Anti-conversion laws : ‘మత మార్పిడి నిరోధక చట్టాలు దుర్వినియోగమయ్యే అవకాశం’
ABN , First Publish Date - 2023-05-01T16:40:44+05:30 IST
మత మార్పిడి నిరోధక చట్టాలు మైనారిటీలకు వ్యతిరేకంగా దుర్వినియోగమయ్యే అవకాశం ఉందని తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది.
న్యూఢిల్లీ : మత మార్పిడి నిరోధక చట్టాలు మైనారిటీలకు వ్యతిరేకంగా దుర్వినియోగమయ్యే అవకాశం ఉందని తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. మతాన్ని ఎంపిక చేసుకునేందుకు ప్రజలకు అవకాశం ఇవ్వాలని, వ్యక్తిగత విశ్వాసాలు, గోప్యతలకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టించడం సరికాదని తెలిపింది. చట్ట వ్యతిరేక పద్ధతులను అవలంబించని పక్షంలో, మిషనరీలు క్రైస్తవాన్ని వ్యాపింపజేయడం చట్టవిరుద్ధం కాదని పేర్కొంది.
అడ్వకేట్ అశ్విని ఉపాధ్యాయ్ (Advocate Ashwini Upadhyay) దాఖలు చేసిన పిటిషన్‌లో, మోసపూరితంగా మత మార్పిడులకు పాల్పడటం రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనని ప్రకటించాలని సుప్రీంకోర్టును కోరారు. బెదిరింపులతో, మోసం, బహుమతులు, ఆర్థిక ప్రయోజనాలను ఆశ చూపుతూ, ప్రలోభాలకు గురి చేయడం ద్వారా వ్యక్తుల మతం మార్చడం ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనని ప్రకటించాలని కోరారు. ఇటువంటి మత మార్పిడులను అడ్డుకునేందుకు తగిన కఠినమైన చట్టాలను చేయాలని కేంద్ర, రాష్ట్రాలను ఆదేశించాలని కూడా కోరారు. తమిళనాడులో లావణ్య అనే మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకుందని, ఆమె చదువుతున్న క్రైస్తవ సంస్థ ఆమెను మతం మారమని బలవంతం చేయడమే దీనికి కారణమని తెలుస్తోందని తెలిపారు.
దీనిపై స్పందిస్తూ డీఎంకే నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. చట్ట వ్యతిరేక పద్ధతులకు పాల్పడకుండా మిషనరీలు క్రైస్తవాన్ని వ్యాపింపజేయడం చట్టవిరుద్ధం కాదని తెలిపింది. తమ రాష్ట్రంలో బలవంతపు మత మార్పిడులు, బెదిరించడం ద్వారా మతం మార్చడం వంటి సంఘటనలు జరగలేదని తెలిపింది. వేరొకరిని తన మతంలోకి మార్చే అధికారం ఏ వ్యక్తికీ రాజ్యాంగం ఇవ్వలేదని, అయితే తమ మతాన్ని ప్రచారం చేసుకునేందుకు అవకాశం ఇచ్చిందని చెప్పింది. శాంతియుతంగా మతాన్ని వ్యాపింపజేసుకోవడానికి, విశ్వాసాలను మార్చడానికి అవకాశం ఇచ్చిందని పేర్కొంది.
మత మార్పిడి నిరోధక చట్టాలు మైనారిటీలకు వ్యతిరేకంగా దుర్వినియోగమయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపింది. తమ మతాన్ని ఎన్నుకునే అవకాశాన్ని ప్రజలకు కల్పించాలని తెలిపింది. వ్యక్తిగత విశ్వాసాలు, గోప్యతలకు ప్రభుత్వం అడ్డు తగలడం సరికాదని పేర్కొంది. అంతరాత్మ స్వేచ్ఛ, వృత్తిని స్వేచ్ఛగా నిర్వహించుకోవడం, మతాన్ని ఆచరించడానికి, ప్రచారం చేయడానికి ప్రజలకు హక్కు ఉందని, ఈ హక్కును అధికరణ 25 పరిరక్షిస్తోందని తెలిపింది. ఏదైనా వర్గం యొక్క మతం లేదా మత సంబంధిత విశ్వాసాలను ఉద్దేశపూర్వకంగా, ద్వేషంతో అవమానించడం ద్వారా వారి మతపరమైన భావాలను దెబ్బతీసేందుకు ప్రయత్నించేవారిపై చర్యలు తీసుకోవలసిన బాధ్యత రాజ్యానికి ఉందని తెలిపింది.
పిటిషనర్ ప్రస్తావించిన లావణ్య ఆత్మహత్యకు కారణంపై సీబీఐ దర్యాప్తు చేస్తోందని తెలిపింది. రాష్ట్ర పోలీసుల దర్యాప్తులో ఆమె మరణానికి కారణం ఆమెను మతం మారాలని నిర్బంధించడమేనని చెప్పడానికి తగిన ఆధారాలు లభించలేదని తెలిపింది.
ఇవి కూడా చదవండి :
LPG cylinder prices : భారీగా తగ్గిన వంటగ్యాస్ ధరలు
Karnataka Polls : రైతులకు సున్నా వడ్డీకే రుణాలు.. పేదలకు ఉచితంగా మూడు వంట గ్యాస్ సిలిండర్లు..