Delhi : ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్న యమునా నది.. ఇండియా గేట్‌కు వరద ముప్పు?..

ABN , First Publish Date - 2023-07-13T15:48:16+05:30 IST

యమునా నది ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో ఢిల్లీ నగరానికి వరద ముప్పు తీవ్రమవుతోంది. ఐటీఓ, ఎర్ర కోట, ఢిల్లీ సచివాలయం ఇప్పటికే జలమయమయ్యాయి. మరికాసేపట్లోనే ఇండియా గేట్ కూడా వరద నీటితో నిండిపోతుందని అంచనా వేస్తున్నారు.

Delhi : ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్న యమునా నది.. ఇండియా గేట్‌కు వరద ముప్పు?..

న్యూఢిల్లీ : యమునా నది ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో ఢిల్లీ నగరానికి వరద ముప్పు తీవ్రమవుతోంది. ఐటీఓ, ఎర్ర కోట, ఢిల్లీ సచివాలయం ఇప్పటికే జలమయమయ్యాయి. మరికాసేపట్లోనే ఇండియా గేట్ కూడా వరద నీటితో నిండిపోతుందని అంచనా వేస్తున్నారు. యమునా నది ఒడ్డు నుంచి కేవలం దాదాపు 4 కిలోమీటర్ల దూరంలో, వరద నీటిలో చిక్కుకున్న రింగ్ రోడ్డుకు సమీపంలో ఇండియా గేట్ ఉంది. ఈ నేపథ్యంలో నగరంలోని పాఠశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. అత్యవసరమైతేనే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలని ఆదేశించింది.

ఢిల్లీ నగరంలో వర్షాలు అతిగా కురవలేదు, కానీ హిమాచల్ ప్రదేశ్ నుంచి వరద నీరు యమునా నదిలోకి వస్తోంది. దీంతో ఈ నదిలో నీటి మట్టం గురువారం గత కాలపు రికార్డులను అధిగమించి, ప్రమాద స్థాయిని దాటి 208.48 మీటర్లకు పెరిగింది. 45 ఏళ్ళ క్రితం 207.49 మీటర్ల నీటి మట్టం నమోదైంది.

ఢిల్లీ సచివాలయంలోని ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఆయన కేబినెట్ సహచరుల కార్యాలయాలు నీట మునిగాయి. రాజ్‌ఘాట్ నుంచి సచివాలయం వరకు ఉన్న రోడ్డు కూడా మునిగింది. ఇండియా గేట్ పరిసరాల్లోకి వరద నీరు చేరడంతో ప్రభుత్వ కార్యాలయాల్లో కార్యకలాపాలకు ఆటంకాలు ఏర్పడ్డాయి. అదేవిధంగా ట్రాఫిక్ జామ్‌లు ఇబ్బందిపెడుతున్నాయి. ప్రధాన మంత్రి కార్యాలయం, రాష్ట్రపతి నివాసం, హోం, ఆర్థిక, రక్షణ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖల కార్యాలయాలు కూడా ఈ ప్రాంతంలోనే ఉన్నాయి.

ఇండియా గేట్ పక్కనే ఉన్న కర్తవ్యపథ్‌కు సమీపంలోనే రైల్ భవన్, ఉద్యోగ్ భవన్, శాస్త్రి భవన్, కృషి భవన్ ఉన్నాయి. యమునా నది పరిసరాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హర్యానాలోని హత్నికుండ్ బ్యారేజ్ నుంచి మరింత నీటిని విడుదల చేసే అవకాశం ఉండటంతో పార్లమెంటు, సుప్రీంకోర్టు, ఇండియా గేట్ మునిగిపోయే అవకాశం కనిపిస్తోంది.

యమునా నది పైన రెండు ప్రధాన ఆనకట్టలు ఉన్నాయి. డెహ్రాడూన్‌లోని డక్‌పథర్, యమునా నగర్‌లోని హత్నికుండ్‌లలో ఈ ఆనకట్టలు ఉన్నాయి. వర్షాకాలంలో కురిసే వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవడానికి వీలుండటం లేదు. అత్యధిక నీరు వరద రూపంలో ఢిల్లీ నగరంలోకి వస్తోంది. సెంట్రల్ వాటర్ కమిషన్ అధికారి ఒకరు మాట్లాడుతూ, హత్నికుండ్ నుంచి నీరు గతం కన్నా చాలా వేగంగా ఢిల్లీకి చేరుకుందన్నారు. దీనికి ప్రధాన కారణం దురాక్రమణలేనని చెప్పారు. గతంలో నీరు వెళ్ళడానికి ఎక్కువ స్థలం ఉండేదని, ఇప్పుడు చిన్న చిన్న స్థలాల్లో పారుతోందని చెప్పారు.

ఇవి కూడా చదవండి :

Floods : యమునా నదిలో వరద ఉద్ధృతి.. కేజ్రీవాల్ నివాసం వద్ద బీభత్సం..

Haryana : ఎమ్మెల్యే చెంప పగులగొట్టిన వరద బాధితురాలు

Updated Date - 2023-07-13T15:48:16+05:30 IST