Ayodhya Ram Mandir: ఉగ్రదాడి ముప్పు.. రామాలయం చుట్టూ భద్రత?
ABN , First Publish Date - 2023-11-10T16:48:25+05:30 IST
అయోధ్యలోని రామాలయం చుట్టూ భద్రతను సాయుధ బలగాలు మరింత కట్టుదిట్టం చేస్తున్నాయి. ఉగ్రదాడి ముప్పు ఉండవచ్చనే సమాచారంతో సాయుధ బలగాలు అప్రమత్తమయ్యాయి.
న్యూఢిల్లీ: అయోధ్యలోని రామాలయం(Ayodhya Ram Mandir) చుట్టూ భద్రతను సాయుధ బలగాలు మరింత కట్టుదిట్టం చేస్తున్నాయి. ఉగ్రదాడి ముప్పు ఉండవచ్చనే సమాచారంతో సాయుధ బలగాలు అప్రమత్తమయ్యాయి. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న భవ్య రామాలయంపై పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న అల్-ఖైదా (Al-Qaeda), లష్కరే తొయిబా (Lashkare Toiba) ఉగ్రవాద సంస్థలు భారీ దాడి జరిపే అవకాశం ఉందని భద్రతా ఏజెన్సీలకు సమాచారం అందినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అడ్వయిజరీని కూడా త్వరలోనే విడుదల చేయనున్నారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
అయోధ్య రామ మందిర ప్రారంభ మహోత్సవానికి హాజరు కావాలని ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ట్రస్టు సభ్యులు ఆహ్వానం అందించారు. ట్రస్టు సభ్యుల ఆహ్వానాన్ని అంగీకరించిన మోదీ 2024 జనవరి 22న రామాలయంలో జరిదే ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి హాజరవుతారని తెలుస్తోంది. జనవరి 14 మకర సంక్రాతి తర్వాత రామ్‌లల్లా ప్రతిష్ఠాపన ప్రక్రియ ప్రారంభించి 10 రోజుల పాటు కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆలయ ట్రస్టు నిర్ణయించింది. ఆలయ గ్రౌండ్ ఫ్లోర్ పనులు డిసెంబర్ చివరికల్లా పూర్తికానున్నాయి. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి 2020 ఆగస్టు 5న మోదీ గతంలో శంకుస్థాపన చేశారు.