బేస్ ఎల్మెండోర్ఫ్-రిచర్డ్‌సన్‌లో ఉన్న ఎఫ్-22 యుద్ధ విమానం AIM-9X షార్ట్ రేంజ్ గగనతలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే క్షిపణిని ప్రయోగించి ఈ వస్తువును కూల్చేసింది. దీంతో ఇది ముక్కలు చెక్కలు అయింది.
గూఢచర్య బుడగ కూల్చివేతతో అమెరికా, చైనా మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. చైనా నిఘా కార్యక్రమంలో భాగమే ఈ బుడగ అని అమెరికా (America) ఆరోపిస్తోంది. అమెరికా హద్దులు మీరిందని చైనా (China) దుయ్యబడుతోంది. దీని పర్యవసానాలు తప్పకుండా ఉంటాయని హెచ్చరిస్తోంది.
స్థానిక కాలమానం ప్రకారం గురువారం రాత్రి 9 గంటలకు అమెరికన్ రాడార్ ఈ వస్తువును గుర్తించింది. ఇది గంటకు 10 నుంచి 20 మైళ్ళ వేగంతో ప్రయాణించింది. దీనిని కూల్చేసే ముందు అలాస్కాలోని బుల్లెన్ పాయింట్ గగనతలంలో 26 చదరపు కిలోమీటర్ల పరిధిలో విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించారు.
ఈ వస్తువు గురించి తనకు చెప్పారని, దీనిని కూల్చేసేందుకు మద్దతిచ్చామని కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రుడు శుక్రవారం ఓ ట్వీట్‌లో తెలిపారు.