Karnataka Assembly elections: అభ్యర్థుల జాబితా ఖరారు చేసేందుకు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ

ABN , First Publish Date - 2023-04-09T18:47:55+05:30 IST

కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితా ఖరారు చేసేందుకు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ అయింది.

Karnataka Assembly elections: అభ్యర్థుల జాబితా ఖరారు చేసేందుకు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ
BJP Central Election Committee meets in Delhi

న్యూఢిల్లీ: కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో(Karnataka Assembly elections 2023) పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాను విడుదల చేసేందుకు భారతీయ జనతా పార్టీ(BJP) కేంద్ర ఎన్నికల కమిటీ న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సమావేశమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, మన్సుఖ్ మాండవీయ, ప్రహ్లాద్‌జోషి, శోభాకరంద్లాజె, కర్ణాటక సీఎం బస్వరాజ్ బొమ్మై(Chief Minister Basavaraj Bommai), పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు నళిన్‌కుమార్‌ కటీల్‌, మాజీ సీఎం ఎడ్యూరప్ప ఇతర బీజేపీ నేతలు సమావేశానికి హాజరయ్యారు. అభ్యర్థుల జాబితాను ఆదివారం లేదా సోమవారం ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ 166 మంది అభ్యర్ధులు, జేడీఎస్ 93 మంది అభ్యర్థులతో జాబితాలను విడుదల చేశాయి. బీజేపీ జాబితా ఆలస్యం కావడంపై ప్రతిపక్షాలు వ్యంగ్యాస్త్రాలు ప్రయోగిస్తున్నాయి కూడా. ఈ తరుణంలో బీజేపీ అభ్యర్థుల జాబితా వీలైనంత త్వరగానే రావడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. మరో 3 రోజుల్లో నోటిఫికేషన్‌ విడుదలై నామినేషన్‌ల ప్రక్రియ ప్రారంభం కానుంది. 30మందికి పైగా సిట్టింగ్‌లకు టికెట్లు లేనట్టేననే చర్చలు వినిపిస్తున్నాయి. ఇందులో నలుగురు దాకా మంత్రులు ఉన్నట్టు తెలుస్తోంది. తీర ప్రాంత జిల్లాల్లో 9 మంది, మధ్య కర్ణాటకలో ఆరుగురు, శివమొగ్గ, చిక్కమగళూరు(Shivamogga, Chikkamagaluru) ప్రాంతంలో ఐదుగురు, బెంగళూరు నగరంలో ఇద్దరు, బెళగావి(Belagavi) ప్రాంతంలో ఐదుగురు, బాగల్కోటెలో ఇద్దరు, రాయచూరు, కొప్పళ, ధారవాడలో ఒక్కొక్కరికిపైగానే టికెట్లు దక్కవనే ప్రచారం జరుగుతోంది. 224 నియోజక వర్గాలకు సంబంధించి సమగ్ర జాబితాను ఇప్పటికే సిద్ధం చేశారు. ఒక్కో నియోజకవర్గంలో రెండుకు మించి పేర్లు కూడా లేనట్టు తెలుస్తోంది. తొలిరోజు జరిగిన పార్లమెంటరీ బోర్డు సమావేశంలో దాదాపు వంద సీట్లపై ఒక అభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం.

మరోవైపు అధికారంలో ఉన్న పార్టీ కావడం, మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ జాబితాలు ప్రకటించాక తలెత్తిన అసంతృప్తిని దృష్టిలో ఉంచుకుని బీజేపీ అధిష్టానం దిద్దుబాటు చర్యలకు సిద్ధమయింది. టికెట్లు దక్కనివారు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆశావహులైనా అసంతృప్తికి తావుండకూడదని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని బట్టి ఎవరికి టికెట్‌ రాదో కూడా కొందరికి అర్థమైనట్టు తెలుస్తోంది. ఇక ఎమ్మెల్యేలు, మంత్రులుగా వ్యవహరించినవారు అసంతృప్తికి లోనై తిరగబడితే ఇప్పటిదాకా పార్టీ ద్వారా జరిపిన సర్వేల నివేదికలు, ఇతర అంశాలు చూపి హెచ్చరికలు జారీ చేసేందుకు సిద్ధమైనట్టు సమాచారం.

224మంది సభ్యులున్న కర్ణాటక అసెంబ్లీలో బీజేపీకి 119మంది, కాంగ్రెస్‌‌కు 75 మంది, జేడీఎస్‌కు 28మంది సభ్యులుండగా 2సీట్లు ఖాళీగా ఉన్నాయి.

కర్ణాటక (Karnataka)లో మే 10న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఓట్ల లెక్కింపు మే 13న జరుగుతుందని ఎన్నికల కమిషన్ ప్రకటించింది.

Updated Date - 2023-04-09T19:06:12+05:30 IST