Aravind Kejriwal: బీజేపీపై నిప్పులు చెరిగిన కేజ్రీవాల్.. దానికి ఇండియా కూటమినే ప్రత్యామ్నాయం
ABN , First Publish Date - 2023-10-23T22:33:11+05:30 IST
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి బీజేపీపై ధ్వజమెత్తారు. దేశ పురోగతికి కేంద్రంలోని బీజేపీ ఒక్క పని కూడా చేయలేదని ఆరోపించిన ఆయన.. ఇప్పుడు ఆ పార్టీకి ఇండియా కూటమి ప్రత్యామ్నాయంగా..
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి బీజేపీపై ధ్వజమెత్తారు. దేశ పురోగతికి కేంద్రంలోని బీజేపీ ఒక్క పని కూడా చేయలేదని ఆరోపించిన ఆయన.. ఇప్పుడు ఆ పార్టీకి ఇండియా కూటమి ప్రత్యామ్నాయంగా ఉందని తెలిపారు. ప్రస్తుతం దేశం మూడు సమస్యల్ని ఎదుర్కుంటోందని, అందుకు కేంద్రం వద్ద ఎలాంటి సమాధానం లేదని చురకలంటించారు. దేశం అభివృద్ధి చెందాలంటే.. బీజేపీని తరిమికొట్టాల్సిందేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
అక్టోబర్ 23వ తేదీన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ‘‘ఇంతకుముందు ఎలాంటి ఆప్షన్ లేదని చెప్పేవారు. కానీ.. ఇప్పుడు బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఇండియా కూటమిని ప్రజలందరూ ఆప్షన్‌గా చూస్తున్నారు. ఒకవేళ ఇండియా కూటమి గట్టిగా నిలబడితే, 2024 ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడదని నాకు చాలా మెసేజ్‌లు వచ్చాయి. ప్రస్తుతం మన దేశం ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, అవినీతి అనే మూడు సమస్యలను ఎదుర్కుంటోంది. అయితే.. వీటికి కేంద్ర ప్రభుత్వం వద్ద ఎలాంటి సమాధానం లేదు. దేశం అభివృద్ధి చెందాలన్నా, కుటుంబ శ్రేయస్సు కావాలన్నా.. ఈసారి బీజేపీని తరిమికొట్టాలని ప్రతి ఇంటికి వెళ్లి మీ (కార్యకర్తల్ని ఉద్దేశిస్తూ) స్నేహతులు, బంధువులకు ఈసారి బీజేపీని తరిమికొట్టాలని చెప్పండి’’ అని చెప్పుకొచ్చారు.
ఇదే సమయంలో.. అంధ భక్తులైన బీజేపీ కార్యకర్తలతో ఏమాత్రం జోక్యం చేసుకోవద్దని కేజ్రీవాల్ ప్రజలను సూచించారు. అంధ భక్తులతో మమేకం కావొద్దని, కేవలం దేశ భక్తులతోనే మాట్లాడండని, దేశభక్తులు ఎవరైనా మీ మాట వింటారని అన్నారు. అంధ భక్తుడికి దేశంలో సంబంధం లేదని, అతడు కేవలం ఒక వ్యక్తిని మాత్రమే ప్రేమిస్తాడంటూ చురకలంటించారు. అంధ భక్తుడు, దేశభక్తుడు ఎవరో రెండు నిమిషాల్లో తెలుసుకోవచ్చన్నారు. అంధు భక్తుడు దేశభక్తుడు కాలేడని, దేశ భక్తులు అంధ భక్తుడు కాలేడని తెలిపారు. ఇద్దరివి వేర్వేరు జాతులని.. కాబట్టి అంధ భక్తులతో అస్సలు గొడవ పడకండని కేజ్రీవాల్ సలహా ఇచ్చారు.