Bhumana: తిరుమల నడక భక్తులకు విడిది కేంద్రాలు
ABN , First Publish Date - 2023-09-29T10:57:20+05:30 IST
చెన్నై, కాట్పాడి మార్గాల నుంచి తిరుమలకు వచ్చే కాలినడక భక్తులకు మార్గమధ్యలో విడిదిగృహాల నిర్మాణానికి తగిన చర్యలు తీసుకుంటామని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి(TTD Chairman Bhumana Karunakara Reddy) ప్రకటించారు.
- టీటీడీ చైర్మన్ కరుణాకరరెడ్డి
- ఎల్‌ఏసీ అధ్యక్షుడిగా ఏజే శేఖర్ ప్రమాణస్వీకారం
చెన్నై, (ఆంధ్రజ్యోతి): చెన్నై, కాట్పాడి మార్గాల నుంచి తిరుమలకు వచ్చే కాలినడక భక్తులకు మార్గమధ్యలో విడిదిగృహాల నిర్మాణానికి తగిన చర్యలు తీసుకుంటామని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి(TTD Chairman Bhumana Karunakara Reddy) ప్రకటించారు. గతంలో తాను మొదటిసారి టీటీడీ చైర్మన్‌గా వున్నప్పుడే దీనిపై నిర్ణయం తీసుకున్నామని, అయితే కారణాంతరాల వల్ల ఆగిపోయిన ఈ నిర్మాణాలను ఇప్పుడు చేపడతామని వివరించారు. టీటీడీ తమిళనాడు, పుదుచ్చేరి స్థానిక సలహామండలి (ఎల్‌ఏసీ) చైర్మన్‌గా ఇటీవల నియమితులైన ఏజే శేఖర్ టి.నగర్‌లోని టీటీడీ సమాచార కేంద్రం వెంకటేశ్వరస్వామి సన్నిధిలో గురువారం ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కరుణాకర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. దానగుణం, స్వామి పట్ల అచంచలమైన భక్తి విశ్వాసాలున్న శేఖర్‌రెడ్డి టీటీడీ ఎల్‌ఏసీ చైర్మన్‌గా నియమితులవ్వడం సంతోషకరమన్నారు. అలిపిరి పాదాల చెంత గోమాతకు పూజ చేశాకే శ్రీవారి వద్దకు వెళ్లాలనే సంప్రదాయానికి శ్రీకారం చుట్టిన వ్యక్తి శేఖర్ అని ప్రశంసించారు. తిరుమల నడకదారిలో లక్షిత అనే బాలికను చిరుత చంపిన వ్యవహారంపై మాట్లాడుతూ.. అటవీ అధికారులు ఇప్పటికే ఆరు చిరుతల్ని పట్టుకోవడం జరిగిందన్నారు. నడిచివచ్చే భక్తుల భద్రతే ప్రధాన కర్తవ్యంగా చర్యలు చేపట్టామన్నారు. నడకదారిలో వచ్చే భక్తులకు సాయుధ బలగాలను రక్షణగా పంపడంతో పాటు వారిలో ఆత్మవిశ్వాసం పెంచేందుకు చేతికర్ర కూడా ఇస్తున్నామన్నారు. సలహా మండలి సభ్యులను త్వరలోనే ప్రకటిస్తామని కరుణాకరరెడ్డి స్పష్టం చేశారు.
భక్తులకు మెరుగైన సదుపాయాల కల్పనే ధ్యేయం: శేఖర్
భక్తులకు మెరుగైన సదుపాయాల కల్పనే ధ్యేయంగా పని చేస్తానని ఏజే శేఖర్ ప్రకటించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 3వ సారి ఎల్‌ఏసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడం సంతోషంగా వుందన్నారు. ఈ అవకాశం ఇచ్చిన ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి, టీటీడీ చైర్మన్ కరుణాకర్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. తాను గతంలో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక ఇక్కడ ఆలయంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. అదే విధంగా భక్తుల సుదీర్ఘస్వప్నమైన తాయారు ఆలయాన్ని నగరంలో నిర్మించామన్నారు. ప్రస్తుతం శ్రీవారి ఆలయమున్న స్థలం పక్కనే ఐదున్నర గ్రౌండ్ల స్థలాన్ని తీసుకుంటున్నామని, ఇందుకోసం టీటీడీ ప్రవేశపెట్టిన ‘భూదానం’ పథకం కింద రూ.19 కోట్లు సేకరించామన్నారు. ఇందులో ఇప్పటికే మూడున్నర గ్రౌండ్ల భూమిని సేకరించామని, మిగిలిన దానిని త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. వచ్చే ఆరు నెలల్లో నూతన ఆలయానికి భూమి పూజ చేస్తామని పేర్కొన్నారు. కొత్త ఆలయ నిర్మాణం పూర్తయితే అన్నదానం కూడా ప్రారంభిస్తామన్నారు. చెన్నై నుంచి వెళ్లే కాలినడక భక్తులు సేద తీరేందుకు మార్గమధ్యలో ప్రతి 25 కిలోమీటర్లకు ఒక విడిది కేంద్రం నిర్మించేలా చర్యలు చేపట్టామన్నారు. స్థానిక రాయపేటలోని ఎకరన్నర స్థలంలో కల్యాణమండపం నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. ప్రతి మూడునాలుగు నెలలకు ఒకమారు రాష్ట్రంలో శ్రీవారి కల్యాణం నిర్వహించాలని నిర్ణయించామన్నారు. కన్యాకుమారి, తిరుచ్చి, మదురై, కోయంబత్తూరు తదితర ప్రాంతాల్లోనూ వరుసగా కల్యాణం చేయనున్నామన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా స్వామివారి దర్శనం కలిగేలా అన్ని రకాల వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. వేలూరులోని శ్రీవారి ఆలయ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. ఆలయ అభివృద్ధి పనుల కోసం అన్ని రకాలుగా సహకరిస్తున్న తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి కృతజత్ఞలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు డాక్టర్ శంకర్, మాజీ బోర్డు సభ్యులు కుమారగురు, డిప్యూటీ ఈవో విజయకుమార్‌తో పాటు పలువురు ప్రముఖులు, ఎల్‌ఏసీ మాజీ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం కరుణకరరెడ్డి బృందం ఆలయ విస్తరణకు అవసరమయ్యే స్థలాన్ని పరిశీలించింది. అనంతరం పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఇదిలా వుండగా టి.నగర్‌లోని శ్రీవారి ఆలయ విస్తరణకు అవసరమైన భూమి కొనుగోలు కోసం ‘ట్రూ వ్యాల్యూ హోం’ (టీవీహెచ్) సంస్థ ప్రతినిధి రవిచంద్రన్ రూ.కోటి చెక్కును కరుణాకరరెడ్డికి అందజేశారు. కార్యక్రమంలో భాగంగా ఓ ఆంగ్ల దినపత్రిక ముద్రించిన ‘తిరుమల ద సెవెన్ హిల్స్ ఆఫ్ సాల్వేషన్’ పుస్తకాన్ని కరుణాకరరెడ్డి, శేఖర్ తదితరులు స్వామివారి సమక్షంలో లాంఛనంగా ఆవిష్కరించారు.