Amit Shah : పంజాబ్‌లోని ఆప్ ప్రభుత్వంపై అమిత్ షా ప్రశంసలు

ABN , First Publish Date - 2023-04-22T14:38:29+05:30 IST

ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలోని పంజాబ్ ప్రభుత్వంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Union home minister Amit Shah) ప్రశంసలు కురిపించారు.

Amit Shah : పంజాబ్‌లోని ఆప్ ప్రభుత్వంపై అమిత్ షా ప్రశంసలు
Amritpal Singh, Amit Shah

న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలోని పంజాబ్ ప్రభుత్వంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Union home minister Amit Shah) ప్రశంసలు కురిపించారు. ఖలిస్థాన్ సానుభూతిపరుడు, వారిస్ పంజాబ్ డే చీఫ్ అమృత్‌పాల్ సింగ్ (Amritpal Singh)పైనా, ఆ సంస్థపైనా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నందుకు ప్రశంసించారు. ఇటీవలే అస్సాం ముఖ్యమంత్రి, బీజేపీ నేత హిమంత బిశ్వ శర్మ (Himanta Biswa Sarma) కూడా ఇదే విషయంలో పంజాబ్ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత భగవంత్ మాన్ (Bhagwant Mann)ను ప్రశంసించిన సంగతి తెలిసిందే.

‘ఇండియా టుడే’ నిర్వహించిన కర్ణాటక రౌండ్‌టేబుల్, 2023లో శనివారం అమిత్ షా మాట్లాడుతూ, అమృత్‌పాల్ సింగ్‌పైనా, ఆయన నడుపుతున్న సంస్థపైనా పంజాబ్ (Punjab) ప్రభుత్వం చేపడుతున్న చర్యల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఆ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తోందన్నారు. పంజాబ్‌లో ఖలిస్థానీ భావాల ప్రభావం లేదన్నారు. పరిస్థితిని తాము చాలా నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపారు. భారత దేశ ఐక్యత, సార్వభౌమాధికారాలపై ఎవరూ దాడి చేయలేరన్నారు. పాల్ అరెస్ట్‌ ఎప్పుడో ఒకప్పుడు జరగవచ్చునని చెప్పారు. గతంలో ఆయన స్వేచ్ఛగా సంచరించగలిగేవాడని, ఇప్పుడు తన కార్యకలాపాలను నిర్వహించలేకపోతున్నాడని చెప్పారు.

ఇండియన్ హై కమిషన్ కార్యాలయాలపై దాడులు జరిగితే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం (Narendra Modi government) సహించబోదని చెప్పారు. భారత దేశానికి వ్యతిరేకంగా విదేశీ గడ్డపై నుంచి కుట్ర జరిగినపుడు దర్యాప్తు చేసే సమర్థత ఎన్‌ఐఏకు ఉందని, ఆ సంస్థను ఆ స్థాయిలో అభివృద్ధి చేశామని చెప్పారు. లండన్‌లోని ఇండియన్ హై కమిషన్ కార్యాలయంపై జరిగిన దాడిపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారని, దర్యాప్తును ప్రారంభించారని చెప్పారు. ఇండియన్ హై కమిషన్ నుంచి కూడా నివేదిక వచ్చిందన్నారు. దీని ఆధారంగా ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను ఎన్ఐఏకు అప్పగించినట్లు తెలిపారు.

పంజాబ్ ప్రభుత్వం మార్చి 18 నుంచి అమృత్‌పాల్‌పైనా, ఆయన నడుపుతున్న సంస్థ సభ్యులపైనా పెద్ద ఎత్తున విరుచుకుపడుతోంది. ఆయనకు సన్నిహితంగా వ్యవహరించేవారిలో చాలా మందిని అరెస్ట్ చేసింది. ఆయన భార్య కిరణ్‌దీప్ కౌర్‌ లండన్ వెళ్లేందుకు ప్రయత్నించినపుడు గురువారం అమృత్‌సర్ విమానాశ్రయంలో పంజాబ్ పోలీసులు నిలిపేశారు.

లండన్‌లోని ఇండియన్ హై కమిషన్ కార్యాలయంపై మార్చి 19న ఖలిస్థాన్ మద్దతుదారులు దాడి చేసిన సంగతి తెలిసిందే. అమృత్‌పాల్ సింగ్ పోస్టర్లతో వీరంతా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆయనను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి :

Mamata Banerjee : ప్రాణ త్యాగానికైనా సిద్ధం.. ఈద్ సందర్భంగా మమత బెనర్జీ..

Eid prayers : ముస్లిం సోదరులకు మోదీ ఈద్ శుభాకాంక్షలు

Updated Date - 2023-04-22T14:38:29+05:30 IST