Karnataka : బంగ్లాదేశీయుల రాకతో మన సంస్కృతికి ముప్పు : హిమంత బిశ్వ శర్మ
ABN , First Publish Date - 2023-03-17T10:15:26+05:30 IST
బంగ్లాదేశ్ నుంచి ఈశాన్య రాష్ట్రాలకు వస్తున్నవారి వల్ల మన సంస్కృతి, నాగరికతలకు ముప్పు కలుగుతోందని అస్సాం ముఖ్యమంత్రి హిమంత
బెంగళూరు : బంగ్లాదేశ్ నుంచి ఈశాన్య రాష్ట్రాలకు వస్తున్నవారి వల్ల మన సంస్కృతి, నాగరికతలకు ముప్పు కలుగుతోందని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ (Assam chief minister Himanta Biswa Sarma) చెప్పారు. అస్సాంలో ఇప్పటి వరకు 600 మదరసాలను మూసివేయించామని, అన్ని మదరసాలను మూసేయించాలని తాను ఆలోచిస్తున్నానని చెప్పారు. మనకు కావలసినది మదరసాలు కాదని, మనకు పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు కావాలని అన్నారు. శాసన సభ ఎన్నికలకు సిద్ధమవుతున్న కర్ణాటకలోని బెళగావిలో జరిగిన బహిరంగ సభలో హిమంత బిశ్వ శర్మ మాట్లాడారు.
అస్సాం జీహాదీ కార్యకలాపాలకు అడ్డాగా ఉండేదని, ఐదు జీహాదీ మాడ్యూల్స్ పట్టుబడ్డాయని చెప్పారు. ఈ సంస్థలకు అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థకు, బంగ్లాదేశ్‌లోని ఉగ్రవాద సంస్థలకు అనుబంధం ఉందన్నారు. బంగ్లాదేశ్‌లోని ఉగ్రవాద సంస్థ ఏబీటీకి చెందిన ఆరుగురు చట్టవిరుద్ధంగా 2016, 2017లలో భారత దేశంలో ప్రవేశించినట్లు నిఘా వర్గాలు సమాచారం ఇచ్చాయని తెలిపారు. జీహాదీ భావజాలం, సిద్ధాంతాలవైపు స్థానిక యువతను ఆకర్షించి, టెర్రర్ మాడ్యూల్స్, స్లీపర్ సెల్స్‌ను ఏర్పాటు చేయడం కోసం వీరు వచ్చారని తెలిపినట్లు చెప్పారు.
బాబర్, ఔరంగజేబు, షాజహాన్ వంటి మొఘలు చక్రవర్తుల చరిత్ర మాత్రమే భారత దేశ చరిత్ర అనేవిధంగా కాంగ్రెస్ పార్టీ చూపించిందని చెప్పారు. ఇప్పుడు ఆ పార్టీ నూతన మొఘలులకు ప్రాతినిధ్యంవహిస్తోందన్నారు. ఒకానొకప్పుడు ఢిల్లీ పాలకులు దేవాలయాలను కూల్చివేయడం గురించి మాట్లాడేవారని, నేడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పరిపాలనలో తాను దేవాలయాల నిర్మాణం గురించి మాట్లాడుతున్నానని చెప్పారు. ఇది నవ భారతమని తెలిపారు. ఈ నవ భారతాన్ని బలహీనపరచడం కోసం కాంగ్రెస్ కృషి చేస్తోందని చెప్పారు. నేడు కాంగ్రెస్ నూతన మొఘలులకు ప్రాతినిధ్యం వహిస్తోందన్నారు. భారత దేశ చరిత్ర అంటే బాబర్, ఔరంగజేబు, షాజహాన్ గురించి కాదని, ఛత్రపతి శివాజీ మహారాజు, గురు గోబింద్ సింగ్ చరిత్ర అని వివరించారు. ఔరంగజేబు పాలనలో సనాతన సంస్కృతిని తుదముట్టించేందుకు ప్రయత్నించారని, అనేక మందిని బలవంతంగా ఇస్లాంలోకి మార్చారని చెప్పారు.
ఇవి కూడా చదవండి :
weddings: భర్తలతో పాటు భార్యలకు కూడా తప్పడం లేదు..
Lakshmi Devi: ఇంట్లో డబ్బుకు లోటుండకూడదంటే.. ఇలా చేయండి.