Share News

Bharat Jodo Yatra 2.0: రెండో విడత భారత్ జోడో యాత్ర ఎప్పుడు మొదలవుతోందంటే..?

ABN , First Publish Date - 2023-11-07T15:33:28+05:30 IST

కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ రాహుల్ గాంధీ గత ఏడాది చేపట్టిన తొలివిడత భారత్ జోడో యాత్ర విజయవంతం కావడం కాంగ్రెస్ పార్టీలో నూతనోత్సాహాన్ని నింపింది. ఇదే ఉత్సాహంతో ''భారత్ జోడో యాత్ర రెండో దశ''కు ఆ పార్టీ సన్నాహాలు చేస్తోంది. ఈ ఏడాది డిసెంబర్, వచ్చే ఏడాది ఫిబ్రవరి మధ్యలో ''భారత్ జోడో యాత్ర 2.0'' మొదలయ్యే అవకాశం ఉంది.

Bharat Jodo Yatra 2.0: రెండో విడత భారత్ జోడో యాత్ర ఎప్పుడు మొదలవుతోందంటే..?

న్యూఢిల్లీ: కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ రాహుల్ గాంధీ (Rahul Gandhi) గత ఏడాది చేపట్టిన తొలివిడత భారత్ జోడో యాత్ర (Bharat Jodi Yatra) విజయవంతం కావడం కాంగ్రెస్ పార్టీలో నూతనోత్సాహాన్ని నింపింది. ఇదే ఉత్సాహంతో ''భారత్ జోడో యాత్ర రెండో దశ''కు ఆ పార్టీ ముమ్మర సన్నాహాలు చేస్తోంది. ఈ ఏడాది డిసెంబర్, వచ్చే ఏడాది ఫిబ్రవరి మధ్యలో ''భారత్ జోడో యాత్ర 2.0'' మొదలయ్యే అవకాశం ఉంది.


రాహుల్ గాంధీ గత ఏడాది సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారిలో భారత్ జోడో యాత్రను ప్రారంభించి 2023 జనవరి 30న కశ్మీర్‌లో ముగించారు. 4,081 కిలోమీటర్ల మేర 12 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాలు, 75 జిల్లాలు, 76 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఈ యాత్ర సాగింది. కాంగ్రెస్ పార్టీకి భారత్ జోడో యాత్ర కొత్త ఊపిరిలిచ్చింది. దీంతో 'భారత్ జోడో యాత్ర 2.0'కు ఆలోచన చేస్తున్నట్టు ఆ పార్టీ ఇటీవల ప్రకటించింది. ఈసారి ఈస్ట్ నుంచి వెస్ట్ వరకూ భారత్ జోడో యాత్ర నిర్వహించాలని ఇటీవల పునర్వవస్థీకరించిన సీడబ్ల్యూసీ తొలి సమావేశం కోరింది. ఈ విషయాన్ని పరిశీలిస్తున్నట్టు పార్టీ సీనియర్ నేత పి.చిదంబరం తెలిపారు.


రాహుల్ గాంధీ సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన తొలివిడత 'భారత్ జోడో యాత్ర'లో ఆయన 12 బహిరంగ సమావేశాల్లో, 100కు పైగా వీధి సమావేశాల్లో, 13 ప్రెస్ కాన్ఫరెన్స్‌లలో పాల్గొన్నారు. ఆయా ప్రాంతాల్లో విపక్ష పార్టీలకు చెందిన పలువురు ప్రముఖులు భారత్ జోడో యాత్రలో రాహుల్‌తో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ అగ్రనేతలు ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ, శివసేన ఆదిత్య థాకరే, ప్రియాంక చతుర్వేది, సంజయ్ రౌత్, ఎన్‌సీపీ నేత సుప్రియా సూలే తదితరులు రాహుల్ యాత్రలో ఉత్సాహాన్ని నింపారు.

Updated Date - 2023-11-07T16:31:06+05:30 IST