Nitish meets Rahul: నితీశ్-రాహుల్ సమావేశంపై బీజేపీ ఏమందంటే?
ABN , First Publish Date - 2023-04-12T18:00:31+05:30 IST
రాహుల్‌కు నితీశ్ ఒంగిపోయి నమస్కరిస్తున్న ఫొటో జత చేసి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి అభ్యర్ధి ఎవరో బీహార్ ముఖ్యమంత్రి, జేడియూ అధినేత నితీశ్ కుమార్ (JDU chief Nitish Kumar) కానీ, కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) కానీ చెప్పలేకపోయారని బీజేపీ(BJP) ఎద్దేవా చేసింది. అధికారం కోసం నితీశ్ కుమార్ ఇంకా ఎవరెవరి ముందు ఒంగుతారోనంటూ బీహార్ బీజేపీ అధ్యక్షుడు సమ్రాట్ చౌధరి (Bihar BJP President Samrat Choudhary) వ్యాఖ్యానించారు. రాహుల్‌కు నితీశ్ ఒంగిపోయి నమస్కరిస్తున్న ఫొటో జత చేసి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఆర్జేడీకి దగ్గరవడం ద్వారా నితీశ్ అవినీతిపరుల పంచన చేరారని, మున్ముందు ఇంకెందరు అవినీతిపరులను కలుస్తారోనని సమ్రాట్ చౌధరి వ్యాఖ్యానించారు.
అంతకు ముందు నితీశ్, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీయాదవ్‌తో కలిసి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Congress president Mallikarjun Kharge) ఢిల్లీ నివాసానికి వెళ్లారు. అప్పటికే అక్కడకు చేరుకున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వీరికి స్వాగతం పలికారు. అనంతరం అందరూ గ్రూప్ ఫొటోలు దిగారు. ఆ తర్వాత 2024 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్షాల మధ్య ఐక్యతను సాధించడంపై చర్చించారు. కాంగ్రెస్ అనుకూల పార్టీలతో పాటు కాంగ్రెసేతర పార్టీలను కూడా సంప్రదించాలని నిర్ణయించారు. ప్రధాని అభ్యర్ధి ఎవరనేదానికన్నా, ప్రతిపక్షాలన్నింటినీ ఒకేతాటిపైకి తీసుకురావడమే లక్ష్యంగా చర్చలు సాగినట్లు సమాచారం.
బీహార్‌లో ప్రస్తుతం జేడియూ-ఆర్జేడీ-కాంగ్రెస్ మహాఘట్‌బంధన్ సంకీర్ణ సర్కారు కొనసాగుతోంది. 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 74, జేడియూ 43 స్థానాల్లో గెలుపొందగా ఆర్జేడీ 75 స్థానాల్లో, కాంగ్రెస్ 19 చోట్ల, ఇండిపెండెంట్లు 31 మంది గెలిచారు. 2015 ఎన్నికలతో పోలిస్తే బీజేపీ 21 చోట్ల అదనంగా గెలవగా, జేడియూ 28 చోట్ల ఓడిపోయింది. 2020 అసెంబ్లీ ఎన్నికల తర్వాత జేడియూ-బీజేపీ ఎన్డీయే సర్కారును ఏర్పాటు చేశాయి. అయితే ఆ తర్వాత కొంత కాలానికి 2022 ఆగస్ట్‌లో నితీశ్ బీజేపీకి గుడ్‌బై చెప్పి ఆర్జేడీ, కాంగ్రెస్‌తో చేతులు కలిపారు. సంకీర్ణ సర్కారును ఏర్పాటు చేశారు.
2024 ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థి నితీశేనని తొలుత ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రచారాన్ని ఆయన తోసిపుచ్చారు. రాహుల్ ప్రధాని అభ్యర్థిత్వానికి మద్దతు కూడా ఇచ్చారు. అయితే ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. రాహుల్‌పై అనర్హత వేటు పడటంతో కాంగ్రెస్ తరపున ప్రధాని అభ్యర్ధి ఎవరనేది తేలాల్సి ఉంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వాన్ని ఇష్టపడని అనేక పార్టీలున్నాయి. ఉదాహరణకు తృణమూల్‌కు, ఆమ్ ఆద్మీ పార్టీకి కాంగ్రెస్ నేతృత్వం గిట్టదు. మమత, కేజ్రీవాల్ కూడా ప్రధాని అభ్యర్థి కావాలని కోరుకుంటున్నారు. దేశానికి చదువుకున్న ప్రధాని కావాలంటూ కేజ్రీవాల్ తాను ప్రధాని పదవికి సరైన అభ్యర్ధినని చెప్పకనే చెబుతున్నారు. ఇక మమత పశ్చిమబెంగాల్‌లో కాంగ్రెస్‌కు దాదాపు ఉనికి లేకుండా చేశారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ గెలిచేసరికి బీజేపీ, సీపీఎం, కాంగ్రెస్‌కు సహకరించడం వల్లే కాంగ్రెస్ అభ్యర్ధి గెలిచారని, భవిష్యత్తులో తాను కాంగ్రెస్‌తో చేతులు కలపబోనని స్పష్టం చేశారు. బిజూ జనతాదళ్ అధినేత నవీన్ పట్నాయక్ దాదాపు అన్ని కూటములకూ దూరంగా ఉన్నారు. కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వైఖరి ఈ ఏడాది ఆఖరులో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చే ఫలితాలను బట్టి స్పష్టమౌతుంది. ఎన్సీపీ, ఉద్దవ్ శివసేన ఇప్పటికే కాంగ్రెస్ కూటమిలోనే ఉన్నాయి. వామపక్షాలు కాంగ్రెస్ నేతృత్వానికి అభ్యంతరం లేదని ప్రకటించాయి. డీఎంకే అధినేత స్టాలిన్ కూడా కాంగ్రెస్ కూటమిలోనే కొనసాగుతున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఏ కూటమిలో ఎవరు చేరతారనేది స్పష్టమౌతుంది.