BJP - AIADMK: బీజేపీకి అన్నాడీఎంకే రాం.. రాం..?

ABN , First Publish Date - 2023-07-07T10:40:26+05:30 IST

మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం జరిగిన పరిణామాల నుంచి బీజేపీ(BJP) కనుసన్నల్లో నడుస్తున్న అన్నాడీఎంకే... ఇకపై స్వతంత్రంగా

BJP - AIADMK: బీజేపీకి అన్నాడీఎంకే రాం.. రాం..?

- బీజేపీకి దూరంగా అన్నాడీఎంకే?

- అన్నామలైతో కార్యక్రమం నిర్వహించిన నేతపై వేటు

చెన్నై, (ఆంధ్రజ్యోతి): మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం జరిగిన పరిణామాల నుంచి బీజేపీ(BJP) కనుసన్నల్లో నడుస్తున్న అన్నాడీఎంకే... ఇకపై స్వతంత్రంగా వ్యవహరించేందుకు సిద్ధమైందా?.. కాషాయ పార్టీకి దూరంగా జరగాలని నిర్ణయించుకుందా?.. బీజేపీని వదిలించుకుంటే తప్ప, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తగినన్ని స్థానాలు దక్కించుకోలేమని తలపోస్తోందా?... అవుననే అంటున్నాయి ఆ పార్టీలోని విశ్వసనీయ వర్గాలు. ఇందులో భాగంగానే ఉమ్మడి పౌరస్మృతి చట్టానికి మద్దతిచ్చే ప్రసక్తే లేదని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్‌) తెగేసి చెప్పారని ఆ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. పరిస్థితిని గ్రహించడం వల్లనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై హూటాహూటీన ఢిల్లీ వెళ్లి, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారని పేర్కొంటున్నాయి.

అసెంబ్లీ ఎన్నికల నుంచీ...

గత అసెంబ్లీ ఎన్నికల నుంచి బీజేపీ - అన్నాడీఎంకే(BJP - AIADMK) మధ్య సఖ్యత తగ్గుతూ వస్తోంది. ఈ కారణంగానే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఆ రెండు పార్టీలు వేర్వేరుగా పోటీ చేశాయి. ఆ తరువాత జరిగిన ఈరోడ్‌ తూర్పు ఎన్నికలోనూ బీజేపీ... అన్నాడీఎంకేకు సరిగ్గా సహకరించలేదని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనికి తోడు ఆది నుంచి పార్టీని అంటిపెట్టుకుని వున్న వీ.కే.శశికళ(VK Shashikala)ను, ఆమె సన్నిహిత బంధువు టీటీవీ దినకరన్‌, మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వంను పార్టీలో చేర్చుకోవాలంటూ బీజేపీ పెద్దలు ఈపీఎ్‌సకు చెబుతున్నారు. వారి చేరికతో అన్నాడీఎంకే మరింత బలోపేతమవుతుందని, తద్వారా వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తమ కూటమికి తగినన్ని స్థానాలు వస్తాయని కూడా వారు హితవు పలికారు. అయితే శశికళ, ఓపీఎ్‌సలను చేర్చుకునేందుకు ససేమిరా అంటున్నా ఈపీఎస్‌.. ఈ వ్యవహారంలో బీజేపీ పెద్దలు ఏకపక్షంగా పెత్తనం చెలాయిస్తున్నారంటూ అసంతృప్తితో ఉన్నారు. దీనికి తోడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై డీఎంకేతో పాటు తమ నేతల్ని కూడా విమర్శించడాన్ని అన్నాడీఎంకే జీర్ణించుకోలేకపోతోంది. అవినీతి కేసులో కోర్టు శిక్ష విధించిన ఏకైక ముఖ్యమంత్రి జయలలిత అంటూ అన్నామలై చేసిన వ్యాఖ్యలు కూడా అన్నాడీఎంకే శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహం రేపుతోంది. అప్పటి నుంచి రెండు పార్టీల నడుమ దూరం మరింత పెరిగింది. తమతో పొత్తు పెట్టుకుని నాలుగు ఎమ్మెల్యే స్థానాలను దక్కించుకున్న బీజేపీ.. తమనే విమర్శించడమేంటంటూ పలువురు సీనియర్లు బహిరంగంగానే ఈపీఎ్‌సను నిలదీస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం చెనైలో జరిగిన అన్నాడీఎంకే జిల్లా కార్యదర్శుల సమావేశంలో ఉమ్మడి పౌరస్మృతి చట్టానికి తాము పూర్తి వ్యతిరేకమని ఈపీఎస్‌ ప్రకటించారు.

nani6.2.jpg

లోక్‌సభ ఎన్నికల్లో నష్టం...

రాష్ట్రంలో ముస్లింలు, క్రైస్తవులు చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నారు. ఉమ్మడి పౌరస్మృతి చట్టాన్ని ఈ రెండు వర్గాలతో పాటు మెజారిటీ వర్గంలోనూ కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు ఆ చట్టాన్ని కేంద్రంలోని బీజేపీ రూపకల్పన చేస్తోంది. ఇప్పుడు ఆ చట్టానికి మద్దతు పలికితే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తమ పుట్టి మునగడం ఖాయమని అన్నాడీఎంకే నేతలు భావిస్తున్నారు. ఇప్పుడిప్పుడే మెరుగవుతున్న పార్టీ స్థితిని మరింత పటిష్ఠపరచుకునేందుకే అన్నాడీఎంకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నిజానికి పార్లమెంటులో అన్నాడీఎంకేకు చెప్పుకోదగిన సంఖ్యాబలమేమీ లేదు. లోక్‌సభలో మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం కుమారుడు రవీంద్రనాథ్‌ మాత్రమే ఉన్నారు. ఆయన ఎన్నిక కూడా చెల్లదని మద్రాస్‌ హైకోర్టు తేల్చేసింది. దీంతో లోక్‌సభలో అన్నాడీఎంకేకి సభ్యులే లేకుండాపోయారు. ఇక రాజ్యసభలో కేవలం నలుగురు సభ్యులు మాత్రమే ఉన్నారు. అందువల్ల తమ మద్దతు ఉన్నా, లేకున్నా పార్లమెంటులో బీజేపీకి వచ్చిన నష్టమేమీ లేదని ఈపీఎస్‌ భావిస్తున్నట్లు తెలిసింది. అందుకే ఉమ్మడి పౌరస్మృతి చట్టానికి వ్యతిరేకమని ప్రకటించడం ద్వారా రాష్ట్రంలో మైనారిటీ ఓట్లను ఆకర్షించడంతో పాటు బీజేపీకి పరోక్ష హెచ్చరికలు పంపినట్లవుతుందని ఈపీఎస్‌ యోచించినట్లు సమాచారం. తమను తక్కువ చేసి ఇష్టానుసారంగా మాట్లాడితే తమ దారి తాము చూసుకుంటామని ఈపీఎస్‌ హెచ్చరించినట్లయిందని అన్నాడీఎంకేలోని కొన్ని వర్గాలు చెబుతున్నాయి. అయితే మరికొంతమంది నేతలు మాత్రం ఈ వ్యవహారంలో ఈపీఎస్‌ సీరియ్‌సగా ఉన్నారని, బీజేపీతో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారని చెబుతున్నారు. బీజేపీ వల్ల తమకు నష్టమే తప్ప, కొత్తగా కలిగే లాభమేమీ లేదని అన్నాడీఎంకేకు చెందిన ఓ సీనియర్‌ నేత విశ్లేషించారు. ఇదిలా ఉండగా విల్లుపురం జిల్లా ‘పురచ్చితలైవి జయలలిత పేరవై’ కార్యదర్శి మురళి నేతృత్వంలో ఇటీవల జరిగిన సామూహిక వివాహానికి అన్నామలై హాజరయ్యారు. ఈ నేపథ్యంలో మురళిని తమ పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు అన్నాడీఎంకే ప్రకటించింది. ఈ తొలగింపే బీజేపీతో పొత్తుపై ఈపీఎస్‌ అంతరంగాన్ని తేటతెల్లం చేస్తోందని సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు.

నడ్డాతో అన్నామలై భేటీ

ఉమ్మడి పౌరస్మృతి చట్టానికి తాము వ్యతిరేకమంటూ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఈపీఎస్‌ ప్రకటించిన నాలుగు గంటలకే అన్నామలై హూటాహూటీన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. బుధవారం రాత్రి 8.30 గంటలకు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. అన్నాడీఎంకే ప్రకటనకు ముందు జరిగిన పరిణామాలను వివరించిన అన్నామలై.. మునుముందు తీసుకోవాల్సిన నిర్ణయాల గురించి కూడా చర్చించినట్లు తెలిసింది. అన్నాడీఎంకేతో పొత్తు కొనసాగించాలా వద్దా అన్నదానిపై ఆయన జేపీ నడ్డా(JP Nadda)తో మాట్లాడినట్లు తెలిసింది. అనంతరం గురువారం ఉదయం ఆయన తిరిగి రాష్ట్రానికి చేరుకున్నారు. అయితే పలు రాష్ట్రాల అధ్యక్షుల మార్పు నేపథ్యంలో తన భవితవ్యం ఏంటన్నదానిపై స్పష్టత తీసుకునేందుకే అన్నామలై ఢిల్లీ వెళ్లారని, ఆయన పర్యటన ముందుగా నిర్ణయించుకున్నదేనని మరికొంతమంది నేతల సమాచారం.

Updated Date - 2023-07-07T10:40:26+05:30 IST