Ayodhya Ramalayam : అయోధ్య రామాలయం నిర్మాణంలో కీలక ఘట్టం
ABN , First Publish Date - 2023-04-07T10:32:57+05:30 IST
అయోధ్య రామాలయం నిర్మాణంలో అత్యంత ముఖ్యమైన నిర్ణయం కోసం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్
న్యూఢిల్లీ : అయోధ్య రామాలయం నిర్మాణంలో అత్యంత ముఖ్యమైన నిర్ణయం కోసం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ (Shri Ram Janmabhoomi Teerth Kshetra Trust) శనివారం న్యూఢిల్లీలో సమావేశం కాబోతోంది. గర్భ గుడిలో ప్రతిష్ఠించే శ్రీరాముని విగ్రహాన్ని తీర్చిదిద్దేందుకు తగిన అత్యుత్తమమైన శిలను ఎంపిక చేయడం కోసం ఏర్పాటు చేసిన శిల్పుల కమిటీ నివేదికలను ఈ సమావేశంలో పరిశీలించి, ఓ శిలను ఎంపిక చేస్తుంది.
కర్ణాటక నుంచి తీసుకొచ్చిన ఐదు శిలలు, రాజస్థాన్ నుంచి తీసుకొచ్చిన నాలుగు శిలలు, ఒడిశా నుంచి తీసుకొచ్చిన ఒక శిల, నేపాల్ నుంచి తీసుకొచ్చిన రెండు శిలలు పరిశీలనలో ఉన్నాయి. వీటిలో ఒకదానిని శ్రీరాముని విగ్రహాన్ని తీర్చిదిద్దేందుకు ఎంపిక చేస్తారు. నేపాల్ మాజీ ఉప ప్రధాన మంత్రి బిమలేంద్ర నిధి కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. ఆయన నేపాల్ నుంచి అయోధ్యకు శిలలను పంపించడానికి విశేషంగా కృషి చేశారు.
శ్రీరాముని విగ్రహాన్ని మలచడానికి తగిన శిల కోసం ఈ ట్రస్టు 2020 నుంచి అన్వేషిస్తోంది. తీవ్ర సమాలోచనల తర్వాత నేపాల్‌లోని గండకీ నది పరీవాహక ప్రాంతంలోని ముక్తినాథ్ ప్రాంతం నుంచి శిలను తీసుకురావాలని నిర్ణయించింది. శ్రీరాముని బాల్యాన్ని గుర్తు చేసే విధంగా ఓ చిన్న విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
ఒడిశాకు చెందిన సుదర్శన్ సాహు, వాసుదేవ్ కామత్; కర్ణాటకకు చెందిన కేవీ మనియా, పుణే ప్రాంతానికి చెందిన శస్త్రయజ్య దెవుల్కర్ శ్రీరాముని విగ్రహ నమూనాలను పంపించారు. శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ వీటిలో ఒకదానిని ఎంపిక చేస్తుంది.
ఈ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపిన వివరాల ప్రకారం, శ్రీరాముని విగ్రహం ఎత్తు 8.5 అడుగులు ఉంటుంది. సూర్య కిరణాలు పడటానికి అనువుగా దీనిని ఏర్పాటు చేస్తారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గతంలో చెప్పిన వివరాల ప్రకారం అయోధ్య రామాలయం 2024 జనవరి 1 నుంచి భక్తులకు అందుబాటులోకి వస్తుంది.
ఇవి కూడా చదవండి :
ఎన్నికల వేళ.. బీజేపీకి షాకిచ్చిన యువనేత
CNG, PNG Price : కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. గ్యాస్ ధరలు దాదాపు 11 శాతం తగ్గుదల..