APJ Abdul Kalam : అబ్దుల్ కలాం కలలు మోదీతో సాకారం : అమిత్ షా
ABN , First Publish Date - 2023-07-29T16:14:26+05:30 IST
మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం కన్న కలలు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నూతన ఆవిష్కరణల ద్వారా సాకారమవుతాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. మోదీ నాయకత్వంలో మన విద్యార్థులు, వారి స్టార్టప్ కంపెనీల కోసం అంతరిక్ష శాస్త్రం (space science)లో అనేక అవకాశాలు వస్తున్నాయన్నారు. ఈ రంగంలో మన దేశం యావత్తు ప్రపంచానికి నాయకత్వం వహిస్తుందని తెలిపారు.
చెన్నై : మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం (APJ Abdul Kalam) కన్న కలలు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) నూతన ఆవిష్కరణల ద్వారా సాకారమవుతాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. మోదీ నాయకత్వంలో మన విద్యార్థులు, వారి స్టార్టప్ కంపెనీల కోసం అంతరిక్ష శాస్త్రం (space science)లో అనేక అవకాశాలు వస్తున్నాయన్నారు. ఈ రంగంలో మన దేశం యావత్తు ప్రపంచానికి నాయకత్వం వహిస్తుందని తెలిపారు. దివంగత అబ్దుల్ కలాంకు నివాళిగా రాసిన పుస్తకం ‘‘మెమరీస్ నెవర్ డై’’ని శనివారం అమిత్ షా తమిళనాడులోని రామేశ్వరంలో ఆవిష్కరించారు.
రెండు రోజుల పర్యటన నిమిత్తం అమిత్ షా తమిళనాడు వచ్చారు. శుక్రవారం ఆయన తమిళనాడు బీజేపీ చీఫ్ కే అణ్ణామలై నిర్వహిస్తున్న ‘‘నా భూమి, నా ప్రజలు’’ పాదయాత్రను ప్రారంభించారు. శనివారం ఆయన రామనాథ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ‘‘మెమరీస్ నెవర్ డై’’ని ఏపీజేఎం నసీమా మరైకయార్, సైంటిస్ట్ వైఎస్ రాజన్ సంయుక్తంగా రాశారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నవారిలో కే అణ్ణామలై, కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ ఉన్నారు.
అబ్దుల్ కలాం రాసిన ‘‘ఇండియా 2020 : విజన్ ఫర్ ది న్యూ మిల్లీనియం’’లోని కొన్ని భాగాలను అమిత్ షా (Amit Shah) ఈ సందర్భంగా ప్రస్తావించారు. దేశ అభివృద్ధికి మార్గసూచిని కలాం ఈ పుస్తకంలో వివరించారని చెప్పారు. భారత దేశం తన సత్తాను గుర్తించాలని, టెక్నాలజీ ఆధారిత ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయాలని, వ్యవసాయం-పారిశ్రామిక రంగం-నగరాలు-పల్లెల మధ్య సమతుల్య వృద్ధి సాధించాలని చెప్పారన్నారు.
అబ్దుల్ కలాం రామేశ్వరంలో నివసించిన ఇంటిని కూడా అమిత్ షా సందర్శించారు. రామేశ్వరం దేవాలయంలో అభిషేకం చేయడం, హారతిలో పాల్గొనడం తన అదృష్టమని ట్వీట్ చేశారు. ద్వాదశ (12) జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఈ దేవాలయంలో శ్రీరాముడు మహాశివుడిని అర్చించినట్లు తెలిపారు. సనాతన ధర్మపు ప్రాచీనతకు సాక్ష్యంగా ఈ దేవాలయం నిలుస్తుందని చెప్పారు. ప్రజలు, దేశం సుభిక్షంగా ఉండాలని మహాశివుడిని తాను ప్రార్థించానని తెలిపారు.
ఇవి కూడా చదవండి :
Manipur : మణిపూర్ బయల్దేరిన ప్రతిపక్ష ఇండియా కూటమి ఎంపీలు
Bharat Jodo Yatra : ఆ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టితో మరోసారి రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’