Amit Shah, Sasikala: అమిత్ షాతో శశికళ భేటీ అయ్యారా.. అసలు వీరిమధ్య జరిగిన ఒప్పందం ఏంటో..

ABN , First Publish Date - 2023-05-14T08:10:56+05:30 IST

తమ పార్టీలో నెలకొన్న విభేదాలను సమసిపోయేలా చేసి, తామంతా కలిసి ఉండేందుకు సహకరించాలని అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి వీకే శశికళ(VK Sasikala) బీజేపీ అగ్రనేత

Amit Shah, Sasikala: అమిత్ షాతో శశికళ భేటీ అయ్యారా.. అసలు వీరిమధ్య జరిగిన ఒప్పందం ఏంటో..

చెన్నై, (ఆంధ్రజ్యోతి): తమ పార్టీలో నెలకొన్న విభేదాలను సమసిపోయేలా చేసి, తామంతా కలిసి ఉండేందుకు సహకరించాలని అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి వీకే శశికళ(VK Sasikala) బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా(Amit Shah)ను వేడుకున్నారా?.. పార్టీ పగ్గాలు ఎవరిచేతిలో ఉన్నా తనకు అభ్యంతరం లేదని, కానీ తామంతా కలిసి సాగేలా సహకరించాలని ఆయన్ని అభ్యర్థించారా?.. ఇందుకు వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి తాము అన్ని విధాలా సహకరిస్తామని ఆయనకు నచ్చచెప్పారా?.. అవుననే అంటున్నాయి అత్యంత విశ్వసనీయ వర్గాలు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం కోసం ఇటీవల బెంగుళూరు వచ్చిన అమిత్‌షాతో గంటకు పైగా శశికళ భేటీ అయినట్లు తెలుస్తోంది. తామంతా కలిసి పోరాటం చేస్తేనే తప్ప ఇప్పట్లో డీఎంకే(DMK)ను ఎదుర్కోలేమని, అందువల్ల తామందరం కలిసి ఉండేందుకు సహకరించాలని, తద్వారా బీజేపీకి కూడా లాభమేనని శశికళ వివరించినట్లు సమాచారం. ఆమె మాటల్ని ఆద్యంతం ఆలకించిన అమిత్‌షా.. ఆమె అభ్యర్థన పట్ల సానుకూలంగా స్పందించారని తెలిసింది.

పట్టుకోసం...

పార్టీపై పట్టు కోసం సాగిన వారసత్వ పోరులో మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి (Edappadi Palaniswami)దే పైచేయి అయిన విషయం తెలిసిందే. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఆయన్ని కేంద్ర ఎన్నికల కమిషన్‌ సైతం గుర్తించింది. దీంతో మునుముందు ఏదేని అద్భుతం జరిగితే తప్ప, పార్టీ పగ్గాలు ఆయన నుంచి తప్పించడం అసాధ్యమని తేలిపోయింది. పరిస్థితి గ్రహించడం వల్లే మరో మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం (ఓపీఎస్‌) తన కంటే ముందే పార్టీ నుంచి బహిష్కృతులైన శశికళ, టీటీవీ దినకరన్‌తో చేతులు కలిపేందుకు సిద్ధమయ్యారు. ఈ ముగ్గురి మధ్య జరిగిన ముందస్తు అవగాహన మేరకు ఇప్పటికే ఓపీఎస్‌- దినకరన్‌తో భేటీ కావడంతో పాటు త్వరలోనే శశికళతోనూ సమావేశం కానున్నట్లు ప్రకటించారు. పార్టీ నేతల నుంచి తనకు మద్దతు కొరవడడం, తన వెంట వచ్చేవారెవ్వరూ లేకపోవడం, ఇటీవల తిరుచ్చిలో జరిగిన ఓపీఎస్‌ సభకు కార్యకర్తల నుంచి ఆదరణ కరువవ్వడంతో అసలు విషయం గ్రహించిన ఆయన.. శశికళ బృందంతో చేతులు కలిపేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. అయితే అమిత్‌షాతో శశికళ భేటీ అయిన తరువాతే ఓపీఎస్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అటు నుంచి శశికళకు సానుకూల సంకేతాలు రావడం వల్లనే ఓపీఎస్‌.. తన వైఖరి మార్చుకున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

ఈపీఎస్‌ అంగీకరిస్తారా?

జయ మరణానంతరం జరిగిన పరిణామాల్లో ముఖ్యమంత్రి పదవి పోగొట్టుకుని, ఆనక శశికళపై ధర్మయుద్ధం ప్రకటించిన ఓపీఎస్‌.. పార్టీకి దూరమవడంతో శశికళ ఆశీస్సులతో ముఖ్యమంత్రి పీఠం దక్కించుకున్న ఈపీఎస్‌.. ఆనక ఆమెను, ఆమె అనుచరగణాన్ని పార్టీ నుంచి గెంటేసిన విషయం తెలిసిందే. అయితే జైలు నుంచే శశికళ బృందం చేసిన రాయబారాన్ని సైతం ఆయన నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. తను బలోపేతం అయ్యేందుకు ఓపీఎ్‌సను చేరదీసిన ఈపీఎస్‌.. ఆనక అదే కారణం కోసం ఆయన్ని పార్టీ నుంచి బహిష్కరించారు. అంతేగాక శశికళ, దినకరన్‌, ఓపీఎస్‏లను ఎన్నటికీ అన్నాడీఎంకేలోకి మళ్లీ చేర్చుకునే ప్రసక్తే లేదని ఇప్పటికే పలుమార్లు బహిరంగంగానూ ప్రకటించారు. అలాంటిది ఇప్పుడు శశికళ అండ్‌ కో చేరికను ఆయన సమ్మతిస్తారా? ఒకవేళ ఆయన అందుకు అంగీకరిస్తే పార్టీలో శశికళ, ఓపీఎ్‌సలకు ఎలాంటి పదవులిస్తారు? అన్న శంక ఆయన సన్నిహితుల్లో రేగుతోంది. కానీ ప్రస్తుతం విడివిడిగా పని చేస్తున్న నేతలు తమ అధిష్ఠానం సూచనలతో మళ్లీ కలిసి పని చేసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని బీజేపీకి చెందిన ఓ సీనియర్‌ నేత వ్యాఖ్యానించారు. అన్నాడీఎంకేలో ఏదైనా జరగవచ్చని, గతాన్ని పరిశీలిస్తే ఇది స్పష్టమవుతుందని ఆయన వివరించారు. అయితే ఈపీఎస్‌, ఓపీఎస్‌, శశికళ, దినకరన్‌ కలిస్తే మాత్రం డీఎంకేను దీటుగా ఎదుర్కోగలదని తమ అధిష్ఠానం గట్టిగా తలపోస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అందువల్లే అన్నాడీఎంకేలో మునుముందు ఏమైనా జరగవచ్చని ఆయన వ్యాఖ్యానించారు. వచ్చే ఏడాది జరుగనున్న లోక్‌సభ ఎన్నికల్లోపే ఆ మార్పులుంటాయని ఆయన విశ్లేషించారు. పార్గీ పగ్గాలు తనకు ఇవ్వకపోయినా పార్టీలో క్రియాశీలక పదవి ఇస్తే చాలని శశికళ, ఓపీఎస్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ వారు అదేమాటకు కట్టుబడి ఉంటే ఈపీఎస్‌ నుంచి పెద్దగా అభ్యంతరం ఉండబోదని బీజేపీ నేతలు భావిస్తున్నారు. నిజానికి అన్నాడీఎంకే(AIADMK)లోని పలువురు సీనియర్ల లోటుపాట్లు శశికళకు మాత్రమే బాగా తెలుసు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత సహచర్యంలో ఉన్న ఆమె.. తమ పార్టీ నేతల బలాలు-బలహీనతల్ని బాగా తెలుసుకున్నారు. అందువల్లే ఇప్పటికీ పలువురు సీనియర్లు శశికళపై విమర్శలు చేసేందుకు తటపటాయిస్తున్నారు. వీరందరినీ ఏకతాటిపైకి తీసుకురాగిలిన శక్తి-యుక్తి ఆమె వద్ద వున్నాయని బీజేపీ నేతలు కూడా భావిస్తున్నట్లు తెలుస్తోంది. తన పదవికి ఎలాంటి ఢోకా ఉండబోదని తెలిస్తే ఈపీఎస్‌ కూడా శశికళ బృందం చేరికకు అభ్యంతరం చెప్పకపోవచ్చని వారు అంచనా వేస్తున్నారు. అందుకే ఈపీఎ్‌సకు నచ్చచెప్పే వ్యవహారంపై శశికళకు అమిత్‌షా నుంచి సానుకూలత వ్యక్తమైందని సమాచారం. అయితే అది ఎలాంటి సానుకూలత? .. ఆయన ఎలా వ్యవహరించబోతున్నారు?.. అమిత్‌షా సూచనల్ని ఈపీఎస్‌ అనుసరిస్తారా? లేక ధిక్కరిస్తారా?.. అమిత్‌షా సూచనల్ని ఆచరిస్తే అన్నాడీఎంకేలో కలిగే మార్పులేంటి?.. ధిక్కరిస్తే సంభవించే పరిణామాలేంటి? అనే ఉత్కంఠ రాజకీయవర్గాల్లో నెలకొంది.

Updated Date - 2023-05-14T08:10:56+05:30 IST