Bharat Jodo Yatra : కర్ణాటకలో 51 నియోజకవర్గాల్లో భారత్ జోడో యాత్ర.. కాంగ్రెస్ ఎన్ని గెలిచిందంటే..
ABN , First Publish Date - 2023-05-13T16:49:02+05:30 IST
కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. బీజేపీ 64 స్థానాలతో చతికిలపడింది. కాంగ్రెస్ విజయంలో భారత్ జోడో యాత్ర
న్యూఢిల్లీ : కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. బీజేపీ 64 స్థానాలతో చతికిలపడింది. కాంగ్రెస్ విజయంలో భారత్ జోడో యాత్ర (Bhaat Jodo Yatra) ప్రభావం గురించి చాలా మంది ఆలోచిస్తున్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Congress leader Rahul Gandhi) నిర్వహించిన భారత్ జోడో యాత్ర కర్ణాటకలోని 51 నియోజకవర్గాల్లో జరిగింది. వీటిలో 36 స్థానాల్లో కాంగ్రెస్ విజయం/ఆధిక్యత కనబరచింది.
భారత్ జోడో యాత్ర గత ఏడాది సెప్టెంబరు 7న తమిళనాడులోని కన్యాకుమారి నుంచి ప్రారంభమైంది. ఇది కర్ణాటకలో సెప్టెంబరు 30న ప్రవేశించింది. అక్టోబరు 23 వరకు కర్ణాటకలో రాహుల్ గాంధీ పాదయాత్ర చేశారు. చామరాజ నగర్, మైసూరు, మాండ్య, తుమకూర్, చిత్రదుర్గ, బళ్లారి, రాయ్‌చూరు జిల్లాల్లో ఆయన పర్యటించారు. ఆయనతోపాటు అనేక మంది కాంగ్రెస్ నేతలు కూడా పాదయాత్ర చేశారు. మొత్తం మీద 51 శాసన సభ నియోజకవర్గాల్లో ఆయన పాదయాత్ర జరిగింది. వీటిలో 36 స్థానాల్లో కాంగ్రెస్ విజయం/ఆధిక్యత సాధించింది.
ఈ ఎన్నికల కోసం కాంగ్రెస్ ఐదు ముఖ్యమైన హామీలను ఇచ్చింది. గృహజ్యోతి పథకం క్రింద అన్ని ఇళ్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, గృహ లక్ష్మి పథకం క్రింద కుటుంబ యజమానురాలికి నెలకు రూ.2,000 ఆర్థిక సాయం, అన్న భాగ్య పథకం క్రింద దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న ప్రతి వ్యక్తికి ఉచితంగా నెలకు 10 కేజీల బియ్యం, యువ నిధి పథకం క్రింద 18-25 ఏళ్ల మధ్య వయస్కులైన నిరుద్యోగ గ్రాడ్యుయేట్ యువతకు నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతి, నిరుద్యోగ డిప్లమో యువతకు నెలకు రూ.1,500 చెల్లింపు, శక్తి పథకం క్రింద ప్రజా రవాణా బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామని హామీ ఇచ్చింది. అధికారం చేపడితే మొదటి కేబినెట్ సమావేశంలోనే వీటికి అప్రూవల్ స్టాంపు ఇస్తామని ప్రకటించింది.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంపై ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందిస్తూ, ఇది ప్రజల విజయమని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ దుష్ట పాలనకు వ్యతిరేకంగా ఆగ్రహంతో ప్రజలు ఓట్లు వేశారన్నారు.
ఇదిలావుండగా, గెలిచిన ఎమ్మెల్యేలంతా శనివారం సాయంత్రానికి బెంగళూరు రావాలని కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశించింది. ప్రభుత్వ ఏర్పాటు కోసం ప్రయత్నాలు ప్రారంభమవుతాయని తెలిపింది.
సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ, నరేంద్ర మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా పర్యటనల వల్ల కర్ణాటక ఓటర్లపై ఎటువంటి ప్రభావం పడలేదన్నారు. వచ్చే సంవత్సరం జరిగే లోక్‌సభ ఎన్నికలకు ఈ విజయం ఓ సోపానమని చెప్పారు. ప్రధాన మంత్రి అభ్యర్థిగా రాహుల్ గాంధీని ఎంపిక చేసుకుని ప్రతిపక్షాలు ఐకమత్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నట్లు సంకేతాలు పంపిన డీకే శివ కుమార్ ఎన్నికల ఫలితాల పట్ల హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తన నాయకత్వంపట్ల నమ్మకం ఉంచిన గాంధీ కుటుంబం వల్లే ఈ గెలుపు సాధ్యమైందన్నారు.
ఇవి కూడా చదవండి :
JDS KumaraSwamy: కుమారస్వామి గెలిచారు కానీ కొడుకును గెలిపించుకోలేకపోయారు.. అమ్మ త్యాగం వృధా..!
DK Shivakumar: భావోద్వేగంతో కంటతడి పెట్టిన డీకే